‘అలసస్య కుతో విద్యా అవిద్యస్య కుతో ధనమ్! అధనస్య కుతో మిత్రం అమిత్రస్య కుతః సుఖమ్!!’ అనేది సంస్కతంలో ప్రసిద్ధ శ్లోకం. వ్యక్తిత్వ వికాసానికి మానవ పురోగతికి బద్ధకమే శత్రువని దీని తాత్పర్యం. అలసత్వానికి Negligence, Laziness, Slackness అనేవి ఆంగ్లంలో పర్యాయపదాలు. బద్ధకస్తుడు చదువుకోవడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపడు. అందుకే అతను విజ్ఞానాన్ని నైపుణ్యాలను సంపాదించలేడు. అందువల్ల మంచి వృత్తి, ఉపాధి దొరకదు. మంచి వృత్తి, ఉపాధి లేని కారణంగా సంపాదన ఉండదు, సంపద లేనివాళ్లకు స్నేహితులు ఉండరు. స్నేహితులు, బంధువులు లేని ఒంటరి జీవితంలో ఆనందం, సుఖం ఉండవు. బద్దకమే కష్టాలన్నిటికి మూలం అంటున్న పై శ్లోకం శబ్దార్థాలను విప్పిచెప్పి ఉపాధ్యాయులు కంఠస్థం చేయించాలి.
ఇంతకు అలసత్వం లేదా బద్దకం ఎందుకు మనుషుల్లో ఏర్పడుతుందని ఆలోచిస్తే ప్రధానంగా ఐదుకారణాలు కన్పిస్తున్నాయి. అవి 1. లక్ష్యం లేకపోవడం, 2. అనారోగ్యం, 3. మానసిక ఒత్తిళ్లు, ఆందోళన, 4. వాయిదావేసే తత్వం, 5. అతిగా ఫోన్ వాడటం.. ఇత్యాది కారణాల వల్ల వ్యక్తులకు అలసత్వం అలవడుతుంది. మొదట ప్రస్తావించినట్టు అలసత్వం ఎంతటి ప్రమాదకారో ‘For want of a nail the shoe was lost ‘ ఒక చిన్న మేకును నిర్లక్ష్యం చేయడం వల్ల గుర్రపు నాడా ఊడిపోయింది,Negligence is the mother of all disasters ‘ నిర్లక్ష్యం అనేది అన్ని రకాల విపత్తులకు మూలం, ‘An idle brain is the devils workshop’ పనిలేని మనుషి బుర్ర దెయ్యాలకు కార్ఖానా వంటిది’ మొదలైన సామెతలను గమనిస్తే తెలుస్తుంది.
బద్ధకం పోవాలంటే ఏం చేయాలి?
డాక్టర్ జోసెఫ్ ఫెరారీ, డాక్టర్ పియర్స్ స్టీల్, డాక్టర్ తిమోతి పైచిల్, డాక్టర్ ఫుసియా సిరోయిస్ తదితర మనోవైద్యులు సూచించిన పరిష్కార మార్గాలు ఇవి. 1.పెద్ద లక్ష్యం దాని సాధన అలవాటు లేనందువల్ల చిన్న లక్ష్యాలను పెట్టుకోవాలి. ఒక వేళ లక్ష్యం పెద్దదే అయితే దాన్ని చిన్న భాగాలుగా విభజించి పూర్తి చేయాలి. 2. రోజువారీ పనుల కోసం ఒక టైమ్ టేబుల్ రాసుకుని చేస్తూపోవాలి. 3. రోజుకు 7-8 గంటలు నిద్రపోవాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. 4. రోజుకు కనీసం ఓ ఇరవై నిమిషాలు నడవడం లేదా వ్యాయామం చేయడం వల్ల శరీరం చురుగ్గా మారుతుంది. 5. నిద్రనుంచి మేల్కొన్న మొదటి ఐదు నిమిషాలు ఏదైనా పనిని ఆపకుండా, కనీసం ఐదు నిమిషాలైనా చేయడానికి ప్రయత్నించాలి. కొన్ని రోజుల తర్వాత క్రమంగా పని అలవాటవుతుంది. 6. చదువుకునేటప్పుడు లేదా పని చేసేటప్పుడు ఫోన్‌ను దూరంగా ఉంచాలి. ముఖ్యంగా విద్యార్థులు బద్ధకం నుండి బయటపడటానికి వ్యక్తిగత టైమ్ టేబుల్ లేదా స్టడీ ప్లాన్ తయారు చేసుకోవాలి.
అలసత్వానికి మరి కొన్ని కారణాలు
1.డోపమైన్ అసమతుల్యత: ((Dopamine Detox Lack): మన మెదడు తక్షణ ఆనందాన్ని(Instant Gratification) కోరుకుంటుంది. చదవడం లేదా పని చేయడం వల్ల ఫలితం ఆలస్యంగా వస్తుంది. కానీ ఫోన్ చూడటం, నిద్రపోవడం వల్ల వెంటనే ఆనందం లభిస్తుంది. అందుకే మెదడు సులువైన పనుల వైపు మొగ్గుచూపుతుంది.
2. భయం, పరిపూర్ణత : (Perfectionism & Fear of Failure): నేను ఈ పనిని పరిపూర్ణంగా చేయలేనేమో లేదా ఓడిపోతానేమో అనే భయం వల్ల చాలా మంది అసలు పనే ప్రారంభించరు. దీనినే ‘పనిని వాయిదా వేయడం(Procrastination) అంటారు.
3. అస్పష్టత (Lack of Clarity): ఏ పనిని ఎలా ప్రారంభించాలో, ఎక్కడ ముగించాలో తెలియనప్పుడు గందరగోళం ఏర్పడి బద్ధకం ఆవహిస్తుంది.
4. శారీరక బలహీనతలు: రక్తహీనత, విటమిన్ డి లేదా విటమిన్ బి12 (Vitamin B12) లోపాలు ఉన్నప్పుడు శరీరం ఎప్పుడూ అలసటగా అనిపించడం వల్ల పనిచేయాలనిపించదు.
బద్ధకం వదిలించుకోవడానికి (Action Plan)
1. బద్ధకాన్ని కేవలం ఆలోచనలతో పోగొట్టలేము, దానికి కొన్ని పద్ధతులు పాటించాలి: పొమోడోరో టెక్నిక్ (Pomodoro Technique) ఏదైనా పనిని 25 నిమిషాల పాటు పూర్తి ఏకాగ్రతతో చేయడం. ఆ తర్వాత 5 నిమిషాలు విరామం(Break) తీసుకోవడం. ఇలా 4 సార్లు చేసిన తర్వాత 20 నిమిషాలు పెద్ద బ్రేక్ తీసుకోవాలి. ఇది మెదడు అలసిపోకుండా చూస్తుంది.
2. టు-మినిట్ రూల్ (2-Minute Rule): మీరు చేయాల్సిన పనిని ప్రారంభించడానికి కేవలం 2 నిమిషాలు మాత్రమే పడుతుంది అనుకుంటే, దానిని వెంటనే చేయాలి (ఉదాహరణకు: పుస్తకం తెరవడం, బెడ్ సర్దడం, ఈమెయిల్ రిప్లై ఇవ్వడం).
3. ఐసెన్‌హోవర్ మ్యాట్రిక్స్ (Eisenhower Matrix): ‘అత్యవసరం-ముఖ్యం: ఈ రోజు కచ్చితంగా చేయాల్సిన పనులు. ముఖ్యమే కానీ అత్యవసరం కాదు: చదువు, వ్యాయామం (వీటికే ఎక్కువ సమయం ఇవ్వాలి). అత్యవసరం కానీ ముఖ్యం కాదు: ఇతరుల ఫోన్ కాల్స్’ ఇట్లా పనులను నాలుగు భాగాలుగా విభజించుకోవడం ద్వారా బద్దకాన్ని జయించవచ్చు.
సాహిత్యపరంగా చూస్తే
అలసత్వాన్ని అధిగమించడానికి తెలుగులో అనువాద గ్రంథాలు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ‘అతికష్టమైన పని అన్నిటికంటే ముందు’ ఇది Brian
Tracy రాసిన Eat That Frog!: 21 Great Ways to Stop Procrastinating and Get More Done in Less Time గ్రంథానికి మద్దూరి రాజ్యశ్రీ చేసిన అనువాదం ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన పుస్తకం కూడా. మనకున్న పనులలో అత్యంత కష్టమైన వాటిని ఎట్లా పూర్తి చేయాలనే విషయంపై 21 అద్భుతమైన సూత్రాలతో ఈ పుస్తకం ప్రేరణ కలిగిస్తుంది. డారియస్ ఫోరాక్స్Do It Today (Overcome Procrastination,Improve Productivity) పుస్తకంలో పనులను వాయిదా వేసే అలవాటును మానుకుని, ఉత్పాదకతను, నైపుణ్యాలను ఎట్లా పెంచుకోవాలో సులువుగా వివరించాడు. యండమూరి వీరేంద్రనాథ్ – విద్యార్థులు, యువత తమ ఏకాగ్రతను దెబ్బతీసే బద్ధకాన్ని వదిలి, విజయం వైపు ఎలా నడవాలో ఆచరణాత్మక చిట్కాలతో అలరించే పుస్తకం విజయానికి ఐదు మెట్లు. Atomic Habits అనే గ్రంథంలో జేమ్స్ క్లియర్ – చిన్న చిన్న అలవాట్లను మార్చుకోవడం ద్వారా బద్ధకాన్ని శాశ్వతంగా ఎట్లా రూపుమాపవచ్చునో శాస్త్రీయంగా నిరూపించాడు.The 5 Second Rule – మెల్ రాబిన్స్ రాసిన ఈ పుస్తకం బద్ధకం అనిపించినప్పుడు మన మెదడు వంద కారణాలు వెతుకుతుంది.
అలా కాకుండా 5-4-3-2-1 అని లెక్కపెట్టి వెంటనే పనిని ప్రారంభించడమెట్లానో నేర్పుతుంది. సమయాన్ని వాయిదా వేయడం అంటే మన జీవితాన్ని మనకు మనం వెనక్కి నెట్టడమే. బద్ధకం అనేది ఒక శాశ్వత లోపం కాదు, అది కేవలం ఒక అలవాటు మాత్రమే. ‘అటామిక్ హ్యాబిట్స్’ చెప్పినట్టు చిన్న చిన్న మార్పులతోనైనా లేదా ‘ఫైవ్ సెకండ్ రూల్’ చెబుతున్న సందేహం, భయం, సంకోచాన్ని ఎదుర్కొనే విధానం తెలుసుకొనైనా, తమకు నచ్చిన మరే ఇతర మోటివేషనల్ బుక్ ద్వారానైనా సరే విద్యార్థులు తమలోని అలసత్వాన్ని తొలగించుకోవడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించాలి. విద్యార్థులు కొత్తఏడాదిలోకి పై తరగతుల్లోకి అడుగిడిన శుభసందర్భాన ఉపాధ్యాయులు సైతం అలసత్వ నివారణ గురించే తొలిపాఠం చెప్పాలి. అలసత్వం నుండి, బద్దకం నుండి, వాయిదా వేసే స్వభావం నుండి బయటపడ్డారంటే విద్యార్థుల్లో inner enrichment మొదలైనట్టే.
– డా.బెల్లి యాదయ్య, 9848392690


