మన సమాజంలో శాస్త్రీయ దక్పథం ఎంత అవసరమో, అదే స్థాయిలో దానికి వ్యతిరేకంగా మూఢనమ్మకాలు, అపోహలు, అవగాహన లేమి ఇంకా బలంగా ఉన్నాయి. ఆ వాస్తవాన్ని ఈ పుస్తకం స్పష్టంగా గుర్తుచేస్తుంది. ఈ నేపథ్యంలో తుమ్మా భాస్కర్ రచించిన ఈ గ్రంథంలో 40 అధ్యాయాల ద్వారా, హేతువాదం ప్రాముఖ్యతను ఒక్కసారి ఆలోచించండి అని గంభీరమైన పిలుపుతో మన ముందుంచారు. వాస్తు, జ్యోతిష్యం, ఆత్మలు లాంటి మూఢనమ్మకాల గుట్టును బయటికి లాగడమే కాదు. ప్రశ్నించడం నేరం కాదని, వైజ్ఞానిక స్ఫూర్తి గల సమాజ నిర్మాణం కోసం అది ఎంతగా అవసరమో చెప్పారు. గ్రహణాలపై అవగాహన, చందమామ కేంద్రంగా ఏర్పడిన అజ్ఞానాన్ని ఖండించడం, ఖగోళ శాస్త్రవేత్తలు సాగిస్తున్న యాత్రలు – సాధిస్తున్న విజయాల గురించి వివరించారు. ఆధునిక సైన్సు తమ ప్రాచీన మతగ్రంథాల్లో ఏనాడో నిక్షిప్తమై ఉందని, మూర్ఖంగా దబాయిస్తున్న మతవాదుల నోళ్లు మూయించగలిగే రచనలు ఇందులో ఉన్నాయి. సైన్సు మానవాళి పురోగతికి తోడ్పడాలని చెబుతూ, నేటి పాలకులు మూఢవిశ్వాసాలకే ఎక్కువ ప్రోత్సాహం ఇవ్వడాన్ని ప్రశ్నించాడు.
ఈనాటి సమాజంలో వ్యాపిస్తున్న విలువల పతనాన్ని – మతం, మదం, మద్యం అని మకారత్రయం మగాళ్ళను మగాలుగా మార్చడాన్ని చిత్రించాడు. యువతి యువకుల్లో, విద్యార్థి లోకంలో ర్యాగింగ్ వల్ల కలిగే అనర్థాలను చెప్పటమే కాక, న్యాయస్థానాల్లో దేవుడి పేరుతో న్యాయమూర్తులపై జరుగుతున్న దాడులు, వాటిని తెర వెనుక ఉండి నడిపిస్తున్న స్వార్థపరుల బండారాన్ని బయటకు లాగారు. మహిళలపై వివక్ష. ఉమ్మడి పౌరస్మతి, ఇస్లాంలో తలాక్ సమస్య, బిల్కీస్ భానోకి జరిగిన అన్యాయం, క్రైస్తవ మహిళలకు ఆస్తి హక్కులో ఉన్న దగా, కుల దురహంకార హత్యలు మొదలైన వాటిని రచయిత వెల్లడించిన తీరు ప్రశంసనీయం. న్యాయవాది కనుక ఆ పరిజ్ఞానం వాటిలో కనబడుతుంది. అన్యాయాలను ఎదిరిస్తూ, మంచి మార్పును ఆశిస్తూ రాసిన ఈ గ్రంథం సమాజంలో చైతన్యాన్ని పెంపొందించి, శాస్త్రీయ దక్పథాన్ని విస్తరింపజేసే విధంగా ఉపయోగపడుతుందని ఆశించవచ్చు.
కె.పి.అశోక్ కుమార్
9700000948



