– రూ.10.50 లక్షలకు వేలం
– దక్కించుకున్న నాగబాబు నాయుడు
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో సేకరిస్తున్న కోడి(చికెన్ )వ్యర్థాల బహిరంగ వేలం శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ తుడి దిలీప్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన వేలం పాటలో చికెన్ వ్యర్థాల నిర్వహణ హక్కును రూ.10.50 లక్షలకు కురిశెట్టి నాగబాబు నాయుడు దక్కించుకున్నారు.
ప్రభుత్వ నిర్ణీత ధర రూ.లక్షతో వేలం పాట ప్రారంభమైంది. బిడ్డర్ల మధ్య పోటీతో ధర క్రమంగా పెరిగి చివరకు రూ.10,50,000కు చేరింది. వేలంలో పాల్గొనేందుకు ఆరుగురు రూ.5 వేల చొప్పున నాన్‌రిఫండబుల్ డిపాజిట్ చెల్లించగా, ఇద్దరు గైర్హాజరయ్యారు. బలే శాలెం రాజు, వల్లేపు రమేష్, మొహమ్మద్ ముజాఫర్‌ఖాన్, కురిశెట్టి నాగబాబు వేలంలో పాల్గొన్నారు. అత్యధికంగా రూ.10.50 లక్షలు కోట్ చేసిన నాగబాబుకు వేలం దక్కింది. వేలంలో అశ్వారావుపేట ప్రింట్ మీడియాకు చెందిన నాగబాబు, ముజాఫర్‌ఖాన్ లు పాల్గొనడం విశేషం. వీరిలో వెలుగు పత్రిక విలేకరి కురిశెట్టి నాగబాబు వేలం దక్కించుకున్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపరచడం, నాన్‌వెజ్ వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించడం, ప్రజారోగ్య పరిరక్షణతో పాటు మున్సిపాలిటీకి ఆదాయం సమకూర్చేలా నిబంధనల మేరకు వేలం నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో వైస్‌చైర్‌పర్సన్ జుపల్లి రమేష్ బాబు, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



