వాన పడినప్పుడో, జలుబు ఇబ్బంది పెడుతున్నప్పుడో.. వేడి వేడి సూపు గొంతులోకి దిగుతుంటే వచ్చే ఆ హాయిని వర్ణించగలమా! సాధారణంగా హోటల్స్‌లో భోజనానికి ముందు సూప్ ఇస్తుంటారు. ఎందుకంటే ఇది జీర్ణశక్తి చాలా మంచిది. అలాగే ప్రతిరోజూ ఉదయదం టీ, కాఫీలకు బదులు సూప్ తాగటం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరి రొటీన్‌గా కాకుండా.. వెరైటీ సూప్‌లు ఏం ఉన్నాయో తెలుసుకొని రుచి చూద్దామనుకుంటున్నారా? అయితే ఇవి మీ కోసమే…
క్యాలీఫ్లవర్‌తో
కావల్సిన పదార్థాలు: క్యాలీఫ్లవర్ – కప్పు, ఉల్లి తరుగు – పావు కప్పు, మిరియాల పొడి – ముప్పావు స్పూన్, తురిమిన అల్లం – అర స్పూన్, కచ్చాపచ్చా దంచిన వెల్లుల్లి – స్పూన్, ఉప్పు – తగినంత, వెన్న – ఒకటిన్నర స్పూన్లు, ఆలివ్ నూనె – టేబుల్ స్పూన్ చొప్పున తీసుకోవాలి.
తయారు చేయాల్సిన విధానం: క్యాలీఫ్లవర్‌ను చిన్న పువ్వులుగా విడగొట్టి.. ఉప్పు నీళ్లలో తెర్లించి.. ఆ నీళ్లు వార్చేయాలి. ప్యాన్‌లో నూనె వేసి.. ఉల్లి తరుగును లేత బంగారు రంగు వచ్చే వరకూ వేయించాలి. అందులో అల్లం, వెల్లుల్లి, క్యాలీఫ్లవర్ ముక్కలు, ఉప్పు చేర్చి కలియతిప్పి.. సన్న సెగమీదుంచాలి. ఉడికిందనుకున్నాక దించేయాలి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేయాలి. కడాయిలో వెన్న వేడిచేసి మిరియాల పొడి వేసి.. వెంటనే గ్రైండ్ చేసిన క్యాలీఫ్లవర్ మిశ్రమం, రెండు కప్పుల నీళ్లు జోడించాలి. మూడు నిమిషాలు మరిగించి సెగ తీసేస్తే ఘుమఘుమలాడే ‘క్యాలీఫ్లవర్ సూప్’ రెడీ.
వెజ్‌టేబుల్స్ తో
కావల్సిన పదార్థాలు: ఉల్లి, టొమాటో, క్యారెట్ – ఒక్కొకటి, బీన్స్ – ఆరు, గుమ్మడి, బ్రోకలీ – అర కప్పు చొప్పున, బఠాణీలు – రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు – రుచికి తగినంత, వెల్లుల్లి – మూడు రెబ్బలు, మిరియాల పొడి – అర స్పూన్, నూనె – స్పూన్, కొత్తిమీర – గుప్పెడు.
తయారు చేసే విధానం: కూరగాయలన్నింటినీ సన్నగా తరగాలి. అడుగుభాగం మందంగా ఉన్న పాత్రలో నూనె వేడి చేసి ఉల్లి, వెల్లుల్లి వేయాలి. అవి కాస్త వేగాక.. అన్ని కూరగాయ ముక్కలూ, ఉప్పు జతచేసి కలియతిప్పుతూ రెండు నిమిషాలు వేయించాలి. అందులో మూడు కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి ముక్కలు మెత్తబడే వరకూ ఉడికించి, దించేయాలి. చల్లారాక పప్పుగుత్తితో మెదపాలి. ఈ మిశ్రమానికి మిరియాల పొడి చేర్చి మళ్లీ వేడిచేయాలి. చివర్లో కొత్తిమీర జోడించి సెగ తీసేయాలి.
క్యారెట్‌తో…
కావల్సిన పదార్థాలు: క్యారెట్లు – అర కిలో, అల్లం – రెండు అంగుళాల ముక్క, ఉల్లిగడ్డ – ఒకటి, వెల్లుల్లి – నాలుగు రెబ్బలు, నీళ్లు – ముప్పావు లీటర్, మిరియాలు, జీలకర్ర పొడులు – అర స్పూన్ చొప్పున, ఉప్పు – రుచికి సరిపడా, నిమ్మరసం – టేబుల్ స్పూన్, కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు
తయారు చేసే విధానం: క్యారెట్లను పీల్ చేసి చిన్న ముక్కలుగా కోయాలి. ఉల్లిగడ్డను సన్నగా తరగాలి. అల్లాన్ని కచ్చాపచ్చాగా దంచాలి. మందపాటి పాత్రలో క్యారెట్, ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, ముప్పావు లీటర్ నీళ్లు జతచేసి.. ఉడికించాలి. సుమారు ఇరవై నిమిషాలకు ముక్కలు మెత్తబడిన తర్వాత సెగ తీసేయాలి. చల్లారాక.. మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ మిశ్రమాన్ని మళ్లీ గిన్నెలోకి తీసి.. ఉప్పు, మిరియాలు, జీలకర్ర పొడులు, ఇంకొన్ని నీళ్లు చేర్చి.. ఐదు నిమిషాలు మరిగించి.. నిమ్మరసం, కొత్తిమీర జోడించి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే.. జీరో ఆయిల్ క్యారెట్ జింజర్ సూప్ రెడీ. క్యారెట్‌తో పాటు టొమాటో కూడా చేరిస్తే మరింత రుచి, ఫ్లేవర్ వస్తాయి. వడ్డించే ముందు చిటికెడు మిరియాల పొడి చల్లితే చాలా బాగుంటుంది. అభిరుచిని బట్టి అల్లం పరిమాణాన్ని ఇంకాస్త పెంచవచ్చు. జలుబు చేసినప్పుడు ఈ సూప్ సేవిస్తే.. ఉపశమనంగా ఉంటుంది. జీరో ఆయిల్ సూప్ తేలికగా జీర్ణమవుతుంది, తక్కువ క్యాలరీలతో ఆరోగ్యకరమైంది.
మునక్కాడలతో..
కావల్సిన పదార్థాలు: చిన్నగా తరిగిన మునక్కాడలు – ఆరు నుంచి ఎనిమిది వరకు, తరిగిన అల్లంవెల్లులి, పచ్చిమిర్చి- చెంచా, పసుపు, మిరియాలపొడి- చిటికెడు, ఉప్పు, నీళ్లు, నూనె- సరిపడా.
తయారు చేసే విధానం: మునక్కా డలను కుక్కర్‌లో వేసి మూడు విజిల్స్ వచ్చేం త వరకు ఉడికించాలి. తర్వాత బయటికి తీసి మిక్సీ పట్టి ఆ మిశ్రమాన్ని పక్కకుపెట్టుకోవాలి. ఒక కడాయిలో నూనె పోసి వేడయ్యాక అల్లంవెల్లులి, పచ్చిమిర్చి, పసుపు వేసి కలపాలి. కాసేపయ్యాక మిక్సీ పట్టిన మునక్కాడ మిశ్రమం వేసి మొత్తం కలిసేలా కలపాలి. రెండు నిమిషాల తర్వాత కొద్దిగా నీళ్లు, ఉప్పు, మిరియాలపొడి వేసి కలిపి ఐదు నిమిషాలు మరగనివ్వాలి.
పాలకూరతో..
కావల్సిన పదార్థాలు: పాలకూర కట్ట- ఒకటి (చిన్నగా తరగాలి), ఉల్లిగడ్డ, అల్లంముక్క- చిన్నది, వెల్లుల్లిరెబ్బలు- రెండు, నూనె, నీళ్లు, ఉప్పు- తగినంత, మిరియాల పొడి, కార్న్‌ఫ్లోర్, నిమ్మరసం – చెంచా, పాలు – రెండు చెంచాలు.
తయారు చేసే విధానం: ఒక కడాయిలో నూనె పోసి వేడయ్యాక అల్లం, పచ్చిమిర్చి, పాలకూరను వేసి ఐదు నిమిషాలపాటు ఉడకనివ్వాలి. పాలకూర ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవాలి. చల్లారాక ఆకుకూర మిశ్రమం, ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం, నీళ్లు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఒక చిన్న బౌల్‌లో కార్న్‌ఫ్లోర్‌లో పాలు పోసి ఉండలు లేకుండా కలపాలి. మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకుని కార్న్‌ఫ్లోర్ మిశ్రమాన్ని క్రీమీలా గార్నిష్ చేసుకుంటే సరి. ఎంతో హెల్దీ అయిన పాలక్ సూప్ రెడీ! పాలకూర బదులు బచ్చలికూర, ఇంకా ఏదైనా ఆకుకూరతో కూడా ఇలా సూప్ చేసుకోవచ్చు.



