నవతెలంగాణ-ఆలేరు టౌను : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గురుదక్షిణ కింద కృష్ణా గోదావరి జలాలను ఆంధ్ర ప్రదేశ్ కు తరలింపుకు సహకరిస్తున్నాడని ఆలేరు మాజీ శాసన సభ్యురాలు గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి ఆదివారం ఆరోపించారు. ఆలేరు పట్టణంలో ఆదివారం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని , మాజీ శాసనసభ్యులు బూడిద బిక్షమయ్యగౌడ్, గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్లూరి రామచంద్రారెడ్డిలు కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా, కాలువలు చెరువులు రిజర్వాయర్ల లో నీళ్లు నింపుకొని రైతుల పొలాలకు నీళ్లు అందించగా, ఏర్పడ్డ ఇసుక మీటలను రాష్ట్ర ప్రభుత్వంలో పని చేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నీళ్లు వస్తే అమ్ముకోవడానికి వీలు కాదని, తోడేస్తున్నారన్నారు. అదేవిధంగా గ్రామాలలో చెరువులు, కుంటలలో టిప్పర్ల ద్వారా నిబంధనలకు విరుద్ధంగా, మట్టిని తోడేస్తున్నారని , భాజాప్తుగా భయం లేకుండా తరలిస్తున్నారన్నారు.
అధికారులు మొద్దు నిద్రలో ఉన్నారు అన్నారు. గోదావరి కృష్ణ నదుల ద్వారా మిషన్ భగీరథ నీరు రాష్ట్రవ్యాప్తంగా అందిందని, నేటి ప్రభుత్వం చేష్టల ద్వారా తాగునీటి కష్టమైన పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఇటీవల ఆయన పెట్టుకున్న సభకు, మన మాటలకు పొంతన లేకుండా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో శనిగా భావిస్తున్నామన్నారు. లేనిపోని కథలన్నీ చెబుతూ ప్రజలు వినరాని భాషలో మాట్లాడుతున్న నిన్ను చూసి ప్రజలు నాయకులు సిగ్గుపడుతున్నారని చెప్పారు. బుద్ధి తెచ్చుకొని భాషను మార్చుకోవాలని ఇతవు పలికారు. రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాలని కొరకు అని చెప్పారు. నిధులన్నీ గురువు చంద్రబాబుకు , అన్నదమ్ములకు తరలిపోతున్నాయని చెప్పారు. జనానికి దూరంగా ఉంటూ హెలిక్యాప్టర్లలో తిరుగుతున్నాడని, అబద్ధాలు ఆడుతున్నాడని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అదే దారిలో ప్రయాణిస్తున్నారన్నారు .
ప్రభుత్వం కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా కన్నెపల్లి పంప్ హౌస్ నింపి ,అన్ని రిజర్వాయర్లు, చెరువులు నింపాలని, చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో పట్టణ మండల అధ్యక్షులు పుట్ట మల్లేశం, గంగుల శ్రీనివాస్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, కౌన్సిలర్లు పాకాల మౌనిక హరీష్, యాట శివ, నాయకులు ఆడెపు బాలస్వామి, పాషికంటి శ్రీనివాసు, కొలుపుల హరినాథ్, బేతి రాములు, కాసగళ్ల అనసూయ, సీసా మహేశ్వరి , విజయ ,సుజాత, పార్టీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


