వైభవ్ సూర్యవంశీ, రింకు సింగ్‌పై ఫోకస్
శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీకి అగ్ని పరీక్ష
రేపటి నుంచి భారత్, జింబాబ్వే టీ20 సిరీస్
ఐర్లాండ్, ఇంగ్లాండ్ చేతిలో వరుస సిరీస్ ఓటములు చవిచూసిన శ్రేయస్ అయ్యర్‌కు జింబాబ్వే పర్యటన ఓ మంచి అవకాశం. కెప్టెన్‌గా తొలి విజయం కోసం ఎదురుచూస్తున్న శ్రేయస్ అయ్యర్‌కు జింబాబ్వేలో తొలి ప్రాధాన్య జట్టు అందుబాటులో ఉంది. ఇక్కడైనా భారత్ గెలుపు బాట పట్టకుంటే కెప్టెన్‌కు కష్టాలు తప్పవేమో!. భారత్, జింబాబ్వే 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్ గురువారం నుంచి ఆరంభం కానుంది.
నవతెలంగాణ క్రీడావిభాగం
సూర్యవంశీకి చక్కటి చాన్స్ : అండర్19 ప్రపంచకప్ ఫైనల్లో 80 బంతుల్లో 175 పరుగులు బాదిన చోట వరుసగా మూడు టీ20 ఆడే అవకాశం సూర్యవంశీకి చిక్కనుంది. సీనియర్ ఓపెనర్ సంజు శాంసన్‌కు విశ్రాంతి లభించగా, ఈ సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ అన్ని మ్యాచ్‌ల్లో ఆడనున్నాడు. ఇంగ్లాండ్ పర్యటనలో వైభవ్‌కు మూడు అవకాశాలు దక్కినా.. 14, 13, 15 పరుగులతో సరిపెట్టాడు. జోఫ్రా ఆర్చర్ షార్ట్ బాల్ అస్ర్తంతో సూర్యవంశీని ఇబ్బంది పెట్టాడు. మూడింట రెండు సార్లు అతడి వికెట్ పడగొట్టాడు. జోఫ్రా ఆర్చర్ షార్ట్ బాల్ అస్ర్తం నుంచి జింబాబ్వే పేసర్లు సైతం పాఠాలు నేర్చుకోవటం సహజం. ఆ బలహీనత అధిగమిస్తూ.. జట్టులో స్థానం సుస్థిరం చేసుకునేందుకు సూర్యవంశీకి ఈ సిరీస్ ఓ వేదిక. సూర్యవంశీ పరుగుల వేటలో రాణించటం అతడికి అత్యవసరం.
అయ్యర్‌కు అగ్ని పరీక్ష
శ్రేయస్ అయ్యర్ భారత టీ20 జట్టు కెప్టెన్‌గా గడ్డు కాలం చూస్తున్నాడు. ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్‌ను తొలి ఏడు మ్యాచ్‌ల్లో అజేయంగా నడిపించిన అయ్యర్.. ఆ తర్వాత ఏడు మ్యాచ్‌ల్లో ఒక్క మ్యాచ్‌లో గెలిపించాడు. 2023 నుంచి భారత్‌కు టీ20 ఆడకపోయినా నేరుగా కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. పసికూన ఐర్లాండ్ చేతిలో 0-2తో, ఇంగ్లాండ్ చేతిలో 0-4తో భారత్ ఓడింది. ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌ల్లో భారత్‌కు కెప్టెన్సీ వహించిన అయ్యర్.. తొలి విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో బ్యాటర్‌గా అయ్యర్ రాణించాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో 157.97 స్ర్టయిక్‌రేట్‌తో 218 పరుగులు చేశాడు. బ్యాటర్‌గా ఫామ్ కొనసాగిస్తూ జట్టును గెలుపు బాటలో నడిపించటం శ్రేయస్ అయ్యర్ ముందున్న సవాల్. జింబాబ్వే సిరీస్‌లో అయ్యర్ సానుకూల ఫలితాలు సాధించకుంటే.. అతడి కెప్టెన్సీ ప్రశ్నార్థకం కావటం తథ్యం.
రింకు సింగ్‌పై ఫోకస్
టీ20 ప్రపంచకప్ సమయంలో తండ్రిని కోల్పోయిన రింకు సింగ్.. ఐపీఎల్ 19 ఆరంభంలో నూ అంతగా మెప్పించలేదు. ఆరంభంలోనే వికెట్ల పతనంతో రింకు సింగ్ ముందుగానే బ్యాటింగ్ రావటం.. స్పిన్ బలహీనతతో వికెట్ పారేసుకోవటం చూశాం. బ్యాటింగ్ కోచ్ అభిషేక్ నాయర్ రింకు సింగ్ బలహీనతను సరి చేశాడు. అతడి టెక్నిక్‌లో స్వల్ప మార్పులు చేశాడు. దీంతో ఆతర్వాత రింకు సింగ్ వరుసగా విలువైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. భారత టీ20 జట్టులో ఫినిషర్‌గా రింకు సింగ్ ఇటీవల ప్రాధాన్యత కోల్పోయాడు. ఆల్‌రౌండర్లకు ప్రాధాన్యత ఇవ్వటంతో రింకుకు అవకాశాలు రాలేదు. జింబాబ్వే పర్యటనలో రింకు సింగ్ ఫినిషర్‌గా మరోసారి తనేంటే చూపించాల్సిన అవసరం ఏర్పడింది. మిడిల్ ఓవర్లలో, డెత్ ఓవర్లలో ఎప్పుడు క్రీజులోకి వచ్చినా ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడేందుకు రింకు సింగ్ సిద్ధంగా ఉన్నట్టే కనిపిస్తున్నాడు.
యువ పేస్ దళం
మయాంక్ యాదవ్ చివరి మూడు టీ20లు 2024 సెప్టెంబర్‌లో ఆడాడు. ఆ తర్వాత పలుమార్లు గాయంతో ఆటకు దూరంగా ఉన్నాడు. ఇటీవల శ్రీలంక పర్యటనలో భారత్-ఏ జట్టులో మయాంక్ లేడు. దీంతో మయాంక్ యాదవ్ ఈ సిరీస్‌లో సత్తా చాటేందుకు చూస్తున్నాడు. నాణ్యమైన పేస్ మయాంక్ యాదవ్ బలం. ఆ బలమే అతడిని భారత జట్టులో నిలిచేలా చేసింది. అశోక్ శర్మ, యశ్ ఠాకూర్ జట్టులోని మరో ఇద్దరు యువ పేసర్లు. ఇటీవల శ్రీలంక పర్యటనలో భారత్-ఏ తరఫున ఈ ఇద్దరు రాణించారు. అశోక్, మయాంక్‌లు నిలకడగా గంటకు 150కిమీ వేగంతో బంతులు సంధించగలరు. దీంతో ఈ ఇద్దరు పేసర్ల ప్రదర్శనపై ఆసక్తి నెలకొంది. యశ్ ఠాకూర్ పంజాబ్ కింగ్స్ తరఫున ఈ ఐపీఎల్‌లో ఓ మ్యాచ్ ఆడాడు. రెగ్యులర్ బిసీసీఐ ప్రణాళికల్లో ఉన్న ఆటగాడు. విజయ్ హజారే ట్రోఫీలో 19 వికెట్లతో విదర్భ తొలిసారి 50 ఓవర్ల టోర్నమెంట్ విజేతగా నిలిచేందుకు దోహదం చేశాడు. జింబాబ్వేతో సిరీస్‌లో ఈ యువ పేసర్లపై ఫోకస్ కనిపించనుంది.



