90 డాలర్లు దాటిన బ్యారెల్ ధర
లండన్ : పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా దూసుకెళ్లాయి. హర్మూజ్ జలసంధి గుండా చమురు రవాణాకు ఆటంకాలు ఏర్పడటంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర సోమవారం 2 శాతం పెరిగి 90 డాలర్ల మార్కును దాటింది. జూన్ 11 తర్వాత ఈ స్థాయికి ధరలు చేరడం ఇదే మొదటిసారి. సోమవారం ఉదయం క్రూడ్ ఫ్యూచర్స్ 2.37 శాతం (2.09 డాలర్లు) పెరిగి 90.19 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. గత వారం రోజుల్లోనే చమురు ధరలు 15.9 శాతం మేర పెరిగాయి, ఇది ఏప్రిల్ తర్వాత అత్యధిక పెరుగుదల. అలాగే అమెరికా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూ టీఐ) క్రూడ్ ఆయిల్ కూడా 2.07 శాతం ఎగిసి 84.20 డాలర్లకు చేరుకుంది.గత వారాంతంలో అమెరికా ఇరాన్‌పై వరుసగా తొమ్మిదో రోజు దాడులను కొనసాగించగా కువైట్, బహ్రెయిన్ దేశాల్లో ఇరాన్ దాడులు జరిపినట్టు సమాచారం. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో హార్ము జ్ జలసంధి గుండా జరిగే చమురు రవాణాపై తీవ్ర ప్రభావం పడుతోంది. సోమవారం హార్ము జ్ జలసంధి గుండా కేవలం నాలుగు నౌకలు మాత్రమే ప్రయాణించినట్టు ఎల్‌ఎస్‌ఈజీ డేటా వెల్లడించింది. ఇది అంతకుముందు రోజుతో పోలిస్తే సగానికి పడిపోయింది. ప్రపంచ చమురు వాణిజ్యంలో ఐదో వంతు ఈ జలసంధి ద్వారానే జరుగుతుండటంతో ఈ పరిణామాలు అంతర్జాతీయ మార్కెట్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చమురు నిల్వలు గత ఐదేండ్లలో కనిష్ట స్థాయికి పడిపోయిన తరుణంలో ఈ ఉద్రిక్తతలు కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
మళ్లీ భగ్గుమన్న ఆయిల్ ధరలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



