నవతెలంగాణ-సత్తుపల్లి
సింగరేణి చరిత్రలో సరికొత్త మైలురాయిగా నిలిచిన తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ మైనింగ్ లీజు రావడం పట్ల విజయోత్సవ వేడుకలు సత్తుపల్లి ఏరియా పరిధిలో పండుగ వాతావరణంలా ఉద్యోగులు, అధికారులు కలిసి బుధవారం సంబురం జరిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క పట్టుదల, ప్రజా ప్రభుత్వ నిరంతర కృషి ఫలితంగా 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలుకుతూ ఈ బ్లాక్ లీజు మంజూరు కావడంతో సింగరేణి వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సత్తుపల్లి ఏరియా బొగ్గు గనుల్లో ఉదయం మార్నింగ్ షిఫ్ట్ ప్రారంభ సమయంలో జేవీఆర్ ఓసీ, జేవీఆర్ సీహెచ్‌పీ, కిష్టారం ఓసీ, జేవీఆర్ డిస్పెన్సరీలలో కార్మికులు, అధికారులు భారీ సంఖ్యలో పాల్గొని ఘనంగా సంబురాలు జరుపుకున్నారు.
ఈ సంబురాల్లో భాగంగా జేవీఆర్ ఓసీలో పీఓ ఎన్వీఆర్ ప్రహ్లాద్ అధ్యక్షతన జరిగిన వేడుకలకు సత్తుపల్లి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జేవీఆర్ సీహెచ్‌పీలో భూక్యా రాంబాబు అధ్యక్షతన ఏరియా ఇంజనీర్ సోమశేఖరరావు, కిష్టారం ఓసీలో పీఓ సునీల్ వర్మ అధ్యక్షతన ఎస్ఓ టు జీఎం బొల్లం శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జేవీఆర్ డిస్పెన్సరీలో డాక్టర్ బి. నరసింహారావు అధ్యక్షతన వైద్య సిబ్బంది ఈ వేడుకలను నిర్వహించారు. అనంతరం సత్తుపల్లి జీఎం కార్యాలయంలో ఏరియా అధికారులు, కార్యాలయ సిబ్బందితో కలిసి ప్రధాన విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించారు.
ఈ చారిత్రాత్మక విజయ పండుగలో భాగంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సింగరేణి కార్మికులను ఉద్దేశించి పంపిన సందేశాన్ని అధికారులు చదివి వినిపించారు. అనంతరం కార్మికులందరికీ డిప్యూటీ సీఎం సందేశం కలిగిన పాంప్లెట్లు, మిఠాయిలను పంపిణీ చేశారు. ఏటా 6 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తితో 45 సంవత్సరాల పాటు సింగరేణికి ఉజ్వల భవిష్యత్తును, తెలంగాణకు ఇంధన భద్రతను ఇచ్చే తాడిచర్ల-2 కేటాయింపుతో పాటు, భవిష్యత్తులో కోయగూడెం, సత్తుపల్లి వంటి మరిన్ని బొగ్గు బ్లాకులను సింగరేణికి తీసుకొస్తామనే డిప్యూటీ సీఎం హామీ పట్ల కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.



