ఢిల్లీలో ఎన్ఎస్ఏ అమలుకు నిర్ణయం
ఏడాది పాటు నిరసనకారుల నిర్బంధానికి పోలీసులకు అధికారం
గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన లెఫ్టినెంట్ గవర్నర్
జంతర్ మంతర్‌కు భారీగా తరలివచ్చిన విద్యార్థులు, యువత
నేడు దేశవ్యాప్త ఆందోళనలకు సీజేపీ పిలుపు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
నీట్ పేపర్ లీక్, సీబీఎస్‌ఈలో అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన ఆందోళనపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్రం సిద్ధమైంది. దేశ రక్షణగా మారిన యువత, విద్యార్థుల నిరసనలను అణచివేసేందుకు ఢిల్లీలో జాతీయ భద్రతా చట్టం(ఎన్‌ఎస్‌ఏ)ను అమలు చేయనుంది. దీని ద్వారా ప్రజలను నిర్దిష్ట కాలం(మూడు నెలలు) పాటు, నిరససనకారులను ఎటువంటి విచారణ లేకుండా ఏడాది పాటు నిర్బంధించేందుకు ఢిల్లీ (మొదటిపేజీ తరువాయి)పోలీసులకు ప్రత్యేక అధికారాన్ని కల్పించింది. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ను లెఫ్టినెంట్ గవర్నర్ గురువారం విడుదల చేశారు. దీంతో ఢిల్లీలో నిరసనలో పాల్గొన్న వారితో పాటు, నిరసనల అనంతరం తిరిగి వస్తున్న వారిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం ప్రారంభించారు. అయితే ఇది ఒక సాధారణ చర్య మాత్రమేనని పోలీసులు తెలిపారు. అణచివేతకు ముమ్మరమైన చర్యలుఢిల్లీలో కొనసాగుతున్న నిరసనలను అణచివేసేందుకు ప్రయత్నాలు జోరందుకున్నాయి. ఇప్పటికే సెంట్రల్ ఢిల్లీలో నిలిపివేసిన ఇంటర్నెట్ సేవలు ఇంకా పునరుద్ధరించలేదు. వరుసగా రెండో రోజూ 16 మెట్రో స్టేషన్లను మూసివేశారు.
అంతేకాక ఢిల్లీలోని ఓ ముఖ్యమైన వాణిజ్య కేంద్రమైన కన్నాట్ ప్లేస్‌లో దుకాణాలను మూసివేయాలని కేంద్రం నిర్ణయించింది. గురువారం ఉదయం 6.30 గంటల నుంచే దుకాణాలను మూసి ఉంచాలని బీజేపీ పాలిత మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశించింది. జనపథ్‌లోని చాలా దుకాణాలు అప్పటికే మూతపడ్డాయి. సాయంత్రం 4 గంటల నుంచి ఆ ప్రాంతంలో ఆంక్షలు విధించారు. జంతర్ మంతర్ నుంచి 1.5 కిలోమీటర్ల వరకూ మొబైల్, ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. అర్ధరాత్రి 12 గంటల వరకు ఆ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు.అదే విధంగా నగరంలోని అన్ని ప్రధాన రహదారులపై భారీ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దేశ రాజధానిలో బారికేడ్లు, భద్రతా సిబ్బందితో నిండిపోయాయి. మరోపక్క జంతర్‌మంతర్ వద్ద ఆందోళన ప్రదేశంలో విద్యార్థులు, యువ నిరసనకారులకు మద్దతు పెరుగుతోంది. ఒక్కసారిగా పదివేల మందికి పైగా యువత , విద్యార్థులు అక్కడికి తరలిరావడంతో కేంద్ర ఎత్తుగడలన్నీ తలకిందులవుతున్నాయి. రైతుల సమ్మె సమయంలోనూ ప్రభుత్వం ఇలాంటి ఎత్తుగడలకే ప్రయత్నించింది. సీజేపీపై ఎన్ఐఏ విచారణకు సంఘ్‌పరివార్ పిటిషన్‌సీజేపీ చేపట్టిన నిరసనపై ఎన్‌ఐఏ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ సంఘ్ పరివార్ మద్దతుదారులు ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ అత్యంత అనుమానాస్పదంగా ఉందని ఈ సందర్భంగా సీజేపీ పేర్కొంది. ‘‘ఈ ప్రభుత్వ చేతుల్లో ఆయుధాలుగా మారడానికి న్యాయస్థానాలు అనుమతించవద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.
యువతరం మొత్తం వారి వైపే చూస్తోంది. సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యంపై దాఖలైన ఒక సాధారణ పిటిషన్ కేసులో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుతో ప్రభుత్వం ఆయనను బలవంతంగా ఆస్పత్రిలో చేర్చి నిర్బంధించేందుకు ఉపయోగించుకుంది. అది నిరసనను మరింతగా రెచ్చగొట్టింది. నిరసనకారులతో చర్చలు జరపడానికి బదులుగా, ప్రభుత్వం ఈ పిటిషన్‌ను, న్యాయస్థానాన్ని ఉపయోగించి నిరసనకారులను, విద్యార్థులను, యువతరాన్ని రాక్షసులుగా చిత్రీకరిస్తోంది. అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇటువంటి దుర్మార్గపు, కుటిలమైన కుట్రలో న్యాయస్థానాన్ని భాగస్వామిగా చేయకూడదు. సంస్థలపై విశ్వాసం ముఖ్యం. వాటిని ఏ విధంగానూ రాజకీయీకరించవద్దు. ఆయుధాలుగా వాడుకోవద్దు’’ అని కోరింది.చర్చలు తటస్థ వేదిక వద్ద జరగాలిసీజేపీ ఆందోళన ఉధృతం కావడంతో ప్రభుత్వం నిరసనకారులను చర్చల కోసం కేంద్ర మంత్రి జెపి నడ్డా కార్యాలయానికి ఆహ్వానించింది. అయితే, తటస్థ వేదిక వద్దకు ఆహ్వానిస్తే మాత్రమే చర్చల్లో పాల్గొంటామని చెబుతూ సీజేపీ ఆ ఆహ్వానాన్ని తిరస్కరించింది. మరోపక్క సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన దీక్ష 26వ రోజుకు చేరుకుంది. అదే విధంగా సీజేపీ చేపట్టిన ఆందోళన 34వ రోజూ కొనసాగింది. మహిళా సంఘాలు, సీఐటీయూ నాయకులు వీరి నిరసనకు తమ మద్దతును తెలియజేయడానికి జంతర్ మంతర్‌కు చేరుకున్నారు.
జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబుబా ముఫ్తీ, బాలీవుడ్ నటి హుమా ఖురేషీ సంఘీభావం తెలిపారు. సినీ నటులు ఆలియా భట్, షారుక్ ఖాన్, మాధవన్, కరీనా కఫూర్, ఈషా రెబ్బ, క్రికెటర్లు శిఖర్‌దావన్, యువరాజ్ సింగ్, ఒలింపిక్ స్వర్ణ విజేత అభినవ్ బింద్రా సోషల్ మీడియా వేదికగా ఆందోళనకు మద్దతు ప్రకటించారు. ఢిల్లీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే మహారాష్ట్రలోని అహిల్యానగర్‌లో రెండు గంటల పాటు మౌన దీక్ష చేపట్టారు. నీట్ పేపర్ లీక్ తరువాత ప్రాణాలు కోల్పోయిన విద్యార్థులను ప్రతిపక్ష నేతలు స్మరించుకుని నివాళి అర్పించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి : అభిజీత్ దీప్కే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించాలని ప్రధాని మోడీని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే గురువారం మరోసారి కోరారు. కేంద్రం స్పందించని పక్షంలో ఈ రాజీనామాల పర్వం ప్రధాని మోడీ వరకూ చేరుతుందని వ్యాఖ్యానించారు.
ఢిల్లీలో మెట్రో స్టేషన్ల మూసివేత.. జోక్యం చేసుకోవాల్సి వస్తుందన్న సుప్రీంకోర్టుఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లను మూసివేయడంపై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలతో పాటు సుప్రీంకోర్టుకు వచ్చే న్యాయవాదులు, వ్యాజ్యదారులు, కోర్టు సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మధ్యాహ్నంలోగా పరిస్థితి సరిదిద్దకపోతే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సుప్రీంకోర్టు న్యాయవాదులు నిరసన ర్యాలీనీట్ పేపర్ లీక్ అక్రమాలపై సీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉద్యమానికి మద్దతుగా సుప్రీంకోర్టు న్యాయవాదులు నిరసన ర్యాలీ చేపట్టారు. “ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, రాజ్యాంగాన్ని కాపాడండి” అనే నినాదంతో సుప్రీం కోర్టు ఆవరణలో రాజ్యాంగ పీఠిక పఠనం చేశారు. విద్యార్థుల ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒరిస్సా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎస్.మురళీధర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వికాస్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
బెదిరింపుల పర్వం
కేంద్రం నియంత్రణలో ఉన్న ఢిల్లీ పోలీసులు, ఇతర రాష్ట్రాల బలగాలు నిరసనలో పాల్గొంటున్న విద్యార్థులను బెదిరింపులకు గురిచేస్తున్నాయి. నిరసనను అణచివేయడానికి భద్రతా బలగాలతో పాటు సంఘ్ పరివార్ గూండాలూ చేతులు కలిపారు. నిరసనకారులపై పోలీసులు లాఠీలను ఝళిపిస్తున్నారు. నిరసనకారుల వలే వెళ్లి వారి మధ్యలో చొరబడి సమస్యలు సృష్టించడానికి సంఘ్ పరివార్ కూడా ప్రయత్నించింది. నిరసనకారులే వాహనాలను ధ్వంసం చేసినట్లు కనిపించేలా చేసేందుకు పోలీసులే నిరసన ప్రదేశమైన జంతర్ మంతర్ సమీపంలోకి ఒక పాడుబడిన కారును తీసుకువచ్చారు. నిరసనకారులకు తెలియకుండా వారి చిత్రాలను తీయడానికి ఢిల్లీ పోలీసులు మెటా గ్లాసెస్‌ను సైతం ఉపయోగించారు. నిరసనలో పాల్గొన్న వారి పాస్‌పోర్ట్‌లను రద్దు చేయడానికి కూడా చర్యలు ప్రారంభించారు. అలాగే ముంబయిలో జరిగిన ఆందోళనలో విద్యార్థులు, యువతపై ఏకంగా డ్రగ్స్ కేసు పెడతామని పోలీసులు బెదిరించారు.
నేడు దేశవ్యాప్త ఆందోళనలకు సీజేపీ పిలుపు
నీట్ పేపర్ లీక్‌కు కేంద్రం బాధ్యత వహించాలంటూ ఉద్యమిస్తున్న సీజేపీ, విద్యార్థి సంఘాలు నేడు దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చాయి. ఇటీవల జంతర్‌మంతర్-పార్లమెంటు ర్యాలీ సందర్భంగా యువతపై పోలీసుల కర్కశత్వాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిరసన కార్యక్రమానికి కావాల్సిన అనుమతులు పొందేందుకు, ఏర్పాట్లు చేసేందుకు విద్యార్థి సంఘాలు, యూత్ ఆర్గనైజేషన్లు కలిసి పనిచేయాలని సీజేపీ సూచించింది.



