Friday, July 24, 2026
E-PAPER
Homeజాతీయంస్తంభించిన పార్ల‌మెంట్‌

స్తంభించిన పార్ల‌మెంట్‌

- Advertisement -

కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాలి
ఉభ‌య స‌భ‌ల్లో ప్ర‌తిప‌క్షాల ఆందోళ‌న‌
వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాల హోరు
విద్యార్థులు ఒంటరివారు కాదు.. మేం వాళ్లతో ఉన్నాం:గాంధీ స్మృతికేంద్రం వద్ద నివాళులర్పించిన ఇండి కూటమి నేతలు

నవతెలంగాణ -న్యూఢిల్లీ బ్యూరో
దేశంలో కుప్ప‌కూలిన విద్యా వ్య‌వ‌స్థ‌కు బాధ్య‌త వ‌హిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాల‌ని ప్ర‌తిప‌క్షాల ఆందోళ‌న‌తో పార్ల‌మెంట్ స్తంభించింది. గురువారం కూడా లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొంది. దీంతో ఉభ‌య‌ స‌భలు వాయిదాల ప‌ర్వం తొక్కాయి. లోక్‌స‌భ‌ను స్పీక‌ర్ ఓం బిర్లా ప్రారంభిస్తూ ప్ర‌శ్నోత్త‌రాలు నిర్వ‌హించేందుకు సిద్ధ‌ప‌డ్డారు. అయితే కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాకు డిమాండ్ చేస్తూ ప్ర‌తిప‌క్ష ఎంపిలు వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళ‌న చేప‌ట్టారు. ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాల హోరెత్తించారు. దీంతో స‌భ‌ను రెండు నిమిషాల్లోనే మ‌ధ్యాహ్నం 12 వ‌ర‌కు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభ‌మైన స‌భ‌లో ప్ర‌తిప‌క్షాలు ఆందోళ‌న‌ను కొన‌సాగించాయి. దీంతో స‌భ‌ను తొమ్మిది నిమిషాల్లోనే మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌కు ప్యానెల్ స్పీక‌ర్ దిలీప్ సైకియా వాయిదా వేశారు. తిరిగి ప్రారంభ‌మైన స‌భ‌లో అదే ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో స‌భ‌ను మూడు నిమిషాల్లో ప్యానెల్ స్పీక‌ర్ సైకియా నేటీకి వాయిదా వేశారు. పేపర్ లీక్ జరిగినట్టు ప్రభుత్వం అంగీకరిస్తే వెంటనే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఎస్‌పి అధ్య‌క్షుడు అఖిలేశ్ యాదవ్ డిమాండ్ చేశారు.

రాజ్య‌స‌భ‌లో కూడా ప్ర‌తిప‌క్షాలు విద్యార్థుల‌పై అణచివేత, లాఠీచార్జ్ అంశంపై చ‌ర్చించాల‌ని ప‌ట్టుప‌ట్టాయి. కానీ చైర్మె న్ సిపి రాధాకృష్ణ‌న్ అందుకు అంగీక‌రించ‌లేదు. గంద‌ర‌గోళ‌ నేప‌థ్యంలో స‌భ‌ను ఏడు నిమిషాల్లోనే మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు వ‌ర‌కు వాయిదా వేశారు. అనంత‌రం ప్రారంభ‌మైన స‌భ‌లోనూ ప్ర‌తిప‌క్షాలు ఆందోళ‌న కొన‌సాగించాయి. దీంతో స‌భ‌ను రెండు నిమిషాల్లోనే మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌కు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభ‌మైన స‌భ‌లో ప్ర‌తిప‌క్షాల ఆందోళ‌న‌తో 39 సెకెన్ల‌లోనే స‌భ‌ను డిప్యూటీ చైర్మె న్ హరివంశ్ నారాయ‌ణ్ సింగ్ మ‌ధ్యాహ్నం మూడు గంట‌ల‌కు వాయిదా వేశారు అనంత‌రం ప్రారంభ‌మైన స‌భ‌లో రూల్ 267 కింద చర్చ చేపట్టాలని కోరుతుంటే ప్రభుత్వం అంగీకరించట్లేదని ప్ర‌తిప‌క్ష నేత‌ మల్లికార్జున్ ఖర్గే అన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కేంద్రం అవమానించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తరువాతే తాము ఏ చర్చకైనా సిద్ధమని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల తీరుపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. నీట్‌పై చర్చ నుంచి తప్పించుకోవాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని ఆరోపించారు. చర్చ ముందు షరతులు పెట్టడం భావ్యం కాదని అన్నారు. ఈ అంశంపై తన వాదన వినిపించే హక్కు ప్రభుత్వానికి కూడా ఉంటుందని అన్నారు. అధికార‌, ప్ర‌తిప‌క్షాల నిర‌స‌న‌ల మ‌ధ్య స‌భ‌ను ఒక్క నిమిషంలోనే నేటీకి వాయిదా వేశారు.

ప్ర‌ధాని మోడీకి కౌంట‌ర్‌
అయితే ప్రధాని మోడీ ట్వీట్‌పై లోకసభ ప్ర‌తిపక్ష నేత సీజేపీ గట్టి కౌంటర్‌ ఇచ్చాయి. విద్యార్థుల జీవితాలను దెబ్బ తీసింది కేంద్రంలోని బిజెపి ప్రభుత్వమేనని ఆరోపించాయి. ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్‌పై రాహుల్‌ గాంధీ ఘాటుగా స్పందించారు. విద్యార్థుల జీవితాలను నాశనం చేసిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ విద్యార్థులకు క్షమాపణలు చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నేరానికి పాల్పడిన దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ ట్వీట్‌ చేశారు. మరోవైపు సీజేపీ కూడా మోడీ ప్రకటనపై దీటుగా స్పందించింది. మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతక బాధ్యత వహిస్తూ రాజీనామ చేయాలని పేర్కొంది. విద్యార్థులపై విచక్షణారహితంగా దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. తమ డిమాండ్స్‌ నెరవేర్చే వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.

పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణంలో ప్ర‌తిప‌క్షాలు ఆందోళ‌న‌
విద్యార్థులపై పోలీసుల క్రూర‌త్వానికి వ్య‌తిరేకంగా ప్ర‌తిపక్షాలు ఆందోళ‌న చేప‌ట్టాయి. గురువారం పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణంలో మకర ద్వారం ఎదురుగా ప్ర‌తిప‌క్ష ఎంపిలు ఆందోళ‌న చేప‌ట్టారు. ప్లకార్డులు చేబూని ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేప‌ట్టారు. ఈ ఆందోళ‌న‌లో కాంగ్రెస్ పార్లమెంట‌రీ పార్టీ నాయ‌కురాలు సోనియా గాంధీ, ప్ర‌తిప‌క్ష‌నేత‌లు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, రాహుల్ గాంధీ, ఎస్‌పీ అధినేత అఖిలేశ్ యాద‌వ్‌, ఎస్‌పి ఎంపి రాంగోపాల్ యాద‌వ్‌, సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్, సీపీఐ ఎంపీ సంతోష్ కుమార్‌, ఎన్‌సీపీ ఎంపీ సుప్రియా సూలే, జేఎంఎం ఎంపీ మ‌హువా మాంఝీ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప్రియాంక గాంధీ మాట్లాడుతూ దేశ యువత ఏ విజయం సాధించినా తన ఖాతాలో వేసుకునే ప్రధాని.. విద్యార్థులపై దాడులకు కూడా బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. గురువారం పార్లమెంట్‌ ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థులను తాను ఎంతో ప్రేమగా చూసుకుంటానని సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెట్టే ప్రధాని మోడీ వారిపై బాష్పవాయువు ప్రయోగించి లాఠీచార్జీ చేయించారని విమర్శించారు. వాళ్లు ఉగ్రవాదులు కాదని, ఆందోళన చేస్తున్న వారిపై బాష్పవాయువు ప్రయోగించారని, ఇష్టమొచ్చినట్లుగా లాఠీలతో కొట్టారని ప్రియాంకా మండిప‌డ్డారు. ఇదేం ప్రజాస్వామ్యం..? అని ప్ర‌శ్నించారు. క్రీడల్లో పతకాలు సాధిస్తే తనవల్లే వచ్చిందంటూ మోదీ ఆ క్రెడిట్‌ను తన ఖాతాలో వేసుకుంటారని, శాస్త్ర‌వేత్త‌లు అంగారకుడిపైకి వెళ్లినా, రాకెట్లు ప్రయోగించినా వాటిని తన ఖాతాలోనే వేసుకుంటారని ఆరోపించారు. ప్ర‌ధాని మోడీ హ‌యాంలో దాదాపు 152 పేపర్‌ లీకేజీలు జరిగాయని, వాటికి బాధ్యులెవరు..? అని ప్ర‌శ్నించారు. విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు ఒక నూతన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.

విద్యార్థులు ఒంటరివారు కాదు మేం వాళ్లతో ఉన్నాం
నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా విపక్షాలు వ్యూహరచన చేస్తున్నాయి. ఈ మేరకు దిల్లీలోని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నివాసంలో ఇండి కూటమి ఎంపీలు సమావేశమయ్యారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై రాహుల్‌ దిశానిర్దేశం చేశారు. అనంతరం నేతలంతా గాంధీ స్మృతి కేంద్రం వద్దకు చేరుకొని కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. నీట్‌ పేపర్‌ లీక్‌ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు నివాళులు అర్పించారు. అంతకుముందు కాంగ్రెస్ నేతలు ప్రయాణిస్తున్న బస్సును మార్గమధ్యలోనే పోలీసులు ఆపివేశారు. ఈ సమయంలో మాట్లాడిన రాహుల్‌ గాంధీ, నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వల్ల ఆత్మహత్య చేసుకున్న వారికి నివాళులు అర్పించేందుకు గాంధీ స్మృతివనం వద్దకు వెళ్లాలని నిర్ణయించామని చెప్పారు. మొదట ఇండియా గేట్‌ వద్దకు వెళ్లాలని భావిస్తే పోలీసులు అనుమతి నిరాకరించారని తెలిపారు. విద్యార్థులు ఒంటరివారు కాదన్న రాహుల్ వారితో తామంతా ఉన్నామని పేర్కొ న్నారు. విద్యార్థుల డిమాండ్లకు ఇండి కూటమి సంపూర్ణ మద్దతు ఉందని ప్రకటిం చారు. మరోవైపు ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు రాహుల్‌ గాంధీ నివాసం చుట్టుపక్కల బందోబస్తు పెంచారు. మంగళవారం ప్రధాని మోదీ నివాసం వద్ద మెరుపు ధర్నాను దృష్టిలో పెట్టుకొని పోలీసులు భద్రతను పెంచినట్టు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -