నవతెలంగాణ – పరకాల
ఏఐసీసీ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష నాయకుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ పరకాలలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మంగళవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. పరకాల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మదాసి శ్రీధర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు సాగిన ఈ ర్యాలీలో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం అంబేద్కర్ సెంటర్ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్య విలువలను కాలరాసే చర్య అని తీవ్రంగా విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని అణచివేసేలా కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరిని అవలంబిస్తోందని మండిపడ్డారు. ప్రజల గొంతుకై ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నేతలను అణగదొక్కాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. నీట్ పేపర్ లీకేజీ కారణంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే తమ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసు బలప్రయోగం చేయడం అత్యంత దుర్మార్గమని పేర్కొన్నారు.
ఈ నిరసన కార్యక్రమంలో పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్, పరకాల టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒంటేరు శ్రావణ్, వివిధ వార్డుల కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, యూత్ కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



