హౌసింగ్‌బోర్డ్ నేతృత్వంలో నిర్మాణం
ఇంటిధర రూ.11 లక్షలు, ప్రభుత్వ సబ్సిడీ రూ.5 లక్షలు, లబ్దిదారుని వాటా రూ.6 లక్షలు
దరఖాస్తు రుసుం రూ.100, ఈఎమ్‌డీ రూ.10వేలు కట్టాలి
నేటి నుంచి ఆగస్టు 10 వరకు దరఖాస్తుల స్వీకరణ
మీసేవ, వాట్సాప్, వెబ్‌సైట్ల ద్వారా రిజిస్ర్టేషన్లు
ఏ నియోజకవర్గంవారు అక్కడే అప్లికేషన్లు పెట్టుకోవాలి
తొలి విడతలో 16 నియోజకవర్గాల్లో 18 టవర్లతో 7,680 ఇండ్లు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇండ్ల మంజూరులో రిజర్వేషన్లు
ఏడాదిలో నిర్మాణాలు పూర్తి
‘క్యూర్’ పరిధిలో ఇండ్ల నిర్మాణాలు ప్రకటించిన మంత్రులు
త్వరలో మధ్యతరగతికి కూడా…
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హైదరాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డుకు లోపలి ప్రాంతంలోని ‘క్యూర్’ పరిధిలో తెలంగాణ హౌసింగ్ బోర్డ్ నేతృత్వంలో అల్పాదాయ వర్గాల కోసం ఎల్‌ఐజీ గృహ సముదాయాలు నిర్మాణం చేస్తున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తొలి విడతలో 16 నియోజకవర్గాల్లో ప్రయోగాత్మకంగా నియోజకవర్గానికి 480 చొప్పున మొత్తం 7,680 ఇందిరమ్మ ఇండ్లను బహుళ అంతస్తుల్లో (టవర్లు) నిర్మించి ఇస్తారు. వీటిలో ఆసక్తి వ్యక్తీకరణను చూసాక, త్వరలో మరో 8 నియోజకవర్గాల్లో కూడా ఈ పధకం అమలు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం నాడిక్కడి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ర్ట సచివాలయంలో సహచర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజారుద్దీన్ తదితరులతో కలిసి క్యూర్ పరిధిలోని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమ ప్రకటన చేసి బ్రోచర్, మీసేవ, వాట్సాప్ దరఖాస్తులను ఆవిష్కరించారు. ఈసందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ అల్పాదాయవర్గాల వారికి ఎక్కడి వారికి అక్కడే గృహ వసతి కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ ఇందిరమ్మ ఇండ్ల స్కీంలో లబ్దిదారులకు ఇంటి స్థలం ఉచితంగా ఇస్తామన్నారు. ఇంటి నిర్మాణ వ్యయం మొత్తం రూ.11 లక్షలు కాగా, దానిలో రూ.5లక్షలు ప్రభుత్వ సబ్సిడీ ఉంటుందనీ, మిగిలిన రూ.6 లక్షల్ని నాలుగు వాయిదాల్లో లబ్దిదారులు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల పధకం పేరును ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సహేతుకంగా వివరించిన నల్గొండ జిల్లా నకిరేకల్ గ్రామానికి చెందని కొండా నాగరాజుకు మంత్రులు రూ.లక్ష నగదు బహుమతిని అందజేసి, సత్కరించారు. కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు అద్దంకి దయాకర్, శాసనసభ్యులు దానం నాగేందర్, మల్‌రెడ్డి రంగారెడ్డి, అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, కాలేరు వెంకటేష్ , ప్రకాష్ గౌడ్, శ్రీగణేష్, మాజిద్ హుస్సేన్, కౌసర్ మొహినుద్దీన్, జుల్ఫీకర్ అలీ, జాఫర్ హుస్సేన్, ముబీన్, హౌసింగ్ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ గౌతమ్, కలెక్టర్ ప్రియాంక ఆల తదితరులు పాల్గొన్నారు.
ఎల్‌ఐజీ వివరాలిలా…
జులై 21 నుంచి ఆగస్టు 10 వరకు మీసేవా కేంద్రాలు, వాట్సాప్ (ఫోన్ నెంబర్ – 8096958096), వెబ్‌సైట్ meesewa.telangana.gov.in ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. – దరఖాస్తు రుసుం రూ.100, ఈఎమ్‌డీ/టోకెన్ అడ్వాన్స్‌గా రూ.10వేలు చెల్లించాలి. ఇల్లు కేటాయింపబడితే లబ్దిదారుడు చెల్లించాల్సిన రూ.6 లక్షల్లో ఈఎమ్‌డీ రూ.10వేలు మినహాయిస్తారు. మిగిలిన రూ.5,90,000 నాలుగు వాయిదాల్లో చెల్లించాలి. ఇల్లు కేటాయించబడకపోతే రూ.10వేలు తిరిగి లబ్దిదారులకు వాపస్ ఇస్తారు.
దరఖాస్తు సమయంలోనే ఇన్‌కం, కులం, రెసిడెన్స్ వంటి సర్టిఫికెట్లు సమర్పించక్కర్లేదు. ఇల్లు కేటాయింపు జరిగితే అప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది.
పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకొని వారు నివసిస్తున్న ప్రాంతాల్లోనే ఇండ్ల నిర్మాణాలు చేపడతారు.
ఫ్లాట్ విస్తీర్ణం 528 చదరపు అడుగులు. అన్‌డివైడెడ్ స్థలాన్ని మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తారు.
పదేండ్ల నుంచి అదే ప్రాంతంలో నివసిస్తున్నట్టు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. ఇంటి కేటాయింపు జరిగాక పదేండ్ల వరకు అమ్ముకొనే హక్కు ఉండదు. ఇతర ఆర్థిక అవసరాల కోసం ఇంటి కాగితాలు బ్యాంకుల్లో, ఇతర ఆర్థిక సంస్థల్లో తనఖా పెటుకోవచ్చు.
ఇండ్ల మంజూరులో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ ఉంటుంది.
లబ్దిదారుని కుటుంబ వార్షిక ఆదాయం రూ. 6 లక్షల లోపు ఉండాలి. దరఖాస్తుదారుని పేరిట క్యూర్ పరిధిలో స్ధలం గానీ, స్వంత ఇల్లుకానీ ఉండకూడదు. ఒక కుటుంబం నుంచి ఒక దరఖాస్తు మాత్రమే స్వీకరిస్తారు.
ఎక్కువ దరఖాస్తులు వస్తే బహిరంగ లాటరీ ద్వారా ఇళ్లు మంజూరు చేస్తారు.
ఎల్‌ఐజీలో ప్రతిపాదించిన 525 చదరపు అడుగుల ఫ్లాట్ లో ఒక బెడ్ రూమ్, హాల్, కిచెన్, వాష్ ఏరియా, బాత్‌రూం ఉంటాయి. తూర్పు, పడమర ముఖాల్లో ఇండ్ల నిర్మాణం ఉంటుంది.
ఇండ్ల నిర్మాణాలు చేపట్టే నియోజకవర్గాలు
అసెంబ్లీ నియోజకవర్గం ఇండ్ల నిర్మాణ ప్రాంతం
1.రాజేంద్రనగర్ మైలార్‌దేవ్‌పల్లి
2.మహేశ్వరం జల్‌పల్లి
3.శేరిలింగంపల్లి రాయదుర్గం
4.ఇబ్రహీంపట్నం తట్టిఅన్నారం, బండ్లగూడ
5.మల్కాజిగిరి కౌకూర్
6.నాంపల్లి రెడ్‌హిల్స్, నీలోఫర్ ఆస్పత్రి సమీప పోలీస్ క్వార్టర్స్
7.ఖైరతాబాద్ హకీంపేట్ దర్గ, జూబ్లీహిల్స్, ఎమ్మెల్యేకాలనీ
8.కార్వాన్ కుల్సుంపురా పోలీస్ క్వార్టర్స్
9.బహదూర్‌పురా నందిముసలిగూడ
10.అంబర్‌పేట్ సిటీపోలీస్ లైన్స్
11.కూకట్‌పల్లి కేపీహెచ్‌బీకాలనీ
12.మేడ్చల్ పోచారం ఎల్‌ఐజీకాలనీ
13.కుత్బుల్లాపూర్ జులరామారం
14.సనత్‌నగర్ పాటిగడ్డ
సికింద్రాబాద్ కంటోన్మెంట్ మారేడ్‌పల్లి–మహేంద్రహిల్స్
మలక్‌పేట్ గడ్డిఅన్నారం ఆర్అండ్ బీ క్వార్టర్స్
అల్పాదాయవర్గాలకోసం ఎల్‌ఐజీ గృహ సముదాయాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



