మీనా కుమారి మావ¶లు అందగత్తె ఏమీ కాదు. కానీ ఆమె ముఖంలో ఒక రకమైన అమాయకత్వం ఉండేది, ఆమె ప్రేమించాలని మనసుపడేది. ఆమె జీవితంలో కూడా ప్రేమే ప్రధానమైన భావోద్వేగం. ప్రతి ప్రేమా విఫలం తర్వాత ఆమె భరించలేని బాధను అనుభవించేది మళ్ళీ ఇంకొకరు వచ్చి ఆమె జీవితానికి కేంద్రబిందువు అయ్యేంత వరకు. మొదట దౌలత్ రామ్ అనే పాత్రికేయుడు, ఆ తర్వాత కె. రజ్దాన్ వచ్చేవారు. కానీ వాళ్ళు ఆమె జీవితంలో ఒక వానలా కురిసి వెలిసిపోయిన వాళ్ళే.
ఆమె అత్యంత బలహీనంగా ఉన్న సమయంలో కమల్ అమ్రోహి ఆమె జీవితంలోకి ప్రవేశించాడు. 1951లో ఆమెను మళ్లీ కలుసుకున్నప్పుడు మీనా వయసు 18. కమల్ వయసు 34. కవిత్వం పట్ల మీనాకున్న బలహీనతను అతను పసిగట్టాడు. అతను పువ్వులు, షాయరీలతో ఆమెను ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో ఆమె అతన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది. అది కమల్ పన్నాగం. మీనా ఒక పెద్ద స్టార్. అది అమ్రోహికి అనుకూలించింది. ఆమె భర్తగా, తన ఇష్టానుసారం సినిమాలలో నటించడానికి ఆమెను ఒప్పించాడు. అందుకు ఆమె చాలా కష్టపడింది. కానీ తను ఎంత సంపాదిస్తుందో తనకే తెలియదు. ఆమెకు ఏనాడూ డబ్బు ఎప్పుడూ ముఖ్యం కాదు. కానీ ఆమె జీవితం ఆమెకు తెలియకుండానే యాంత్రికంగా మారిపోయింది. దాంతో మీనాకు కమల్‌లో కొత్త కోణం కనిపించింది. కవిత్వం, పూల పరిమళం, వెన్నెల గురించి ఆయన చెప్పేవన్నీ మాయమాటలని, తన నటనతో వ్యాపారం చేస్తున్నాడనే విషయం ఆమెకు తొందరగానే అర్థమైంది.
పాకీజా’ సినిమా షూటింగ్ సగంలోనే కమల్‌తో ఇక కలిసి జీవించలేనని మీనా నిర్ణయించుకున్నది. ఆ సమయంలో ‘బైజు బావ్రా’ చిత్రంలో ఆమె సరసన నటించిన హీరో భరత్ భూషణ్‌తో ఆమెకు ఏదో సంబంధం ఉందన్న ప్రచారం జరిగింది. ఆ కారణంగానే ఆమె, కమల్ విడిపోయారని అంటారు. అయితే కొద్దికాలం తర్వాత ఆమె మనసు మార్చుకుని తిరిగి కమల్ వద్దకువెళ్లింది. కానీ అక్కడ మళ్లీ ఆమెకు నిరాశే ఎదురైంది. ఆ తర్వాత ఆమె మెహమూద్‌ను వివాహం చేసుకున్న తన సోదరి దగ్గరకు వెళ్లి ఉండిపోయింది. దాంతో ఆమె జీవితంలో కొంత స్థిరత్వం ఏర్పడింది. ఆ సమయంలోనే ‘ఫూల్ ఔర్ పత్తర్’ సినిమా షూటింగ్ జరుగుతుండగా ఆమెకు ధర్మేంద్ర పరిచయమయ్యాడు. ఆమె ధరమ్‌కు ఎంతో సహాయం చేసింది. నిజానికి మీనా ఎంతోమంది హీరోలు స్టార్‌లుగా ఎదగడానికి సహాయపడింది. కానీ వారి కెరీర్ పుంజుకున్నాక వారిలో ఒక్కరు కూడా ఆమెను వెనక్కి తిరిగి చూడలేదు.
జవహర్‌లాల్ నెహ్రూ మరణం తర్వాత, ఔరంగాబాద్‌లో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆమె మిత్రుడు రామ్ ఔరంగాబాద్ అనుకున్నాడు. కానీ అందుకు తగినంత డబ్బు అతని దగ్గర లేదు. అప్పుడు అతనికి మీనా గుర్తుకొచ్చింది. ఒక రోజు ‘కాజల్’ సినిమా షూటింగ్ సెట్‌లో ఆమెను కలిశాడు. ”మీనా నేను ఇంతవరకు నిన్ను ఏమీ అడగలేదు, కాబట్టి ఈ రోజు నేను ఏదైనా అడిగితే దయచేసి కాదనవద్దు” అన్నాను. ఆమె నవ్వి, ”ఏంటి విషయం రామ్ సినిమా ఏమైనా తీస్తున్నావా?” అంది. నేను ”లేదు, పండిట్ జీ విగ్రహం ఒకటి చేయించాలని అనుకుంటున్నాను. దాని కోసం కొంత డబ్బు అవసరం” అన్నాడు. ఆ ఆలోచన ఆమెకు వెంటనే నచ్చింది. ”ఎంత ఖర్చవుతుంది?” అని అడిగింది. కేవలం తల, ఛాతీ భాగం వరకు ఉండే విగ్రహానికి సుమారు 10 నుండి 15 వేల రూపాయలు ఖర్చవుతుందన్నాడు. ఆమె కాసేపు మౌనం తర్వాత, ”రామ్ ఆయన అంత గొప్ప వ్యక్తి కదా, కేవలం తల వరకే ఎందుకు? పూర్తి విగ్రహాన్ని చేయిద్దాం” అంది. అది చాలా ఖరీదైన వ్యవహారం అవుతుందన్నాడు. ఆమె నవ్వి ”రామ్ సాహబ్, చిన్నప్పటి నుండి సంపాదిస్తున్నాను. కానీ ఆ డబ్బును ఎలా చూడాలో కూడా నాకు తెలియదు.
ఈ రోజు ఆ డబ్బును చూస్తున్నాను కాబట్టి దాన్ని ఖర్చు చేసే ధైర్యం నాకు రానివ్వండి. నా తర్వాత ఆ డబ్బును ఎవరి కోసం వదిలి వెళ్తాను?” అన్నది. అవి ఊరికే అన్న మాటలు కావు. అదే రోజు ఆమె రామ్ ను తన కారులో కూర్చోబెట్టుకుని ఊరంతా తిరుగుతూ విగ్రహాలన్నీ చూసింది . చౌపట్టిలో ఆమెకు నచ్చిన ఒక విగ్రహం కనిపించింది. ఆ శిల్పి వెళ్లి కలిసింది. ఒక శాంతి యాత్రలో పండిట్ నెహ్రూ పావురాన్ని వదులుతున్న ఫోటోను మీనా చూసింది. ఆ విగ్రహం కోసం అదే ఫోటో కావాలని ఆమె కోరుకుంది. ఆమె ఆ విగ్రహం పట్ల ఎంత ఉత్సాహంగా ఉందంటే ఆ ప్రాజెక్టు మొత్తానికి రూ. 75,000 ఖర్చవుతుందని చెప్పినప్పుడు మరుసటి రోజే ఆమె అడ్వాన్స్‌ను ఆయనకు ఇచ్చేసింది. ”త్వరగా మొదలుపెడదాం” అంది ఉత్సాహంతో. విగ్రహం సిద్ధమయ్యాక రాష్ట్రపతిచే ఆవిష్కరించాలని మీనా రామ్‌తో అంది. అపుడు రామ్ డాక్టర్ రాధాకష్ణన్‌ను కలవడానికి అపాయింట్‌మెంట్ ఏర్పాటు చేసి ఇద్దరు విమానంలో ఢిల్లీ వెళ్లారు.
ఆ సందర్భంలో డాక్టర్ రాధాకష్ణన్ మీనాను అడిగిన మొదటి ప్రశ్న, ”మరి మీ బారు ఫ్రెండ్ ధర్మేంద్ర ఎలా ఉన్నాడు?” అని. ఆ మాట వారికి ఆశ్చర్యం కలిగించింది. ఏది ఏమైనా విగ్రహావిష్కరణకు రాష్ట్రపతి వచ్చారు. ఆ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. దాదాపు లక్ష రూపాయల ఖర్చయింది. కానీ ఆమె సంతోషంగా బొంబాయికి తిరిగి వెళ్ళింది. మీనా ఉదార స్వభావానికి సంబంధించిన మరో సంఘటన. ఆమె కార్టర్ రోడ్‌లో ఒక అందమైన తెల్లని బంగ్లాను నిర్మించుకున్నారు. దాని డిజైన్ అంతా ఆమె స్వయంగా రూపొందించుకున్నారు. అది ఆమె కలల సౌధం. ఆ ఇల్లంటే ఆమెకు చాలా ప్రేమ. ఆ రోజుల్లో ఆమె సావన్ కుమార్‌తో సన్నిహితంగా ఉండేది. ఒక సందర్భంలో ఆయన డబ్బు లేక తన సినిమాలో నటించిన ముంతాజ్‌కు పారితోషికం చెల్లించలేకపోయాడు. ఈ విషయం తెలుసుకున్న మీనా ఏకంగా తన కలల సౌధాన్ని అమ్మేసి ముంతాజ్‌కు డబ్బు చెల్లించింది. అది ఆమె ఉదారత.
