Sunday, July 12, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఎన్డీఎస్ఏనే ఫైనల్‌

ఎన్డీఎస్ఏనే ఫైనల్‌

- Advertisement -

ఆ సూచనలే అమలు చేస్తాం
వారు ఆమోదిస్తే మేడిగడ్డను ఈటలకు అప్పగిస్తాం…
గేట్లు దించకుండా కన్నెపల్లిలో ‌నీరెత్తిపోయడం అసాధ్యం
కాళేశ్వరంలో రిటైర్డ్‌ ఇంజినీర్లను జైళ్లకు పంపలేదు…అందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారు
బీఆర్‌ఎస్‌ హయాంలోనే పట్టిసీమ నిర్మాణం హరీశ్‌‌రావు అప్పుడెందుకు అడ్డుకోలేదు?
కాళేశ్వరంపై బీఆర్‌ఎస్‌ ‌దుష్ప్రచారం

సీబీఐ విచారణ కోరాం…కేంద్రం స్పందించదేం? : సీఎం రేవంత్‌‌రెడ్డి ఫైర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌పై నేషనల్‌ ‌డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌‌డీఎస్‌ఏ) సూచనలే ఫైనల్‌ అనీ, రాష్ర్ట ప్రభుత్వం వాటినే అమలు చేస్తుందని సీఎం ఏ రేవంత్‌‌రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ ఎన్డీఎస్‌ఏను కలిసి నీళ్లు ఎత్తిపోయాలని కోరితే, సంపూర్ణంగా సహకరిస్తామన్నారు. మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోసే బాధ్యతను ఆయనకే అప్పగిస్తామని చెప్పారు. మాజీ మంత్రి టీ హరీశ్‌‌రావు మాటలనే ఈటల రాజేందర్‌ ‌వల్లె వేస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ ఎంపీ బీఆర్‌ఎస్‌‌కు ఎందుకు దగ్గరవుతున్నారో అర్థం చేసుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు సాంకేతిక అంశాలపై కనీస అవగాహన లేకుండా మాట్లాతున్నారని విమర్శించారు. శనివారం హైదరాబాద్‌‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీ) లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌‌లతో కలిసి సీఎం మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీరు నింపకూడదని ఎన్డీఎస్ఏ స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్ చెబుతున్నట్టు పారుతున్న నీళ్లను ఎత్తిపోసే అవకాశం ఉంటే అసలు బ్యారేజీలు కట్టే అవసరమేంటని ప్రశ్నించారు. బ్యారేజీలు కడ్డటం అంటేనే పారుతున్న నీళ్లను నిలిపి, వాటిని ఎత్తిపోయాల్సి ఉంటుందని వివరించారు. కన్నెపల్లి దగ్గర ఎత్తిపోతలకు అవకాశమే లేదన్నారు. ప్రాజెక్టు పునరుద్ధరణపై ఎవరెన్ని తప్పుడు ప్రచారాలు చేసినా రాష్ర్ట ప్రభుత్వం ఎన్డీఎస్ఏ కమిటీ సూచనల ప్రకారమే ముందుకెళుతుందని తేల్చిచెప్పారు. వాస్తవాలను పక్కనబెట్టి బీజేపీ, బీఆర్‌ఎస్‌‌లు ప్రజా ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టేందుకు కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. మాజీ మంత్రి హరీశ్‌‌రావు మతి భ్రమించి మాట్లాడుతున్నారనీ, ఆయన కమిషన్ల సంగతి తెలిసే గతంలో కేసీఆర్‌ ‌క్యాబినెట్‌‌లో చేర్చుకోకుండా పక్కనబెట్టారని ఆరోపించారు. అనేక విషయాల్లో ఆంధ్రా సంస్థలంటూ విమర్శించే హరీశ్‌రావు ఇప్పుడు నారాయణ, చైతన్య సంస్థలకు పాలు పోసి బతుకుతున్నారని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం బీఆర్‌ఎస్‌ హయాంలో పట్టిసీమను నిర్మించిందని గుర్తుచేశారు. ఆ ప్రాజెక్ట్‌ ‌ద్వారా ఏపీకి 105 టీఎంసీల నీటిని తరలించుకెళ్లినప్పుడు అప్పటి మంత్రి హరీశ్‌‌రావు ఏం చేశారని ప్రశ్నించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వినియోగంలోకి వస్తే పోలవరానికి నీళ్లు పోవని చెప్పగలరా? అని అడిగారు. 
బీఆర్‌ఎస్‌, బీజేపీలు తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణవాదం ముసుగులో కొంతమంది రిటైర్డ్‌ ఇంజినీర్లు మేడిగడ్డ నుంచి నీరు ఎత్తిపోయడంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఆ ప్రాజెక్టు పాపంలో భాగస్వాములు అయిన ఇంజినీర్లను జైళ్లకు పంపకపోవడం వల్లే అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డపై శ్యాంప్రసాద్‌‌రెడ్డి నేతృత్వంలో కేసీఆర్‌ వేసిన కమిటీ కూడా అక్కడ బ్యారేజీ నిర్మించడం సాధ్యం కాదని చెప్పిందని గుర్తు చేశారు. ఇప్పుడు అదే రిటైర్డ్‌ ఇంజినీర్లు రైతులను తప్పుదోవ పట్టిస్తూ, బీఆర్‌ఎస్‌‌కు వంతపాడుతున్నారని అన్నారు. ​

సాంకేతికంగా అసాధ్యం
ప్రస్తుత పరిస్థితుల్లో మేడిగడ్డ నుంచి నీరు ఎత్తిపోయడం సాధ్యం కాదని సీఎం స్పష్టం చేశారు. ‘2019లో కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించారు. 2020 మే18న మేడిగడ్డ బ్యారేజీలో లోపాలున్నాయని ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఇఇ) బీవీ.రమణారావు లేఖ రాశారు సమస్యను పట్టించుకోకపోవడంతో 2023 అక్టోబర్ 21న కుంగిపోయింది. ప్లానింగ్, డిజైనింగ్, ఆపరేషనల్ మెయింటెనెన్స్ లో లోపాలున్నాయని పది నెలల తర్వాత ఎన్డీఎస్ఏ తుది నివేదిక ఇచ్చింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నీటి నిల్వకు అనుకూలం కావని తేల్చిచెప్పింది. మూడు బ్యారేజీలు తీవ్రంగా దెబ్బతినటం వల్ల నీటిని మళ్లించటం సురక్షితం కాదని నివేదికలో పేర్కొంది. పునరుద్ధరణ డిజైన్లు,రిపేర్లు, ఇతర పనులన్నీ ఎన్డీఎస్ఏ లేదా సీడబ్ల్యుసీ ఆమోదంతోనే చేపట్టాలని సిఫారసు చేసింది. ప్రవాహం ఉండటం వేరు. పంపింగ్ కు అవసరమైన నీటిమట్టం ఉండటం వేరు. అక్కడ కనీస పంపింగ్ లెవల్ 93.50 మీటర్లు ఉండాలి. ప్రస్తుతం 89.90 మీటర్లే ఉంది. అన్నారం, సుందిళ్లలో కూడా గేట్లు మూస్తే తప్ప చుక్క నీరు నిల్వ ఉండదు. అలాంటప్పుడు నీళ్లు ఎత్తిపోయాలని చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమే అవుతుంది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీ వద్ద ఇదే పరిస్థితి ఉంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం 2026 జూన్‌ 30‌న ప్రత్యేక సాంకేతిక పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేసింది. మూడు బ్యారేజీలను పునరుద్ధరించకుండా నీరు నిపండం సాధ్యం కాదని తేల్చి చెప్పింది’ అని సీఎం వివరించారు.

​సీబీఐ విచారణ కోసం ఒత్తిడి తెస్తాం
కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌పై జస్టిస్‌ ‌ఘోష్‌ ‌కమిషన్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరితే, ఇప్పటి వరకు ఎందుకు పట్టించుకోలేదని సీఎం నిలదీశారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించి 2025 సెప్టెంబర్ 1న కేసును సీబీఐకి అప్పగిస్తూ జీవో నెం.104 జారీ చేశామని గుర్తు చేశారు. అయినా బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటై ఏడాదిగా కాళేశ్వరం విచారణను అడ్డుకుంటున్నాయన్నారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ పార్లమెంట్‌ ‌సమావేశాల్లో ఈ అంశంపై మాట్లాడాలని సూచించారు. ఆయనకు కాంగ్రెస్‌ ఎంపీలు మద్దతుగా నిలుస్తారని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -