2017లో సునీతా, సుహాస్ తమ కార్పొరేట్ ఉద్యోగాన్ని విడిచిపెట్టారు. ఈ దంపతులు తమ జీవితాన్నంతా ఐదు బ్యాగుల్లో సర్దుకుని బెంగళూరు నుండి అడుగు బయటపెట్టారు. చాలాకాలంగా వేధిస్తున్న కొన్ని ప్రశ్నలు వారిని నీలగిరికి నడిపించాయి. అక్కడ వారు ‘ది గుడ్ డాల్’ అనే సంస్థను స్థాపించి ‘నీలా’ను సృష్టించారు. నేడు ఈ సంస్థ వంద మందికి పైగా మహిళకు ఉపాధి కల్పిస్తోంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం…
‘కార్పొరేట్ ఉద్యోగంలో ఎంత డబ్బు సంపాదించినా అదంతా క్షణికమైన ఆనందం మాత్రమే. వారాంతపు విహారయాత్రలు, పార్టీలు తప్ప ఏమీ ఉండవు’ అని అంటారు సునీత. అంతేకాదు వారు గడిపిన ఆ జీవితాన్ని తమ తొమ్మిదేండ్ల కొడుకు కూడా గడపకూడదని వారు కోరుకున్నారు. అందుకే అతనికి ఎలాంటి పాఠ్యప్రణాళిక లేదా నిర్దిష్ట సిలబస్ లేకుండా ‘అన్‌స్కూలింగ్’ చేశారు. తాను ఏమి నేర్చుకోవాలనుకుంటున్నాడో నిర్ణయించుకునే స్వేచ్ఛను ఇచ్చారు.
రెండున్నర నెలలు పదివేల కిలోమీటర్లు
2016లో ఈ దంపతులు తమ కొడుకుతో కలిసి భారతదేశంలోని 14 రాష్ట్రాల గుండా రెండున్నర నెలల పాటు 10,000 కిలోమీటర్ల రోడ్ ట్రిప్ చేశారు. ఈ ప్రయాణంలో వారు సుమారు 85% సమయాన్ని గ్రామీణ భారతదేశంలోని అపరిచితులతో కలిసి జీవించారు. ‘సంతోషంగా ఉండటానికి పెద్దగా ఏమీ అవసరం లేదని మేము గ్రహించాం. అది బాహ్యమైన దానికంటే అంతర్గతమైనదే ఎక్కువ’ అని ఆమె అంటారు. 2017 మధ్య నాటికి వారు తమ ఉద్యోగాలను వదిలిపెట్టి, తమిళనాడులోని కూనూరులో ఒక నిర్జన ప్రదేశంలో ఉన్న చిన్న కుటీరానికి మారారు. మూడవ నెలలో వారికి సమీప గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో, కోటగిరి శివార్లలో అడవితో చుట్టుముట్టబడిన ఒక భూభాగం దొరికింది. సామాజిక కట్టుబాట్లకు, ఆధునిక సౌకర్యాలకు దూరంగా జీవించాలన్నది వారి ప్రణాళిక. అరటిపండ్లు, ఆకుకూరలు, గుమ్మడికాయలు, గుడ్లు తీసుకుని చాలా మంది వారి ఇంటికి వస్తుండేవారు. తెలియకుండానే వారు ఆ సమాజంలో ఒక భాగంగా మారిపోయారు. ఆ భూమిలో పని చేయడానికి వారికి సహాయం చేయడం ప్రారంభించారు.
మహిళలకు శిక్షణ
ఆ గ్రామంలోని ప్రజలకు కొన్ని నైపుణ్యాలు ఉన్నాయి. కానీ సామాజిక వ్యవస్థాపకత గురించి పెద్దగా తెలియదు. కానీ కాలక్రమేణా వారు తమ లక్ష్యాన్ని కనుగొన్నారు. గ్రామాల్లో పురుషులకు అప్పటికే రోజువారీ కూలీ పనులు ఉండటంతో, వారు మహిళలతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. సునీతకు మొదటి నుండి ఏదైనా కొత్త కళలను యూట్యూబ్ నుండి నేర్చుకునే అలవాటు ఉంది. దాన్ని వ్యాపారంగా మార్చే నైపుణ్యం కూడా ఉంది. ఆ నైపుణ్యాలను ఇతరులకు నేర్పించే సామర్థ్యం కూడా ఉంది. 2019లో ఆమె ఐదుగురు మహిళలకు వారి ఇంట్లోనే ప్యాచ్‌వర్క్ క్విల్టింగ్ నేర్పించింది. వాటిని ఆన్‌లైన్‌లో అమ్మడం మొదలుపెట్టింది. ఏడాదిలోనే వారు రూ.30 లక్షల ఆదాయాన్ని సంపాదించారు. మహమ్మారి సమయంలో వైద్యులను సంప్రదించి, మిగిలిపోయిన క్విల్టింగ్ ఫ్యాబ్రిక్‌తో మూడు పొరల మాస్క్‌లను తయారు చేసి దేశవ్యాప్తంగా డెలివరీ చేశారు. ప్రజలు కోరుకునే వస్తువును తయారు చేయడానికి, వారికి అవసరమైన వస్తువును తయారు చేయడానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వారు అర్థం చేసుకున్నారు.
కొత్త ఉత్పత్తి కోసం…
మహమ్మారి తర్వాత వారు మాక్రమే, క్రోచెట్, ఎంబ్రాయిడరీలతో ప్రయోగాలు చేశారు. ఈ సంస్థ ఐదుగురు మహిళల నుండి 21 మందికి పెరిగింది. దాంతో 2021లో ‘ది మాక్రమే డెకార్ క్రాఫ్ట్ లిమిటెడ్’ను రిజిస్టర్ చేశారు. ప్రాథమిక అంశాలను నేర్చుకోవడానికి NSRCEL, అన్‌లిమిటెడ్ వంటి స్టార్టప్ ఇంక్యుబేటర్‌లలో చేరారు. కొత్త ఉత్పత్తులను రూపొందించడానికి కూడా ప్రయత్నించారు. అలాగే తమ శిక్షణా వ్యవస్థలను, కమ్యూనిటీ నెట్‌వర్క్‌లను బలోపేతం చేసుకున్నారు. ఒక బేబీ క్విల్ట్‌ను డిజైన్ చేస్తున్నప్పుడు, సునీత దానికి అనుబంధంగా మరో ఉత్పత్తి కోసం వెతుకుతోంది. ఒకప్పుడు పాత గుడ్డలతో అమ్మమ్మలు చేతితో కుట్టిన బొమ్మల స్ఫూర్తితో ఆమె ఒక గుడ్డ బొమ్మను సృష్టించింది. అయితే ఆ క్విల్ట్‌కు కొనుగోలుదారులు దొరకలేదు. కానీ ఆ బొమ్మ మాత్రం మంచి ప్రాచుర్యం పొందింది. ‘ఒక నెలలోపే ప్రజలు దాన్ని ‘ఇండియన్ బార్బీ’ అని పిలవడం మొదలుపెట్టారు. దాంతో మేము చేస్తున్న అన్ని ఇతర పనులను ఆపేసి పూర్తిగా ఆ బొమ్మపైనే దృష్టి పెట్టాము’ అని ఆమె అన్నారు.
‘నీలా’ పుట్టింది ఇలా…
2023 మధ్య నాటికి వారి భారతీయ బొమ్మలకు డిమాండ్ పెరిగింది. ఆ సంస్థ 21 మంది మహిళా కళాకారుల నుండి 55 మందికి విస్తరించింది. కానీ ఏదో లోటు కనిపించింది. ఏడాదిన్నరగా ఆ సంస్థ కేవలం సుస్థిరత, జీవనోపాధుల చుట్టూనే తిరిగింది. పిల్లల కోసం ఏమీ చేయలేకపోయింది. ‘మేము అనుకోకుండా బొమ్మల వ్యాపారంలోకి వచ్చాం. బొమ్మల పరిశ్రమలో భారతీయ ప్రాతినిధ్యం లేకపోవడం అనే లోటును పూరించడానికి ఏదైనా చేయాలని మాకు అర్థమైంది. ఆ విధంగానే మేము మొదటి బొమ్మను రూపొందించాం’ అని సునీత అన్నారు. ప్రతి 12 ఏండ్లకు ఒకసారి నీలకురింజి పువ్వులు వికసించినప్పుడు నీలి రంగులోకి మారే అందమైన నీలి పర్వతాల పేరు మీదుగా ఈ బొమ్మకు పేరు పెట్టారు. పూలు వికసించే ఏడాదిలో పుట్టిన బిడ్డగా ‘నీలా’ను ఊహించారు.
మహిళలపై ప్రభావం
ది గుడ్ డాల్‌లో చేరే చాలా మంది మహిళలకు ఇదే వారి మొదటి ఉద్యోగం. నాణ్యత విషయంలో రాజీపడని సునీత ఆధ్వర్యంలో ప్రతి కళాకారిణి రెండు నెలల పాటు తీవ్రమైన శిక్షణ పొందుతుంది. ‘కొంతమంది మహిళలు 15 ఏండ్ల కుట్టుపని అనుభవంతో వస్తారు. కానీ ఒక సూటి గీత కూడా కుట్టలేరు. మొదటి రెండు వారాలు, వాళ్ళు అదే నేర్చుకుంటారు. అది వారికి నిరాశ కలిగిస్తుంది. కానీ చివరికి అది వారికి అలవాటుగా మారిపోతుంది. వారిలో ఆత్మవిశ్వాసం పెరిగేకొద్దీ చాలామంది ఉత్పత్తి దశను దాటి నాయకత్వ పాత్రలలోకి అడుగుపెడుతున్నారు. ప్రస్తుతం వారిలో చాలామంది శిక్షకులుగా, పర్యవేక్షకులుగా, నాణ్యతా నియంత్రణ నిపుణులుగా, సమన్వయకర్తలుగా పనిచేస్తున్నారు. మహిళలు చాలా వరకు తమ కుటుంబ ఆదాయానికి గణనీయంగా తోడ్పడుతున్నారు. కొందరు తమ భర్తల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారు. ఈ అదనపు ఆదాయంతో మహిళలు స్కూటర్లు కొనడానికి, ఇళ్లు కట్టుకోవడానికి, తమ పిల్లలకు మంచి విద్యను అందించడానికి, కుటుంబాల పోషణను మెరుగుపరచుకోవడానికి వీలు కలిగింది’ అంటూ సునీత తన మాటలు ముగించారు.
ఏదో మార్పు
‘రుచికరమైన భోజనం వండటం, తినడమంటే నాకు చాలా ఇష్టం. లేత పనసకాయలు తెచ్చుకుని పనస బిర్యానీ చేసుకునేవాళ్ళం. కానీ కొంతకాలానికి మేము మంచి భోజనాన్ని ఆస్వాదించడం మానేశాం. ఎందుకంటే మా చుట్టూ ఉన్న కుటుంబాలు మాకున్నంత సౌభాగ్యాన్ని అనుభవించకపోవడం చూశాం. అందుకే వారిలానే బట్టలు వేసుకోవడం, ఒకేలాంటి ఆహారం తినడం ప్రారంభించాం. ఇది మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది’ అని ఆమె వివరించారు.
– సలీమా