ఐతే ఆమె బతికున్నంత కాలం ఆమె కుటుంబం ఆమెను దూరం పెట్టింది. కానీ మీనా దానిని పట్టించుకోలేదు. ఆమెకు తన హదయానికి దగ్గరైన వ్యక్తితో వెన్నెల రాత్రులలో నడవడం అనేది ఎంతో విలువైనదిగా అనిపించేది. అది ఆమె బలహీనత. కానీ అదే ఆమెకు దక్కలేదు. కోరుకున్న వారు, నమ్మినవారు, చేరువైన వారు అందరూ ఆమెను మోసం చేశారు. ఎంతైనా ఆమె కూడా ఒక సాధారణ స్త్రీగానే కాసింత ప్రేమను ఆశించింది. అదే ఆమెకు అందలేదు. ఆమె మనశ్శాంతి కోసం మద్యానికి చేరువయ్యింది. అదే ఆమె ఆరోగ్యాన్ని కబళించింది. 1968లో మీనా కుమారికి కాలేయానికి సంబంధించిన తీవ్రమైన అనారోగ్యం ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆమె లండన్, స్విట్జర్లాండ్‌లలో చికిత్స పొందింది. కోలుకున్న తర్వాత ఆమె సెప్టెంబర్ 1968లో భారతదేశానికి తిరిగి వచ్చి తన కొత్త ఇంటిని కొన్నది. తర్వాత ఆమె తన నట జీవితాన్ని తిరిగి ప్రారంభించింది. పాకీజా షూటింగు సెట్స్ మీద తరచూ ఆమె బలహీనపడి విశ్రాంతిని కోరుకునేది. పాకీజా’ చిత్రం 1957లో ప్రారంభమై చాలా కాలం పాటు సాగిన ఒక సుదీర్ఘ ప్రాజెక్ట్. మీనా కుమారి ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని దఢ నిశ్చయం తీసుకుంది. ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ, తన పాత్రను పూర్తి చేయడానికి ఆమె చాలా శ్రమించింది.
తెర వెనుక ఈ చిత్ర నిర్మాణానికి 14 ఏళ్ల సుదీర్ఘ కాలం పట్టింది. కమల్ అమ్రోహి దర్శకత్వం సినిమాను కళాఖండం గా మలిచింది. ఇదొక భావోద్వేగ శోకగీతంగా నిలుస్తుంది. స్వచ్ఛమైన ప్రేమకు ఒక సుందర దశ్య కావ్యంగా మిగిలిపోయింది పాకీజా. ఇందులో ఆమె పోషించిన ‘సాహిబ్ జాన్’ పాత్ర ఒక క్లాసిక్‌గా నిలిచిపోయింది. 1972 ఫిబ్రవరి 3న ‘పాకీజా’ ప్రీమియర్ ప్రదర్శన జరుపుకుంది. మరుసటి రోజే ఈ చిత్రం విడుదలైంది. 1972 మార్చి 28న మీనాను ఒక నర్సింగ్ హోమ్‌లో చేర్చారు. రెండు రోజుల తర్వాత ఆమె కోమాలోకి వెళ్లింది. 1972 మార్చి 31న కన్నుమూసింది. అప్పటికి ఆమె వయసు 39. మీనా కుమారి తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నప్పుడు చివరి రోజులలో చాలామంది సినిమా వాళ్ళు వచ్చి పలకరించి వెళ్లేవారు. ఆ సందర్భంలో వచ్చిన మహమ్మద్ రఫీ తో గతంలో తను నటించిన ‘ప్యార్ కా సాగర్’లో ఆయన పాడిన ”ముజే ప్యార్ కి జిందగీ దేనె వాలే, కభీ ఘమ్ న దేనా ఖుషి దేనే వాలే” పాటను పాడించుకుని విన్నది. అంతేకాదు ఆమె తన గదిలో ఎప్పుడూ ఇదే పాటను వింటూ గడిపేది.
ఆమె మరణం సినిమా ప్రేక్షకులందరిని కంటతడి పెట్టించింది. పాకీజా 33 వారాల పాటు విజయవంతంగా ప్రదర్శితమై, భారీ విజయాన్ని సాధించింది. కానీ పాకీజా విజయంలో భాగం పంచుకోవడానికి ఆమె లేదు. అమ్రోహీ కోరిక మేరకు, ఆమెను ముంబైలోని రెహ్మతాబాద్ స్మశానవాటికలో ఖననం చేశారు. మీనా తన జీవితాన్ని ఒక విరిగిన వాయిద్యంగా, అసంపూర్ణమైన పాటగా, పగిలిన హదయంతో ముగించింది. మీనా కుమారి ప్రతిభావంతురాలైన ఉర్దూ కవయిత్రి కూడా. ఆమె ‘నాజ్’ అనే కలం పేరుతో రాసింది. ఆమె కవిత్వం తనను తాను వ్యక్తీకరించుకోవడానికి, చిత్ర పరిశ్రమపై తన ఆలోచనలను పంచుకోవడానికి దోహద పడింది. మీనా కుమారి కవితల ఆల్బమ్ 1971లో విడుదలైంది. ఆమె స్వయంగా కవితలు రాసి, స్వయంగా గానం చేసింది కూడా. తన్హా చాంద్ (ఏకాంత వెన్నెల) ఆమె కవితలు గుల్జార్ సంకలనంలో 1972లో ఆమె మరణానంతరం వెలువడింది. భారతీయ సినీరంగంపై మీనా కుమారిది చెరగని ప్రభావం తన సహజ నటనతో నాటి నుండి నేటి వరకు కూడా ప్రేక్షకులను అలరించిన తార.
ఆమె గ్లిజరిన్ అవసరం లేకుండానే దుఃఖ సన్నివేశాలలో నిజంగా ఏడ్చేది. తన కెరీర్ శిఖరాగ్రంలో ఆమె తన కాలంలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటి. సినీ పరిశ్రమలో ఇంపాలా కారును కొనుగోలు చేసిన మొదటి వ్యక్తి కూడా ఆమెనే. మీనా కుమారి ఫ్యాషన్ ట్రెండ్‌లను కూడా సష్టించింది. 1950 దశకంలోని మహిళలు ఆమె కేశాలంకరణను, సాంప్రదాయ బిందీలను అనుకరించేవారు. ఆమె పూల డిజైన్లు, సాంప్రదాయ బనారసి పట్టు, కంజీవరం చీరలు నేటికీ ప్రాచుర్యంలో వున్నాయి. మీనా కుమారి కళ్ళు ఆతరం సినీ ప్రేక్షకులు ప్రత్యేకంగా చెప్పుకునేవి. తన నటనలోని చాలా భావా కేవలం తన కళ్ళతోనే పలికించేదామె.’దిల్ అప్నా ఔర్ ప్రీత్ పరారు’ చిత్రంలో ఈ ప్రతిభను మనం చూడవచ్చు . ఆమె వ్యక్తిత్వంలోని అత్యంత విశిష్ట లక్షణాలలో ఒకటిగా ఉన్న ఆమె కళ్ళను, ‘పాకీజా’ ‘సాహిబ్ బీబీ ఔర్ గులాం’ వంటి అనేక చిత్రాలలో పలుమార్లు క్లోజప్ షాట్లు తీశారు. 1950, 60’లలో భారతీయ మహిళల జీవితాలలోని అంతర్ముఖమైన సంఘర్షణలను తన నటనలో చూపించడంలో ఆమె ప్రత్యేకంగా రాణించింది.
ఆమె మరణ వార్తను విన్న సహనటి నర్గీస్ ”మీనా..! మౌత్ ముబారక్ హో” (మీనా నీకు మరణ శుభాకాంక్షలు ) అనే పేరుతో ఒక వ్యాసం రాసింది. అంటే మీనా కుమారిని మరణం ఎంత వేదన నుండి విముక్తి చేసిందో ఈ మాటల వల్ల మనం అర్థం చేసుకోవచ్చు. 1969లో ఆగిపోయిన పాకీజా చిత్రాన్ని కమల్తో కలిసి పూర్తి చేయడానికి నర్గీస్ దత్ దంపతులు ఆమెను ఒప్పించారు. భారతీయ చలనచిత్ర చరిత్రలో మీనాకుమారికి ముందు తర్వాత ఎందరో నటీమణులు తమ నటన సామర్థ్యంతో వెలుగొందిన వారు ఉన్నారు. కానీ మీనా కుమారి తన జీవితకాలంలో ఒక మహానటిగా, సినిమాకు తన జీవితాన్ని అంకితం చేసి అరుదైన వ్యక్తిత్వంతో జీవించిన మహామానుషి. ఒక్క మాటలో చెప్పాలంటే భారత దేశపు సినీ రంగ చరిత్రలో నటన జీవించిన కాలం పేరు మీనా కుమారి. అంతే. అంతే.. అంతే..!
హెచ్.రమేష్ బాబు,
7780736386



