నవతెలంగాణ – హైదరాబాద్ : భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. ‘దక్షిణ భారత గాన కోకిల’గా సుపరిచితురాలైన ప్రముఖ నేపథ్య గాయని ఎస్. జానకి శనివారం కర్ణాటకలోని మైసూరులో కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆరు దశాబ్దాలకు పైగా తన మధుర స్వరంతో కోట్లాది మంది సంగీత ప్రియులను అలరించిన జానకమ్మ మరణంతో భారతీయ సంగీత రంగంలో ఒక శకం ముగిసింది.
ఎస్. జానకి మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన గాత్రంతో నవరసాలను పలికించిన ఆమె, తాను తెలుగు గడ్డపై జన్మించినందుకు ఎల్లప్పుడు గర్వంగా భావిస్తానని ఈ సందర్భంగా అన్నారు. ఆమె మరణం భారతీయ చిత్ర పరిశ్రమకు, సంగీత ప్రియులకు తీరని లోటని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. దక్షిణ భారత చలనచిత్ర సంగీత ప్రపంచంలో జానకి గారు తన గళమాధుర్యంతో శ్రోతల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని సీఎం కొనియాడారు. అనేక చిత్రాల్లో పాత్రోచితంగా, సన్నివేశాలకు అనుగుణంగా భావోద్వేగాలను పలికిస్తూ ఆమె పాడిన పాటలు సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేశాయని అన్నారు.


