– భోస్రలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
నవతెలంగాణ బజార్ హాత్నూర్:
మాంగ్ కులానికి తహశీల్దార్ కార్యాలయం ద్వారా కుల ధృవీకరణ పత్రాలను జారీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడాన్ని స్వాగతిస్తూ భోస్ర గ్రామంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. మాంగ్ సమాజ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చిత్రపటాలకు వారు పాలాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాంగ్ సమాజ్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు గాడేకర్ పరశురామ్ మాంగ్ మాట్లాడుతూ… ప్రభుత్వ నిర్ణయంతో తమ సమాజ ప్రజలకు కుల ధృవీకరణ పత్రాల జారీ ప్రక్రియ సులభతరం అవుతుందని హర్షం వ్యక్తం చేశారు. తమ కుల అస్థిత్వాన్ని కాపాడే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని కొనియాడారు.
అనంతరం గ్రామ సర్పంచ్ గొట్లుక్లె సుభాష్ మాట్లాడుతూ… మాంగ్ సమాజ్ తెలంగాణ రాష్ట్ర సంఘం చేసిన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయమన్నారు. అయితే, ఇకపై మాంగ్ కులం పేరుతో ఎలాంటి తప్పుడు కుల ధృవీకరణ పత్రాలు జారీ కాకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గాడేకర్ నాందేవ్ మాంగ్, గొట్లుక్లె యాదవ్ మాంగ్, సదాశివ పొత్రే మాంగ్, కాంబ్లె సంతోష్ మాంగ్, ప్రభాస్ మాంగ్, చరణ్ మాంగ్, కృష్ణ మాంగ్, గాడేకర్ కేశవ్ మాంగ్ తదితరులు పాల్గొన్నారు.



