– కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఫైర్
నవతెలంగాణ-సత్తుపల్లి
సీతారామ ప్రాజెక్టు రూపకల్పన అంతా కేసీఆర్ హయాంలోనే జరిగిందని, 70 శాతం పనులు బీఆర్ఎస్ ప్రభుత్వమే పూర్తి చేసిందని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. శుక్రవారం సత్తుపల్లిలోని శ్రీలక్ష్మీప్రసన్న ఫంక్షన్ హాల్‌లో జరిగిన బీఆర్ఎస్ బీఎల్ఎల సమీక్షా సమావేశంలో సండ్ర పాల్గొని మాట్లాడారు. రూ.19 వేల కోట్ల ప్రాజెక్టులో రూ.10 వేల కోట్లు ఖర్చు పెట్టి మోటార్లు, భూసేకరణ, కాలువల పనులు తామే చేశామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రూ.1000 కోట్లు ఖర్చు పెట్టి, చిన్న కాలువ తవ్వి ఇదంతా తమ గొప్పతనమేనని డబ్బా కొట్టుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.
జిల్లాలో ఒక మంత్రికి పేరు వస్తుందనే ఈర్ష్యతో, ఇద్దరు మంత్రులు కలిసి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని తీసుకొచ్చి హడావుడి చేశారని విమర్శించారు. సత్తుపల్లిలోని శ్రీలక్ష్మీప్రసన్న ఫంక్షన్ హాల్‌లో జరిగిన బీఎల్ఎల సమీక్షా సమావేశంలో ఆయన కాంగ్రెస్ వైఫల్యాలపై ఘాటుగా స్పందించారు. కాలేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేతలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, కన్నేపల్లి పంప్ హౌస్ వద్ద మోటార్లు ఆన్ చేస్తే రైతులకు నీళ్లు అందుతాయన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి దిగజారి మాట్లాడుతున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్థాయిని తగ్గించుకొని దిగజారి మాట్లాడుతున్నారని సండ్ర విమర్శించారు. రైతులు నీళ్లు అడిగితే రక్తం ఇస్తాం అనడం ఆయన అహంకారానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబంపై రేవంత్ రెడ్డి చేస్తున్న అసభ్యకర వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రైతులకు రెండు సార్లు రైతుబంధు ఎగ్గొట్టిన మోసపూరిత చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని సండ్ర అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అన్ని విధాలుగా విఫలమైందన్నారు. ఏ సర్వే చూసినా వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ కూసంపూడి మహేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ మాజీ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, నాయకులు భీమిరెడ్డి గోపాల్ రెడ్డి, ఎస్కే రఫీ, మల్లూరు అంకమరాజు, ఎస్కే చాంద్ పాషా, అమరవరపు కృష్ణారావు, దొడ్డా శంకర్రావు, ఎండీ ఆయుబ్ పాషా, కోటగిరి వెంకటరావు పాల్గొన్నారు.



