Friday, July 17, 2026
E-PAPER
Homeఖమ్మంఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి

ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలి

- Advertisement -

– జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి. పుల్లయ్య
నవతెలంగాణ-సత్తుపల్లి

జిల్లాలో ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రైతులు  అప్రమత్తంగా ఉండాలని జిల్లా వ్యవసాయ అధికారి డి. పుల్లయ్య తెలిపారు. హెచ్చరించారు. ​సత్తుపల్లి మండలంలో ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులపై ఆయన శుక్రవారం క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. పరిశీలన కార్యక్రమం అనంతరం మండలంలోని కిష్టారం సొసైటీలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  ప్రత్యామ్నాయ పంటలు, పంట కుంటల నిర్మాణంపై రైతులకు అవగాహన కల్పించారు. ​ఎల్ నినో కారణంగా ఈసారి వర్షాలు ఆలస్యంగా కురిసే అవకాశం  ఉందన్నారు ​వర్షాకాలం మధ్యలో దీర్ఘకాలికంగా వర్ష విరామాలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు.

​సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదై పంటలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుందన్నారు.  ఈ ప్రతికూల వాతావరణం వరి, పత్తి, మొక్కజొన్న, కంది, పెసర, మినుము వంటి ఖరీఫ్ పంటల పెరుగుదలను దెబ్బతీస్తుందని తెలిపారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా నీటి వినియోగం ఎక్కువగా ఉండే వరి సాగును వీలైనంత వరకు తగ్గించాలని కోరారు. చెరువులు, బోరు బావుల కింద వరి సాగు చేయడం ఈ పరిస్థితుల్లో ఏమాత్రం శ్రేయస్కరం కాదని స్పష్టం చేశారు.

​అనవసరంగా భూగర్భ జలాలను వాడితే చివరకు తాగునీటి ఎద్దడి కూడా ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ​వరికి ప్రత్యామ్నాయంగా పెసర, మినుము, జొన్న, సజ్జ, రాగులు, నువ్వులు, ఉలవ పంటలను సాగు చేయాలని సూచించారు. ​వ్యవసాయ శాఖ సిఫారసు చేసిన స్వల్పకాలిక, కరవును తట్టుకునే రకాల విత్తనాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలన్నారు. ప్రతి రైతు తమ వ్యవసాయ క్షేత్రాలలో తప్పనిసరిగా పంట కుంటల (ఫార్మ్ పాండ్స్) నిర్మాణం చేపట్టాలని పిలుపునిచ్చారు. కురిసిన ప్రతి వర్షపు చుక్కనూ ఒడిసిపట్టి నీటి సంరక్షణ చర్యలు పాటించాలని కోరారు.

​వాతావరణ శాఖ జారీ చేసే రోజువారీ సూచనలను రైతులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు. వ్యవసాయ అధికారుల సలహాలు పాటిస్తూ పంటల నిర్వహణలో శాస్త్రీయ పద్ధతులను అవలంబించాలని సూచించారు. ​ఎల్ నినో ముప్పును ముందుగానే అంచనా వేసి నడుచుకుంటే దిగుబడి నష్టాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు వి. శ్రీనివాస రెడ్డి మాట్లాడారు. మండల వ్యవసాయ అధికారి డీఎన్కే  శ్రీనివాసరావు, ఏఈఓ డి. నరేష్ స్థానిక రైతులకు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ సమావేశంలో కిష్టారం సొసైటీ చైర్మన్ లక్ష్మి నారాయణ, సర్పంచ్ నరుకుళ్ల రాజేశ్వరి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -