జిల్లా పౌరసరఫరాల అధికారి తనూజ
నవతెలంగాణ – సిద్దిపేట
రేషన్ కార్డుదారులందరూ ఈ కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని జిల్లా పౌరసరఫరాల అధికారి తనూజ సూచించారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ రేషన్ కార్డుదారులందరూ ఈ-కేవైసీ ప్రక్రియను ఈ నెల 31 లోపు తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని సూచించారు. సిద్ధిపేట జిల్లాలో మొత్తం 10,47,075 మంది లబ్ధిదారులు ఉండగా, ఇప్పటివరకు 8,48,446 మంది లబ్ధిదారులు ఈ-కేవైసీ పూర్తి చేసుకున్నారనీ తెలిపారు. జిల్లాలో 81.03 శాతం ఈ-కేవైసీ పూర్తి అయిందనీ అన్నారు.
కొన్ని రేషన్ కార్డులలో కుటుంబ సభ్యులలో ఒకరు లేదా ఇద్దరు మాత్రమే ఈ-కేవైసీ పూర్తి చేసి, మిగిలిన సభ్యులు ఈ-కేవైసీ చేయించుకోనట్లు గుర్తించడమైనదనీ, అటువంటి ఈ-కేవైసీ పూర్తి చేయని కుటుంబ సభ్యుల వివరాలను క్షేత్రస్థాయి యంత్రాంగానికి అందజేయడం జరిగిందనీ తెలిపారు. సంబంధిత అధికారులు, చౌక ధరల దుకాణ డీలర్లు మరియు క్షేత్రస్థాయి సిబ్బంది ఆయా కుటుంబాలను సంప్రదించి, ఈ-కేవైసీ పూర్తి చేయించేందుకు చర్యలు చేపడుతున్నారని, ఇంకా ఈ-కేవైసీ పూర్తి చేయని రేషన్ కార్డుదారులందరూ తమ సమీప చౌక ధరల దుకాణాన్ని సంప్రదించి వెంటనే ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.



