Wednesday, July 22, 2026
E-PAPER
Homeఆదిలాబాద్నైపుణ్యాధారిత విద్యాబోధన ఉండాలి: కలెక్టర్

నైపుణ్యాధారిత విద్యాబోధన ఉండాలి: కలెక్టర్

- Advertisement -

జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
నవతెలంగాణ – ముధోల్

ఐఐఐటి విద్యార్థులు విద్య పూర్తిచేసి బయటకు వెళ్లే నాటికే మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందేలా నైపుణ్యాభివృద్ధి ఆధారిత విద్యాబోధన చేపట్టాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ బాసర ఐఐఐటి క్యాంపస్‌ను సందర్శించి, విశ్వవిద్యాలయ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, పరిశ్రమలకు అవసరమైన సామర్థ్యాలను పెంపొందించేలా విద్యా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.

ఆధునిక సాంకేతికతను సమర్థంగా వినియోగించి, విద్యార్థులను జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగాలకు పోటీపడే స్థాయికి తీర్చిదిద్దాలని తెలిపారు. విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థుల సమస్యలేవైనా అధికారుల దృష్టికి వస్తే వెంటనే స్పందించి, పరిష్కరించాలని సూచించారు. అలాగే అధ్యాపకులు, ఉద్యోగులు, సిబ్బందికి కూడా మెరుగైన పని వాతావరణం, అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అన్నారు.

క్యాంపస్‌లో నిరంతర విద్యుత్ సరఫరా, సురక్షితమైన తాగునీరు, నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. అకాడమిక్, డిజిటల్, క్రీడా సదుపాయాల విస్తరణతో పాటు విద్యార్థుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. క్యాంపస్‌కు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం బాసరలో ప్రతిపాదిత నూతన తహసీల్దార్ కార్యాలయ నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని కలెక్టర్ పరిశీలించి, అవసరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఐఐఐటి ఉపకులపతి గోవర్ధన్, ఓఎస్డీ మురళీ దర్శన్, తహసీల్దార్ పవన్ చంద్ర, విశ్వవిద్యాలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -