Saturday, July 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యా కమిషన్ సిఫారసులు నిలిపివేయాలి: టీపీటీఎఫ్

విద్యా కమిషన్ సిఫారసులు నిలిపివేయాలి: టీపీటీఎఫ్

- Advertisement -

నవతెలంగాణ -పెద్దవంగర
తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ (టీపీఎస్) పేరుతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల పునర్వ్యవస్థీకరణకు దారితీసే విద్యా కమిషన్ సిఫారసులను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పులిచింత విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. పెద్దవంగర మండలంలోని బొమ్మకల్, వడ్డెకొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఉపాధ్యాయుల సమస్యలను సేకరించి, సభ్యత్వ నమోదు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న సుమారు 23 వేల ప్రభుత్వ పాఠశాలలను కుదించి నాలుగు వేల టీపీఎస్‌ లుగా మార్చే ప్రతిపాదన విద్యార్థులు, గ్రామీణ విద్యా వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగిస్తుందని అన్నారు. అధికారంలోకి వచ్చినప్పుడు మూతపడిన ప్రతి పాఠశాలను తిరిగి ప్రారంభిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పుడు ఉన్న పాఠశాలలనే తగ్గించే దిశగా అడుగులు వేయడం విచారకరమని విమర్శించారు. టీపీఎస్‌ల ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకుని, ప్రస్తుతం ఉన్న పాఠశాలలను కొనసాగించడంతో పాటు విద్యా కమిషన్ గుర్తించిన 52 అంశాల్లో అన్ని పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించాలని కోరారు.

రాష్ట్ర కౌన్సిలర్ చుంచు శ్రీశైలం మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను అమలు చేయాలని, విద్యారంగానికి 15 శాతం బడ్జెట్ కేటాయించాలని కోరారు. అలాగే పెండింగ్ బిల్లులు, ఆరు డీఏలను విడుదల చేసి, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలను సవరించే పీఆర్సీని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ సోమారపు ఐలయ్య, మండల అధ్యక్షుడు చిక్కాల సతీష్, మండల ప్రధాన కార్యదర్శి వల్లాల శ్రీనివాస్, కొండ్లె రమేష్, దయాకర్, లక్ష్మయ్య, కోట వెంకటేశ్వర్లు, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -