- దేవకద్రలో గవర్నమెంట్ బాలికల హైస్కూల్ ను ప్రారంభించిన సీఎం రేవంత్
నవతెలంగాణ-హైదరాబాద్: వనపర్తి జిల్లా దేవకద్రలో గవర్నమెంట్ బాలికల హైస్కూల్ ను సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు.ప్రభుత్వ స్కూళ్లలో చదివితే ముఖ్యమంత్రి అవ్వచ్చని… అందుకు తానే ఉదాహరణ అని సీఎం రేవంత్ అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రభుత్వ స్కూళ్ళు కీలక పాత్ర పోషించాయని… చదివితే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని అన్నారు. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ స్కూళ్ళు పునరుద్ధరిస్తున్నామని…ప్రభుత్వ స్కూళ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని అన్నారు సీఎం రేవంత్. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థులు చేరలేదని.. ఎక్కువ మంది ప్రైవేటుకు వెళ్లారన్నారు.
తాము అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేకంగా దృష్టి సారించామని రేవంత్ చెప్పారు. వనపర్తి జిల్లా కొత్తకోటలో బాలికల హైస్కూల్ భవనాలను సీఎం ప్రారంభించారు. చదువుల్లో రాణించకపోతే.. క్రీడల్లో రాణించాలని.. మనకు మహమ్మద్ సిరాజ్, నిఖిత్ జరీన్ లు స్ఫూర్తి అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉందని అన్నారు. 26వేల ప్రభుత్వ స్కూళ్లలో 18 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని సీఎం రేవంత్ వివరించారు.



