– పరకాల డీలర్స్ అసోసియేషన్
నవతెలంగాణ -పరకాల : ఎరువుల పంపిణీలో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం యూరియా పంపిణీలో ప్రవేశపెట్టిన మొబైల్ యాప్ విధానాన్ని, డీఏపీ మరియు ఇతర కాంప్లెక్స్ ఎరువులకు కూడా విస్తరించాలని పరకాల మండల ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. అసోసియేషన్ అధ్యక్షుడు గందె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, యూరియా పంపిణీని యాప్ ద్వారా చేపట్టడంతో బ్లాక్ మార్కెట్ మరియు దారి మళ్లింపులకు అడ్డుకట్ట పడిందని గుర్తు చేశారు. అయితే, డీఏపీ ఎరువులు యాప్ పరిధిలో లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని ఎరువుల కంపెనీలు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా డీఏపీ ఎరువులతో పాటు ఇతర ఉత్పత్తులను కలిపి కొనాలని బలవంతం చేసే ‘లింకింగ్’ విధానం వల్ల డీలర్లతో పాటు రైతులపై కూడా అదనపు ఆర్థిక భారం పడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా తరహాలోనే అన్ని రకాల సబ్సిడీ ఎరువులను యాప్ ద్వారానే పంపిణీ చేస్తే, సబ్సిడీ నేరుగా రైతులకు చేరడమే కాకుండా ధరల నియంత్రణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలకు తమ సంఘం సంపూర్ణ మద్దతు ఇస్తుందని, అక్రమాలకు పాల్పడే కంపెనీలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
డీఏపీ ఎరువుల పంపిణీలో యాప్ విధానాన్ని అమలు చేయాలి
- Advertisement -
- Advertisement -


