Tuesday, July 21, 2026
E-PAPER
Homeజాతీయంద‌ద్ద‌రిల్లిన పార్ల‌మెంట్‌

ద‌ద్ద‌రిల్లిన పార్ల‌మెంట్‌

- Advertisement -

రామ మందిరంలో విరాళాల చోరీ, నీట్ ప్ర‌శ్నాప‌త్రం లీక్ వ్య‌వ‌హారంపై ప్ర‌తిప‌క్ష‍ాల నిలదీత
ఆరు సార్లు వాయిదా ప‌డిన ఉభ‌య స‌భ‌లు సభ నేటికి వాయిదా
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాల తొలిరోజే పార్లమెంట్‌ దద్దరిల్లింది. నీట్ ప్రశ్నాపత్రం లీక్, అయోధ్య రామ మందిరంలో విరాళాల చోరీ వంటి అంశాల‌పై చ‌ర్చ‌కు ప్ర‌తిప‌క్షాలు ప‌ట్టుబట్టాయి. దీనికి ప్ర‌భుత్వం విముఖ‌త వ్య‌క్తం చేయ‌డంతో ప్ర‌తిప‌క్ష స‌భ్యులు ఆందోళ‌న చేప‌ట్టారు. దీంతో పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌లు ఆరు సార్లు వాయిదాపడ్డాయి. చివ‌రికి నేటి(మంగ‌ళ‌వారం)కి సభ వాయిదా ప‌డింది. సోమ‌వారం లోక్‌స‌భ‌ను స్పీక‌ర్ ఓం బిర్లా ప్రారంభిస్తూ ప్ర‌శ్నోత్త‌రాలు నిర్వ‌హించేందుకు సిద్ధ‌ప‌డ్డారు. అయితే ప్ర‌తిప‌క్షాలు నీట్ ప్రశ్నాపత్రం లీక్, అయోధ్య రామ మందిరంలోని విరాళాల దొంగ‌త‌నంపై చ‌ర్చ‌కు డిమాండ్ చేశాయి. ప్ర‌తిప‌క్ష స‌భ్యులు త‌మ తమ స్థానాల్లో నుంచే లేచి నినాదాలు హోరెత్తించారు. సభ్యులు సంయమనం పాటించాలని స్పీక‌ర్ ఓం బిర్లా విజ్ఞప్తి చేశారు. నినాదాలతో సభ పని చేయలేదని, సభా కార్యకలాపాలు కొనసాగేలా చూడాలని కోరారు. అయినా నిరసనలు కొనసాగుతుండటంతో ఆయన సభ ప్రారంభ‌మైన 13 నిమిషాల్లోనే వాయిదా వేశారు. తిరిగి ప్రారంభ‌మైన స‌భ‌లో గందరగోళం మధ్యే న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ సుప్రీంకోర్టు (న్యాయమూర్తుల సంఖ్య) సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. అయిన‌ప్ప‌టికీ స‌భ‌లో ప్ర‌తిప‌క్షాల ఆందోళ‌న కొన‌సాగింది. దీంతో స‌భ ప్రారంభ‌మైన ఆరు నిమిషాల్లోనే (మధ్యాహ్నం 12.30 గంటలకు) ప్యానెల్ స్పీక‌ర్ దిలీప్ సైకియా సభను వాయిదా వేశారు. ఆ తర్వాత ప్రారంభ‌మైన స‌భ‌లో ప్ర‌తిపక్షాల ఆందోళ‌న కొన‌సాగడంతో ఐదు నిమిషాల్లోనే మళ్లీ మ‌ధ్యాహ్నం 1 గంట‌కు సభ వాయిదా ప‌డింది. అనంతరం ప్రారంభ‌మైన స‌భ‌లోనూ అదే ప‌రిస్థితి కొన‌సాగడంతో ప్యానెల్ స్పీక‌ర్ దిలీప్ సైకియా రెండు నిమిషాల్లోనే మ‌ధ్యాహ్నం 2.00 గంట‌ల‌కు సభను వాయిదా వేశారు. మరలా సభ ప్రారంభ‌మైనా ప్ర‌తిప‌క్షాల ఆందోళ‌న అదే విధంగా కొన‌సాగింది. దీంతో ప్యానెల్ స్పీక‌ర్ జ‌గ‌దాంబికా పాల్ మూడు నిమిషాల్లోనే మ‌ధ్యాహ్నం 2. 30 గంట‌ల‌కు స‌భ‌ను వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభ‌ం కాగా మూడు నిమిషాల్లోనే మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు సభను వాయిదా వేశారు. ఆ తర్వాత ప్రారంభ‌మైన స‌భ‌లో కూడా అదే ప‌రిస్థితి నెల‌కొన‌డంతో ప్యానెల్ స్పీక‌ర్ జ‌గ‌దాంబిక పాల్ స‌భ‌ను రెండు నిమిషాల్లోనే నేటి (మంగ‌ళ‌వారం)కి వాయిదా వేశారు.

రాజ్య‌స‌భ‌లో కూడా అదే తంతు కొన‌సాగింది. రాజ్య‌స‌భ‌ను చైర్మెన్‌ సీపీ రాధాకృష్ణ‌న్ ప్రారంభించారు. ఇటీవ‌ల కొత్త‌గా ఎన్నికైన తొమ్మిది మంది స‌భ్యుల‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంత‌రం ప్ర‌తిప‌క్ష స‌భ్యులు నీట్ ప్ర‌శ్నాప‌త్రం లీక్‌, అయోధ్య రామ మందిరంలో విరాళాల దొంగతనం అంశాల‌ను లేవ‌నెత్తారు. ఆయా అంశాల‌పై చ‌ర్చించాల‌ని ప‌ట్టుప‌ట్టారు.
చైర్మెన్‌ వారించిన‌ప్ప‌టికీ, ప్ర‌తిప‌క్ష స‌భ్యులు చ‌ర్చించాల్సిందేన‌ని పట్టుబట్టారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌తిప‌క్ష నేత మ‌ల్లికార్జున ఖ‌ర్గే మాట్లాడుతూ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీచార్జిని ఆయన ఖండించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జవాబుదారీతనం వహించాలని డిమాండ్ చేశారు. ‘‘ నేను లక్షలాది విద్యార్థుల భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాను. దానికోసమే వేలాది మంది విద్యార్థులు జంతర్ మంతర్‌ వద్దకు వచ్చారు.ఈ క్రమంలో పోలీసులు వారిపై లాఠీచార్జి చేశారు. ప్రభుత్వం వారి ఆందోళనను అణచివేయాలని ప్రయత్నిస్తోంది’’ అని నినాదాల మధ్యే ఖర్గే అన్నారు. దీంతో చైర్మెన్‌ రాధాకృష్ణ‌న్‌ స‌భ‌ను మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభ‌మైన స‌భ‌లోనూ ప్ర‌తిప‌క్షాల ఆందోళ‌న కొన‌సాగింది. దీంతో స‌భ‌ను ఒక్క నిమిషంలోనే మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల‌కు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభ‌మైన స‌భ‌లో ప్ర‌తిప‌క్షాల ఆందోళ‌న అలాగే కొన‌సాగ‌డంతో మళ్లీ ఒక్క నిమిషంలోనే మ‌ధ్యాహ్నం 12. 50 గంట‌ల‌కు సభ వాయిదా ప‌డింది. అనంత‌రం ప్రారంభ‌మైన స‌భ‌లో అదే సీన్ కొన‌సాగింది. దీంతో స‌భ‌ను 50 సెకెన్ల‌లోనే మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు వాయిదా వేశారు. మరలా తిరిగి ప్రారంభ‌మైన స‌భ‌లో ప్ర‌తిప‌క్షాల ఆందోళ‌న కొన‌సాగ‌డంతో డిప్యూటీ చైర్మెన్‌ హ‌రివంశ్ నారాయ‌ణ్ సింగ్ స‌భ‌ను రెండు నిమిషాల్లోనే మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు వాయిదా వేశారు. ఆ తర్వాత సభ ప్రారంభ‌మైనా అందే తంతు కొనసాగడంతో డిప్యూటీ చైర్మెన్ హ‌రివంశ్ నారాయ‌ణ్ సింగ్ ఒకే నిమిషంలో సభను నేటి (మంగ‌ళ‌వారం)కి వాయిదా వేశారు.

ప్ర‌తిప‌క్షాల భేటీ
సమావేశానికి ముందే​ ప్రతిప‌క్షాల‌న్నీ స‌మావేశమయ్యాయి. ప్రభుత్వం నుంచి జవాబుదారీతనం కోరేందుకు ఇండియా బ్లాక్ నేతలు నిర్ణ‌యించారు. రామ మందిర విరాళాల అక్రమాలు, విద్యా వ్యవస్థ ‘కుప్పకూలడం’ వంటి పలు అంశాలపై ప్రభుత్వం నుంచి జవాబుదారీతనం కోరాల‌ని నిర్ణ‌యించారు.
ఈ సమావేశానికి ముందు ప్రతిపక్ష నాయకులు , రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే ఛాంబర్‌లో సమావేశమయ్యారు. “2015 నుంచి 152 సార్లు ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి, 25 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ధర్మేంద్ర ప్రధాన్‌ను తప్పక తొలగించాలి” అని ఖ‌ర్గే అన్నారు. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, గౌరవ్ గొగోయ్, జైరాం రమేష్, సుప్రియా సూలే, సాగరికా ఘోష్, సంజయ్ రౌత్, జాన్ బ్రిట్టాస్‌తో పాటు ఇండియా బ్లాక్ పార్టీల నాయకులు హాజరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -