journalists
టీడబ్ల్యూజె ఎఫ్ జిల్లా కార్యదర్శి సామా బుచ్చిరెడ్డి
నవతెలంగాణ-గోవిందరావుపేట
దీర్ఘకాలికంగా అపరిస్కృతంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టి డబ్ల్యూ జె ఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని పసర గ్రామంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో బుచ్చిరెడ్డి మాట్లాడారు. జర్నలిస్టులు నిరంతరం శ్రమిస్తూ ఎండనక వాననక విధుల్లో ఉంటూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషిచేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ ప్రాణాలకు తెగించి పోరాడారు. ఉద్యమం సందర్భంగా, ఆ తరువాత కూడా వందలాది మంది చనిపోయారు. పరిస్థితులు మారుతున్నాయి. ప్రభుత్వాల విధానాలు మారిపోతున్నాయి. కానీ, జర్నలిస్టుల బతుకుల్లో మాత్రం ఎలాంటి మార్పు అభివృద్ధి కనిపించడం లేదు. ఉన్న రెండు వర్కింగ్ జర్నలిస్టు చట్టాలను యూనియన్ గవర్నమెంట్ కోడ్‌ల కింద మార్చేసి హక్కులను కాలరాసింది. కార్మిక చట్టాలను తుంగలో తొక్కింది. అటు యూనియన్ ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభివృద్ధి, సంక్షేమ పథకాలను జర్నలిస్టులకు అందడం లేదు. చివరకు వృత్తి నిర్వహణకు కావాల్సిన అక్రిడిటేషన్ కార్డులు సైతం సకాలంలో అందించలేని పరిస్థితి కొనసాగుతోంది. అనేక ఉద్యమాల ఫలితంగా గత రెండు నెలల నుంచి అక్రిడిటేషన్ కార్డులు జారీచేస్తున్నారు. అర్హులైన వారందరికి ఇవ్వాలనేది తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) ప్రధాన ఉద్దేశం. వెంటనే లోపాలను సవరించి అర్హులైన ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ కార్డు డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రుభుత్వ ఉద్యోగుల తరహాలో హెల్త్‌కార్డులిచ్చి ఆదుకోవాలని కోరుతున్నాం. ఇకపోతే గత 40 ఏండ్లుగా ఉమ్మడి రాష్ట్రంతోపాటు తెలంగాణలోనూ జర్నలిస్టులకు ఇండ్త స్థలాలు ఇవ్వలేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని త్వరితగతిన అమలుచేయాలి. జర్నలిస్టులకు ఆర్టీసీ బస్సు పాసులు ఉచితంగా ఇవ్వాలి.అలాగే కొత్తగా మెట్రో పాసులను ఉచితంగా జారీచేయాలి. రాత్రిపూట మహిళా జర్నలిస్టులకు పనిచేసే కార్యాలయం నుంచి ఇంటి వరకు ఉచితంగా రవాణా వసతి కల్పించేలా ఆయా సంస్థలపై ఒత్తిడి తేవాలి. లైంగిక నిరోధక కమిటీలను ఏర్పాటు చేయాలి. ఇకపోతే కరోనాకు ముందు జర్నలిస్టులకు ఉన్న రైల్వే పాసుల సౌకర్యాన్ని యూనియన్ ప్రభుత్వం రద్దుచేసింది. దీన్ని పునరుద్ధరించేలా మోడీ సర్కార్‌పై ఒత్తిడి తేవాలి. ఈ సమస్యలను వెంటనే స్పందించి సానుకూలంగా పరిష్కరించాలని కోరుతున్నాం. పాత్రికేయ సోదరులు సమస్యల పరిష్కారం కోసం కలిసి రావాలని, చలో కలెక్టరేట్ జయప్రదం చేయాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో పలువురు పాత్రికేయులు తుక్కని ఎల్లారెడ్డి, సంపత్, భానోత్ ఎంకన్న తదితరులు పాల్గొన్నారు.



