భారత్, ఇంగ్లాండ్ రెండో వన్డే నేడు
సాయంత్రం 5.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో
నవతెలంగాణ-కార్డిఫ్
బ్రిటన్ పర్యటనలో ఎట్టకేలకు ఓ విజయం సాధించిన టీమ్ ఇండియా.. నేడు ఏకంగా సిరీస్ విజయంపైనే కన్నేసింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో ఎడ్జ్‌బాస్టన్‌లో పైచేయి సాధించిన భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. నేడు కార్డిఫ్‌లో రెండో వన్డే జరుగనుండగా.. ఇక్కడే సిరీస్ విజయం సాధించాలనే తపన టీమ్ ఇండియాలో కనిపిస్తోంది. మరోవైపు ఆతిథ్య ఇంగ్లాండ్ సిరీస్‌లో ఆశలు నిలుపుకునేందుకు నేడు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. భారత కాలమానం ప్రకారం రెండో వన్డే సాయంత్రం 5.30 గంటలకు ఆరంభం కానుంది.
ఆ ఇద్దరు మెరవాలె
తొలి వన్డేలో భారత్ గెలుపొందినా అభిమానులకు ఏదో వెలితి. సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ఎడ్జ్‌బాస్టన్‌లో నిరాశపరిచారు. 2027 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ నేపథ్యంలోనూ ఈ ఇద్దరు నిలకడగా రాణించాలనే అంచనాలు జట్టు మేనేజ్‌మెంట్‌లో ఉన్నాయి. దీంతో నేడు కోహ్లి, రోహిత్ భారీ స్కోర్లపై కన్నేయనున్నారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తొలి వన్డేలో ఫిట్‌నెస్ సమస్యతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. మరి, గిల్ నేడు అందుబాటులో ఉంటాడా? అతడు దూరమైతే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ పగ్గాలు అందుకోనున్నాడు. మిడిల్ ఆర్డర్‌లో శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆల్‌రౌండర్లుగా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ గొప్పగా రాణించారు. ఈ ఇద్దరు మరోసారి బంతితో, బ్యాట్‌తో మెరిస్తే భారత్‌కు తిరుగుండదు. జశ్‌ప్రీత్ బుమ్రా వన్డేల్లో రీ ఎంట్రీతో తనదైన సత్తా చాటాడు. అరంగ్రేటంలోనే గుర్నూర్ బరార్ సైతం ఆకట్టుకున్నాడు. ప్రసిద్, గుర్నూర్, బుమ్రా త్రయం పేస్ బాధ్యతలు తీసుకోనుంది. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు.
పుంజుకుంటారా?
ఆతిథ్య ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌లో వరుస విజయాలు సాధించినా.. తొలి వన్డేలో భంగపాటు తప్పలేదు. ఆరంభంలో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ సాఫీగానే సాగింది. కానీ పేసర్లు గుర్నూర్, ప్రసిద్, బుమ్రాలు టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చారు. ఆ జట్టు స్టార్ బ్యాటర్ జో రూట్ ఓ ఎండ్‌లో నిలబడటంతో ఆ మాత్రం పరుగులైనా ఇంగ్లాండ్ చేసింది. జోశ్ బట్లర్, జాకబ్ బెతెల్, హ్యారీ బ్రూక్ తొలి మ్యాచ్‌లో నిరాశపరిచారు. నేడు ఈ ముగ్గురు మెరిస్తే ఇంగ్లాండ్ బ్యాట్‌తో దీటుగా బదులివ్వగలదు. బౌలింగ్ విభాగంలో జోఫ్రా ఆర్చర్ ఆ జట్టుకు ప్రధాన అస్ర్తం. ఆర్చర్‌ను ఎదుర్కొవటమే భారత బ్యాటర్లకు సవాల్‌గా మారనుంది. జోశ్ టంగ్, ఆదిల్ రషీద్, డాసన్‌లు సైతం మంచి ఫామ్‌లో ఉన్నారు. నేడు ఓడితే వన్డే సిరీస్‌పై ఇంగ్లాండ్ ఆశలు ఆవిరి చేసుకోనుంది.



