Sunday, July 19, 2026
E-PAPER
Homeసోపతిప్రగతిశీలి పి.టి.రెడ్డి

ప్రగతిశీలి పి.టి.రెడ్డి

- Advertisement -

ప్రజ్ఞాశీలి పి.టి. రెడ్డి గారి కళాకృతుల మ్యూజియం, నారాయణ గూడ, హైదరాబాద్‌లో చూద్దామని వెళ్లినప్పుడు, వారి అమ్మాయి ప్రొ||లక్ష్మీరెడ్డి గారే స్వయానా వారి నాన్నగారి కళాకృతులను వివరిస్తూ చూపించారు. ఎన్నో గ్యాలరీలు, ఎన్నో వరుసలు తీర్చి ప్రదర్శింపబడి వున్న ఆ కళాకారుడి చిత్రాలు, శిల్పాలు చూసి, ఒక మాట అర్థమయింది. ఈ కళాకారుడు ఒక కళాతపస్వి అని.

పాకాల తిరుమలరెడ్డి కరీంనగర్‌, అన్నారంలో 1915లో పుట్టి పెరిగి, కళలపై ఆసక్తితో హైదరాబాద్‌ వచ్చేశారు. అన్ని అడ్డంకులకు దారి వెతుకుతూ, బొంబాయిలోని సర్‌ జె.జె.స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్‌లో 1939లో డిప్లొమా పట్టా పొందారు. ఈయన చిత్రకారుడు, శిల్పకారుడు అవటమే కాక మ్యూరల్‌, ప్రింట్‌ మేకింగ్‌, ఇల్లస్ట్రేషన్‌లలోనూ ఉత్తీర్ణత సంపాదించారు. సినిమాకి కళాదర్శకుడిగా కూడా పనిచేశారు. బొంబాయిలో చదువుకుంటూ కళాపద్ధతులు, కళలే కాదు, భారతీయ కళాస్థితులు, సిద్ధాంతాలు, ఆనాడు కళావేదికల మీద జరుగుతున్న రాజకీయ మార్పులనూ అవగాహన చేసుకున్నారు. రాబోయే కాలాలకు పునాది వంటి ఒక కళాసిద్ధాంతాన్ని ముందు పెట్టారు.

1941లో తన స్నేహితులు, తనతో పాటు అక్కడే చదివిన క్లెమెంట్‌ బాప్టిస్టా, ఎ.ఎ.మజీద్‌, యం.టి.భోపాలే తో కలిసి ఈ నలుగురు వారి సిద్ధాంతం ఒకటి పెట్టుకుని పని చేయాలని ‘యంగ్‌ తుర్కులు’ అని వారి సమూహ ఆలోచనకు పేరు పెట్టుకుని పని మొదలెట్టారు. ఈ నలుగురుకి పాఠం చెప్పిన చార్లెస్‌ గెరాడ్‌ వారి ఆలోచనకు మద్దతు పలికాడు. వారి ఆలోచన ప్రకారం వారు, బ్రిటీస్‌ వారు రాయల్‌ అకాడమీ ప్రకారం బోధించే నిజమనిపించే లాంటి రూపాల చిత్రణ వదిలిపెట్టారు. అలాగే బెంగాలు వారి పద్ధతి మన భారతీయ చిత్రణ పద్ధతి, విషయాలు, నీటి రంగులు మాత్రమే వేయాలనే నిబంధనలూ వదిలిపెట్టారు. నిజానికి బొంబాయి జె.జె.స్కూల్‌ కళాకారులు బెంగాలు పద్ధతి వెనుక పెట్టి తమదంటూ ఒక పద్ధతి వుండాలని మొదలెట్టినా, ఎ.ఎ.అమ్లేకర్‌, అచరేకర్‌ వంటి కళాకారులు వేస్తున్న చిత్రాలలో ఒక అలంకరణ చిత్రమే వేయటం జరిగింది. బెంగాలు వారు వారి పరిసరాలు, భారతీయ చరిత్ర ఇతిహాసాల నుండి వేస్తే, వీరు నిజమనిపించే వారి పరిసర చిత్రాలు వేశారు. రెంటిలోనూ అలంకరణ అనే పదాన్ని వెలుపల పెట్టి చూడలేం. అందమైన కళ అంటే అలంకరణ సహితంగా వుండాలా అనే ప్రశ్న రాకమానదు ఆనాటి కళలు చూస్తే.

ఆనాడు ఒక ఆలోచన మొదలైంది. ఈ యంగ్‌ తుర్కులకు. బ్రిటీష్‌ వారి ఒత్తిడి నుండి బయటకు రావాలి. మన భారతీయ తత్వాన్ని మన చిత్రాలలో తీసుకువచ్చి ఇది మన సిద్ధాంతం అని చెప్పగలగాలి. నిజానికి ఆనాడు యూరోప్‌లోని మరిన్ని దేశాలు ఇంగ్లీషు వారు ప్రవేశపెట్టి చెబుతున్న అకాడమీ వారి పాఠ్యాంశాల పద్ధతి వదిలి తాము వెలుతురు, రంగుల ప్రభావంతో ‘ఇంప్రెషనిజం’, అలాగే భావప్రకటనపై మరింత పదును పెట్టాలని ‘ఎక్స్‌ప్రెషనిజం’ వంటి సిద్ధాంతాలతో పనిచేయ మొదలెట్టారు. అలాగే మనదంటూ ఒక పద్ధతి, గుర్తింపుతో కళలు సృష్టించాలనే ఆలోచనలతో యంగ్‌ తుర్కులు భారతీయ తత్వాన్ని యూరోప్‌ పద్ధతులలో భావయుక్త కళలకు ప్రాతిపదిక వేసుకున్నారు. చార్లెస్‌ గెరాడ్‌ వీరి కళాకృతులతో 1941లో ‘యంగ్‌ తుర్కులు’ పోర్ట్‌ ఫోలియోతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. అందులో తనవీ ఉంచాడు. ఏ విధంగా చూసినా కళాకారులు వారి సిద్దాంతాలను వివరించే పోర్ట్‌ ఫోలియోతో పాటు ప్రగతిశీల ఆలోచనలతో వెలువడిన మొదటి వరుస కళాకృతులు వీరివనవచ్చు.

ఈ గ్రూప్‌ని ‘ప్రిప్రోగ్రెసివ్‌ గ్రూప్‌’ అని కూడా అనవచ్చు. ఈ గ్రూప్‌ ఎక్కువ కాలం నిలువలేదు. 1942లోనే విడివడింది. ఇదే ఆలోచనల సరళితో ముందుకు తీసుకువెళ్లిన వారు తరువాత సంఘటితమైన సుజా, రాజా, హుస్సేన్‌ మొదలగు ప్రోగ్రెస్‌ గ్రూప్‌ వారు (వారి గురించి రాబోయే వ్యాసాల్లో మాట్లాడదాం).
పి.టి.రెడ్డి తన పని, ఆలోచనల వదిలిపెట్టలేదు. 1942లో తన రెండవ ప్రదర్శన చేశారు. అందులో ఎన్నో రకాల చిత్రాలు ప్రదర్శించారు. కొన్ని ప్రకృతి చిత్రాలైతే కొన్ని పోట్రేటులు. తన కళలు, బతుకు తెరువు కోసం పరుగులూ, రెండూ ఒకదానితో ఒకటి పోటీ పడుతుండగా ప్రయాణం సాగించారు. లాహోర్‌లోని సినిమా స్టూడియోకి చిత్రకళా దర్శకుడిగా కూడా పనిచేశారు. ఆపై హైదరాబాద్‌ తిరిగి వచ్చారు. తర్వాత ఎన్నో చిత్రాలు వేశారు. చంద్రుడి ఆగమనం, తెలంగాణా పోరాటం, కామసూత్రంపై ఎన్నో వందల డ్రాయింగులు చిత్రాలు వేశారు. 1969లో ఆయన శ్రీమతి యశోదారెడ్డి (రచయిత్రి) తెలుగులో తన పరిశోధన కోసం అడుగగా భారతీయ సాంస్కతిక గ్రంథం హరివంశంపై సాంకేతిక చిహ్నాలతో తాంత్రిక కళాపద్ధతిలో చిత్రాలు గీశారు.

ఆయనకు భారతీయ సాంస్కృతిక విభాగం నుండి గౌరవ పురస్కారం వచ్చింది. అది ఆయన తాంత్రిక కళా చిత్రణకు మరిన్ని ఆలోచనల ద్వారాలు తెరిచింది. శివ, హరిహర, వైష్ణవి, కాత్యాయని, బ్రహ్మీ వంటి ఎన్నో విషయాలపై, అలాగే శ్రీయంత్రం, కమలం, బౌద్ధ, హిందూ తాంత్రిక చిహ్నాలపై ఆయన పనిచేశారు. ఆనాడు మన భారతీయ తత్వాన్ని విషయంగా తీసుకుని చిత్రాలు వేయటం ఒక ఆధునిక సిద్ధాంతం. 1940లలో మొదలైన ఆయన ఆలోచన భారతీయ తత్వం, అంతర్జాతీయ కళాపద్ధతులు కలిపి కళలు రూపొందించాలనే, అది మన దేశ చిహ్నాలపై ఉండాలనే ఆయన ఆలోచన ఈ దారిలో రూపుదిద్దుకుంది. అలాగే ఆయన ఆనాటి సామాజిక పరిస్థితులు, నాయకుల పోట్రేటులూ చిత్రించారు. ఎన్నో కళావేదికలకు సాయం చేశారు. కేంద్ర, రాష్ట్ర లలితకళా అకాడమీలు, ఆంధ్రప్రదేశ్‌ ఆర్ట్‌ కౌన్సిల్‌, హైదరాబాద్‌ ఆర్ట్‌ సొసైటీకి సేవ చేశారు. అలాగే అనేక కళాసంఘాలకు, గాలరీలకు గౌరవ సభ్యులుగా సలహాలిచ్చారు. ఆయన కళాకృతులు, బకింగ్‌హామ్‌ పాలెస్‌, జె.జె.స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్‌, రాష్ట్రపతి భవన్‌, దేశ, రాష్ట్ర లలితకళా అకాడమీలు, ఢిల్లీలోని నేషనల్‌ గ్యాలరీ ఆఫ్‌ మోడర్న్‌ ఆర్ట్‌, భారతీయ సంస్కృతిక విభాగం, పార్లమెంట్‌ హౌస్‌ ఇలా ఎన్నో చోట్ల పొందుపరిచి వున్నాయి. ఆయన 1996లో కన్నుమూశారు.

డా||యం.బాలామణి, 8106713356

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -