పోక్సో కేసు పెట్టారన్న కక్షతో ఆరుగురి హత్య
బాధిత బాలిక, ఆమె తల్లి, నాయనమ్మ,
నిందితుడి భార్య, ఇద్దరు చిన్నారులను చంపిన వైనం
పోలీసుల నిర్లక్ష్యమే కారణమంటూ షాబాద్‌లో గ్రామస్తుల ఆందోళన
బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు
వచ్చిన ప్రతిపక్ష నేతల అడ్డగింత
నిందితున్ని కఠినంగా శిక్షిస్తాం : జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి
నవతెలంగాణ-షాబాద్
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో శనివారం తెల్లవారుజామున రక్తపాతం జరిగింది. ఓ దుర్మార్గుడు సృష్టించిన నరమేధంతో రాష్ట్రం ఉలిక్కిపడింది. తనపై పోక్సో కేసు పెట్టారన్న కక్షతో దుండగుడు.. బాధిత బాలిక, ఆమె తల్లి, నాయనమ్మతోపాటు అతని భార్య, ఇద్దరు చిన్నారులు ఇలా మొత్తం ఆరుగురుని హత్య చేశాడు. ఈ ఘటన రెండు గ్రామాలను విషాదంలో ముంచేసింది. పోక్సో కేసులో నిందితున్ని అరెస్టు చేయకుండా, జైలుకు పంపకుండా పోలీసులు నిర్లక్ష్యం చేయడం.. బాధిత బాలిక కుటుంబానికి రక్షణ కల్పించకపోవడంతోనే దుండగుడు ఈ మారణహోమం సృష్టించాడంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఓ బాలికపై లైంగిక వేధింపుల కేసులో దైవాలగూడకు చెందిన రాజ్‌కుమార్‌పై మే16న పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. అనంతరం అతడు బెయిల్ పొందాడు. తనపై కేసు నమోదు చేయించారనే కక్షతో శనివారం తెల్లవారుజామున షాబాద్ పీఆర్‌ఆర్ స్టేడియం సమీపంలోని బాలిక ఇంట్లోకి చొరబడ్డాడు. ముందుగా తనపై ఫిర్యాదు చేసిన చిట్యాల లక్ష్మి(45), ఆమె అత్త రుక్కమ్మ (65)ను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత బాలిక(17)ను దైవాలగూడ సమీపంలోని చెరువు వద్దకు తీసుకెళ్లి హత్య చేశాడు. అదే ఇంట్లో ఉన్న లక్ష్మీ పెద్ద కూతురు మానసిక వికలాంగురాలైన మేఘనను వదిలేశాడు. ఆ తర్వాత తన ఇంటికి వెళ్లి భార్య సరిత(30), ఇద్దరు పిల్లలు పరీక్షిత్(4), దైవిక్షిత్ (2)ను కత్తితో పొడిచి చంపాడు. అనంతరం పారిపోయాడు. కొంత దూరం వెళ్లాక.. తన తండ్రికి ఫోన్ చేసి ఆరుగురిని హత్య చేశానని, తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. అతను వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటనా స్థలాలకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల, ఉస్మానియా ఆస్పత్రులకు తరలించారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. నిందితుడు సరితను ప్రేమ వివాహం చేసుకున్నాడు.
ఉన్నతాధికారుల పర్యవేక్షణ
ఘటనా స్థలాన్ని ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి సందర్శించి, పరిస్థితిని సమీక్షించారు. జాయింట్ సీపీ చందనా దీప్తి, చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్, షాద్‌నగర్ డీసీపీ శిరీష, ఏసీపీ లక్ష్మీనారాయణ, ఇతర పోలీసు అధికారులు, క్లూస్ టీం సభ్యులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. చేవెళ్ల ఆర్డీవో పార్థసారధి రెడ్డి కూడా ఘటనా స్థలాన్ని సందర్శించారు.
పోలీసుల నిర్లక్ష్యంపై ఆగ్రహం
పోక్సో కేసు నమోదైనప్పటికీ నిందితుడిపై తగిన నిఘా పెట్టలేదని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు షాబాద్ ప్రధాన చౌరస్తాలో రాస్తారోకో చేశారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని, బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితుడికి కఠిన శిక్ష పడే వరకూ ఆందోళన విరమించబోమని స్పష్టం చేశారు. రాస్తారోకోలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, పట్నం అవినాష్ రెడ్డి, బర్క కృష్ణ, రాము, తమ్మలి రవీందర్, వెంకట్ యాదవ్, జడల రాజేందర్ గౌడ్, రాహుల్ గుప్తా, దేవేందర్ రెడ్డి, గౌరీ, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. బాధిత కుటుంబ సభ్యుల రోదనలతో షాబాద్ చౌరస్తా హృదయ విదారకంగా మారింది.
నిందితులను కఠినంగా శిక్షిస్తాం : జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి
నిందితుడు ఆరుగురిని హత్య చేయడం ఎంతో దురదృష్టకరమని, నిందితున్ని కఠినంగా శిక్షించి బాధితులకు న్యాయం చేస్తామని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. తక్షణ సహాయంగా బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు ప్రకటించారు. మానసిక వికలాంగురాలు మేఘనను ఆదుకుంటామని తెలిపారు. ఆమెకు రెండు పడకల గదిని నిర్మించి ఇస్తామని, అన్ని రకాలుగా సౌకర్యాలు సమకూర్చి వసతి గృహంలో ఉండేలా ప్రభుత్వం నుంచి హామీ ఇస్తున్నట్టు తెలిపారు. పోక్సో కేసులో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై చర్యలు తీసుకుంటామన్నారు. దీంతో శాంతించిన బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు రాస్తారోకో విరమించారు.
ప్రతిపక్ష నేతల అడ్డగింత
బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు బయలుదేరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర నాయకులు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు చేవెళ్లలోనే అడ్డుకున్నారు. ఘటనా స్థలానికి వారు వెళ్లేందుకు అనుమతి నిరాకరించారు. దాంతో కొద్దిసేపు బీఆర్‌ఎస్ నేతలు, పోలీసుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. చివరికి పోలీసులు బీఆర్‌ఎస్ నేతలను అదుపులోకి తీసుకుని చేవెళ్ల పీఎస్‌కు తరలించారు.
షాబాద్ ఎస్ఐపై సస్పెన్షన్ సీఐపై విచారణ
పోక్సో కేసు నిందితుడు రాజ్‌కుమార్‌పై సకాలంలో తగిన చర్యలు తీసుకోకపోవడంతోపాటు విధుల్లో నిర్లక్ష్యం వహించిన షాబాద్ ఎస్‌ఐ రమేష్‌ను సస్పెండ్ చేసినట్టు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. అలాగే, సీఐ కాంతారెడ్డిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించినట్టు వెల్లడించారు.
నిందితుడి ఆచూకీ తెలిపితే రూ.2 లక్షల రివార్డు
ఆరు హత్యలు చేసి పరారీలో ఉన్న నింది తుడు రాజ్‌కుమార్ ఆచూకీ తెలిపినా.. పట్టిం చేందుకు సహకరించిన వారికి రూ.2లక్షల రివార్డు అందజేస్తామని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ప్రకటించారు. సమాచారం అం దించిన వ్యక్తి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు, వారి భద్రతకు పూర్తి హామీ ఇస్తామని చెప్పారు. నిందితుడి గురించి ఏవైనా వివరాలు తెలిసిన వారు చేవెళ్ల పోలీస్ కంట్రోల్ రూమ్ 87126 65324 నంబర్‌కు ఫోన్ కాల్ లేదా వాట్సప్ ద్వారా సమాచారం అందించొచ్చని సూచించారు. నిందితుడి కోసం ఇప్పటికే ఏడు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. త్వరలోనే అరెస్టు చేసి చట్టం ముందు నిలబెడతామన్నారు. ప్రజలు వదంతులను నమ్మొద్దని, శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతమూ కలగకుండా బాధ్యతా యుతంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
-ఫ్యూచర్ సిటీ సీపీ తరుణ్ జోషి
షాబాద్‌లో రక్తపాతం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


