– నియామక పత్రాలు అందించిన ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్
నవతెలంగాణ-సత్తుపల్లి : సత్తుపల్లి నియోజకవర్గంలోని సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాల్లోని 28 ప్రభుత్వ ప్రీ-ప్రైమరీ పాఠశాలలకు నూతనంగా ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు. ఎంపికైన అభ్యర్థులకు ఆదివారం స్థానిక ద్వారకాపురిలోని అధికారిక క్యాంప్ కార్యాలయంలో సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ తో కలిసి ఎంపికైన 28 మంది ఇన్‌స్ట్రక్టర్లు, 28 మంది ఆయాలకు నియామకపు పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయి దయానంద్ మాట్లాడుతూ, నిరుద్యోగ యువతకు అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు, జిల్లా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. విధి నిర్వహణలో చేరిన ఉపాధ్యాయులకు, ఆయాలకు ఆమె పలు కీలక సూచనలు చేశారు.
చిన్నారులతో ఎంతో ప్రేమగా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆటపాటలతో కూడిన విద్యాబోధన చేస్తూ ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలని కోరారు. పిల్లల ఆరోగ్య భద్రతతో పాటు, మధ్యాఊహ్న భోజన నాణ్యతను స్వయంగా పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. బాధ్యతాయుతంగా పనిచేస్తూ సత్తుపల్లి నియోజకవర్గ గౌరవాన్ని కాపాడాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మొహమ్మద్ రెహానా కమల్, వైస్ చైర్ పర్సన్ బొంతు సుమలత, మండల విద్యాశాఖ అధికారి నక్కా రాజేశ్వరరావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గాదె చెన్నకేశవరావు, ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, నాయకులు చల్లగుళ్ల నరసింహారావు, మొహమ్మద్ కమల్ పాషా పాల్గొన్నారు.


