Sunday, July 12, 2026
E-PAPER
Homeకరీంనగర్బ్రిక్స్ షెడ్ల ముందు ఇసుక దిబ్బలు.. నిమ్మకు నీరెత్తినట్టు అధికారులు

బ్రిక్స్ షెడ్ల ముందు ఇసుక దిబ్బలు.. నిమ్మకు నీరెత్తినట్టు అధికారులు

- Advertisement -

అక్రమ ఇసుక రవాణాపై నవతెలంగాణ ప్రత్యేక పరిశీలన

గోదావరి గర్భం నుంచి బ్రిక్స్ షెడ్ల దాకా అక్రమ ఇసుక వ్యాపారం

వందల ట్రిప్పుల డంపులుఅయినా చర్యలు శూన్యం

నవతెలంగాణరాయికల్:

గోదావరి నది ఒడ్డున అక్రమ ఇసుక రవాణా కొత్తేమీ కాదు.కానీ ఇప్పుడు పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. మండలంలోని బోర్నపల్లి గోదావరి తీర ప్రాంతంలో ఉన్న సిమెంట్ బ్రిక్స్ షెడ్ల ముందు వందల ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక కొండల్లా పేరుకుపోయినా సంబంధిత శాఖల అధికారులు మాత్రం మౌనంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది.

ప్రతి రోజు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు గోదావరి నది నుంచి ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలింపు కొనసాగుతూనే ఉంది. నది తీర ప్రాంతంలోని మార్గాలన్నీ ఇసుక రవాణా వాహనాలతో కిటకిటలాడుతున్నా, ఎక్కడా తనిఖీలు కనిపించడం లేదు. తరలించిన ఇసుకను సమీపంలోని సిమెంట్ బ్రిక్స్ షెడ్ల వద్ద భారీగా డంప్ చేసి నిల్వ ఉంచుతున్నారు.అక్కడ పేరుకుపోయిన ఇసుక పరిమాణాన్ని పరిశీలిస్తే అది ఒక్కటి రెండు రోజుల వ్యవహారం కాదని, చాలా కాలంగా నిరంతరంగా సాగుతున్న కార్యకలాపమని స్పష్టమవుతోంది.

డంపులు చూస్తేనే అర్థమవుతోంది

బ్రిక్స్ షెడ్ల ముందు పేరుకుపోయిన ఇసుక నిల్వలను పరిశీలిస్తే వందల ట్రాక్టర్ ట్రిప్పులు కాకుండా వేల క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వ ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. సాధారణంగా ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇంత పెద్ద మొత్తంలో ఇసుక నిల్వ చేయడం సాధ్యం కాదు. అయితే ఈ ఇసుకకు అనుమతులు ఉన్నాయా? ఉంటే ఎన్ని ట్రిప్పులకు? ఎక్కడి నుంచి తరలించారు? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అధికారులు మాత్రం స్పందించడం లేదు.

రాత్రివేళల్లో టిప్పర్ల హల్‌చల్

గోదావరి నుంచి తరలించిన ఇసుకను రాత్రి వేళల్లో టిప్పర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే నవతెలంగాణ దినపత్రికలో కథనాలు ప్రచురితమైనప్పటికీ సంబంధిత శాఖలు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా చిన్న మొత్తంలో ఇసుక తరలించినా కేసులు నమోదు చేసే అధికారులు, ఇక్కడ భారీ స్థాయిలో జరుగుతున్న వ్యవహారంపై ఎందుకు నోరు మెదపడం లేదనే ప్రశ్న ప్రజల్లో వ్యక్తమవుతోంది.

మామూళ్ల మత్తులో యంత్రాంగమా?

ప్రజల మధ్య ఇప్పుడు వినిపిస్తున్న ప్రధాన చర్చ ఇదే.ఇంత పెద్ద మొత్తంలో ఇసుక నిల్వలు ఉండి కూడా అధికారులు స్పందించకపోవడం వెనుక మామూళ్ల వ్యవహారం ఉందా? లేక రాజకీయ అండదండలు ఉన్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమ ఇసుక రవాణాపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని పదేపదే ఆదేశాలు జారీ చేస్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది.

ప్రభుత్వానికి నష్టంప్రకృతికి ముప్పు

అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు కొనసాగితే ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడటమే కాకుండా గోదావరి పరివాహక ప్రాంతంలో పర్యావరణ సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. నది గర్భంలో అధికంగా ఇసుక తవ్వడం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోవడం, నది ఒడ్లు కుంగిపోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

జిల్లా అధికారులు స్పందిస్తారా?

బోర్నపల్లి ప్రాంతంలో ఉన్న ఇసుక డంపులపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి, నిల్వలో ఉన్న ఇసుక పరిమాణం,అనుమతుల వివరాలు, రవాణా మార్గాలు, సంబంధిత వ్యక్తులపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.లేకపోతే అక్రమ ఇసుక వ్యాపారం మరింత విస్తరించే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -