Wednesday, July 15, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుఇక ఈస్ట్‌ ఇండియా 2.0 శకం!

ఇక ఈస్ట్‌ ఇండియా 2.0 శకం!

- Advertisement -

అమల్లోకి బ్రిటన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
పెరగనున్న దిగుమతులు సులభంగా ప్రవేశించనున్న లగ్జరీ ఉత్పత్తులు
ఇండియన్ కంపెనీలకు కొత్త సవాళ్లు ఎంఎస్‌ఎంఈలపైనా ప్రభావం

న‌వతెలంగాణ‌ – బిజినెస్‌ డెస్క్‌
స్వేచ్ఛా వాణిజ్యం పేరుతో దేశీయ మార్కెట్లను మోడీ సర్కార్‌ విదేశీ కంపెనీలకు ధారాదత్తంగా చేస్తోంది. ఈ క్రమంలోనే భారత్‌- బ్రిటన్‌ ‌మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌‌టిఎ) బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందాన్ని కొందరు ఆర్థిక విశ్లేషకులు, పరిశ్రమల వర్గాలు 17వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార ముసుగులో భారత్‌లో ప్రవేశించిన విధానంతో పోలుస్తున్నారు. ఇది దీర్ఘకాలంలో దేశీయ పరిశ్రమలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక విధంగా ఈస్ట్‌ ఇండియా 2.0 శకమని అభివర్ణిస్తున్నారు. ఇది దీర్ఘకాలంలో దేశీయ పరిశ్రమలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 2025–26 ఆర్థిక సంవత్సరంలో సుమారు 58 బిలియన్ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యం 2030 నాటికి దాదాపు 120 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని ప్రభుత్వ, పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. అయితే ఇందులో భారత్‌ ‌వాటా ఎంత పెరుగుతుందనేది ఎవరూ చెప్పడం లేదు. తాజా ఒప్పందం ద్వారా భారత ఎగుమతుల్లో 99 శాతం ఉత్పత్తులకు బ్రిటన్ మార్కెట్లో సుంకాలు లేకుండా ప్రవేశం లభిస్తుందని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ.. బ్రిటన్‌లో అమలులో ఉన్న నాణ్యత, భద్రత ప్రమాణాలు వంటి నాన్ టారిఫ్ అడ్డంకులు భారత ఉత్పత్తులకు సవాళ్లుగా మారాయి. టారిఫ్ తగ్గింపు మాత్రమే ఎగుమతులను పెంచడానికి సరిపోదని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జిటిఆర్‌ఐ) వంటి సంస్థలు హెచ్చరిస్తున్నాయి. యుకెలో అమలయ్యే కఠినమైన ఆహార భద్రత, పర్యావరణ ప్రమాణాలు, భారీ లాజిస్టిక్స్ వ్యయం వంటివి భారతీయ ఎగుమతిదారులకు పెను సవాళ్లుగా ఉన్నాయని తెలిపింది. కేవలం సుంకాల తగ్గింపుతో ఎగుమతులు పెరగవని, నాణ్యత, ఉత్పాదకత ప్రధానమని ఎగుమతి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

వన్ వే ట్రాఫిక్‌..!
బ్రిటన్‌కు చెందిన కార్లు, విస్కీ, లగ్జరీ వస్తువులపై దిగుమతి సుంకాల తగ్గింపుతో విదేశీ ఉత్పత్తులు భారత మార్కెట్లో మరింత సులభంగా ప్రవేశించే అవకాశం ఉంది. ఈ ఒప్పందం ప్రభావం దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమ, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలపై తీవ్రంగా పడే ప్రమాదం ఉందని పరిశ్రమల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా దిగుమతి సుంకాలను భారీగా తగ్గించడం వల్ల విదేశీ కంపెనీలతో పోటీ పడటం చిన్న పరిశ్రమలకు కష్టమవుతుందని.. దీనివల్ల మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి దెబ్బ తగిలే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. అదే విధంగా ప్రభుత్వ టెండర్లలో బ్రిటిష్ కంపెనీలకు ప్రవేశం కల్పించడం. మౌలిక వసతులు, గ్రీన్ ఎనర్జీ, రవాణా వంటి వ్యూహాత్మక రంగాల్లో బ్రిటిన్‌ ‌కంపెనీలకు బిజెపి సర్కార్‌ రెడ్ కార్పెట్ పరిచింది. ఈ పరిణామాలు ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో స్థానిక నేతగాళ్లు ఎలాగైతే యంత్రాల ధాటికి కుప్పకూలారో ఇప్పుడు మన చిన్న, మధ్య తరహా పరిశ్రమలు అదే పరిస్థితిని ఎదుర్కోనే ప్రమాదం పొంచి ఉంది. ఆర్థిక సంవత్సరం 2025-26లోనే భారత ఎగుమతులు తగ్గడం, బ్రిటిష్ దిగుమతులు 36 శాతం పైగా పెరగడం అనేది ఒక ప్రమాద ఘంటిక. భారత ఎగుమతులు యుకెలోని కఠినమైన నాణ్యత ప్రమాణాల వల్ల అక్కడికి వెళ్లలేకపోతుంటే.. మన మార్కెట్ మాత్రం బ్రిటిష్ వస్తువులకు యథేచ్ఛగా తెరుచుకుంటోంది. ఇది వన్ వే ట్రాఫిక్‌లా మారి మళ్ళీ దేశాన్ని వినియోగదారుల మార్కెట్‌గా మార్చే అవకాశాలు మెండుగా ఉండటం ఆందోళకరం.

బ్రిటన్‌‌కు లాభాలు..
ఈ ఒప్పందంతో బ్రిటీష్ కార్లు, ట్రక్కులపై దిగుమతి సుంకాలు 110 శాతం నుంచి దశలవారీగా 10 శాతానికి తగ్గనున్నాయి. ఇది మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా వంటి స్వదేశీ దిగ్గజాలకు అంతర్జాతీయ కంపెనీల నుంచి గట్టి పోటీని సృష్టిస్తుంది. మరోవైపు స్కాచ్ విస్కీపై సుంకం 150 శాతం నుంచి 75 శాతానికి ఆ తర్వాత 40 శాతానికి తగ్గడంతో భారతీయ మద్యం తయారీదారులకు గడ్డుకాలమే.చిన్న, మధ్య తరహా పరిశ్రమలు విదేశీ ఉత్పత్తులతో ధరల విషయంలో పోటీ పడటం అత్యంత కష్టతరంగా మారనుంది.

ప్రభుత్వ ఆదాయానికి గండి
దిగుమతి సుంకాలు కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు. ఇప్పుడు వేల కోట్ల రూపాయల విలువైన బ్రిటిష్ ఉత్పత్తులపై పన్ను రాయితీ కల్పించడం వల్ల ప్రభుత్వ కస్టమ్స్ ఆదాయం భారీగా తగ్గే అవకాశం ఉంది. ఈ లోటును పూడ్చడానికి ప్రభుత్వం ఇతర పన్నుల బాట పట్టాల్సి రావచ్చు. మళ్ళీ సాధారణ ప్రజలపై పన్నుల రూపంలోనే వసూలు చేయాల్సి వస్తుంది. ఒప్పందం అమల్లోకి వచ్చాక ఈ దిగుమతుల వేగం మరింత పెరిగితే వాణిజ్య సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. ఉక్కు రంగంలో యుకె ఇప్పటికే రక్షణ చర్యలు అమలు చేస్తుండటంతో భారత ఉక్కు ఎగుమతులకు ఈ ఒప్పందం పెద్దగా కలిసి రాకపోవచ్చని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. భారత్-బ్రిటన్ వాణిజ్య ఒప్పందం అనేది రెండు వైపులా పదునున్న కత్తి వంటిదని పేర్కొంటున్నారు. ఎగుమతిదారులకు, ఐటి రంగానికి ఇది కొన్ని అవకాశాలను ఇస్తున్నప్పటికీ దేశీయ తయారీ రంగం, ప్రభుత్వ ఆదాయం, చిన్న పరిశ్రమల విషయంలో ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -