Friday, July 24, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుహైడ్రాపై హైకోర్టు ఆగ్రహం

హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం

- Advertisement -

వివాదాస్పద భూమి రక్షణకు ఆర్మీ
ఏజీ హామీతో
 సైన్యం మోహరింపు ఉత్తర్వుల జారీ నిలిపివేత

నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
కోర్టు ఉత్తర్వులను పదేపదే ఉల్లంఘిస్తూ వివాదాస్పద ప్రయివేటు భూమిలో హైడ్రా అధికారులు జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలపై హైకోర్టు గురువారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా లోతుకుంట గ్రామంలోని సర్వే నంబర్లు 1, 2లోని 40 ఎకరాల భూమికి సంబంధించిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్‌ అనిల్‌కుమార్‌ జుకంటి దేశంలోనే తొలిసారిగా ఒక ప్రయివేటు ఆస్తి రక్షణ కోసం సైన్యాన్ని మోహరించే దిశగా అసాధారణ ఆదేశాలు జారీ చేశారు. బైసన్‌ డివిజన్‌కు చెందిన సీనియర్‌ బ్రిగేడియర్‌ను సంప్రదించి పది మంది సైనికుల జాబితా సిద్ధం చేయాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ను ఆదేశించారు. వివాదాస్పద స్థలం వద్ద ఆర్మీ సిబ్బందిని మోహరించాలనీ, హైడ్రా అధికారులు సహా ఎవరైనా అక్కడికి వస్తే వారిని అదుపులోకి తీసుకుని ఆర్మీ బ్యారక్స్‌కు తరలించాలనీ, అవసరమైతే వారి వాహనాలను కూడా స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు ఇవ్వగలమని స్పష్టం చేశారు. ఇలాంటి వ్యవహారాల్లో సైన్యాన్ని జోక్యం చేసుకోవడం సరైంది కాదని తమకు తెలుసనీ, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, దాని యంత్రాంగంపై పూర్తిగా విశ్వాసం కోల్పోవడంతో న్యాయపాలనను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కోర్టు వ్యాఖ్యానించింది. “సచివాలయంలో కూర్చున్న వారికీ రాష్ట్రంలో ఏమి జరుగుతోందో తెలియాలి” అని కూడా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

శాంతా శ్రీరామ్‌ కన్స్ట్రక్షన్స్‌ప్రయివేట్‌ లిమిటెడ్‌ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణలో పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎం. హరీశ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ, గత విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్‌ ఎ.వి. రంగనాథ్‌ వివాదాస్పద స్థలంలోకి వెళ్లబోమని కోర్టుకు హామీ ఇచ్చినా, జూలై 21న కేసు వాయిదా పడిన వెంటనే పునరుద్ధరణ పనులను అడ్డుకునేందుకు హైడ్రా అధికారులు, పోలీసులు అక్కడికి వెళ్లారని తెలిపారు. కోర్టు ఉత్తర్వులు చూపించినా పట్టించుకోకుండా పనులను నిలిపివేయాలని ఆదేశించారని, హైడ్రా వాహనాలు స్థలంలో ఉన్న ఫొటోలను కూడా కోర్టుకు సమర్పించారు. అదనపు అడ్వకేట్‌ జనరల్‌ మహమ్మద్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ మాత్రం హైడ్రా అధికారులు స్థలంలోకి వెళ్లలేదని వాదించగా, ఫొటోలను పరిశీలించిన న్యాయమూర్తి “ఈ చిత్రాలు చూస్తే కూడా పరిస్థితి అర్థం కావడంలేదా?” అని ప్రశ్నించారు. ఇప్పటికే ఇది మూడో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ అని గుర్తుచేస్తూ, ఎన్ని ఆదేశాలు ఇచ్చినా అధికారులు మారడం లేదని, రెండు రోజుల క్రితమే అడ్వకేట్‌ జనరల్‌ హామీతో సంయమనం పాటించామని, అయినా మళ్లీ అదే పరిస్థితి పునరావృతమైందని అసంతృప్తి వ్యక్తం చేశారు. హైడ్రా కమిషనర్‌ కోర్టు ఆదేశాలను పదేపదే ఉల్లంఘిస్తున్నారని, అవసరమైతే ఆయన్ను సైన్యం అదుపులోకి తీసుకుని ఆర్మీ బ్యారక్స్‌లో ఉంచాలని కూడా ఆదేశించగలమని హెచ్చరించారు.

ఈ దశలో అడ్వకేట్‌ జనరల్‌ ఎ. సుదర్శన్‌రెడ్డి స్వయంగా కోర్టు ముందుకు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వివరణ ఇచ్చారు. వివాదాస్పద స్థలంలోకి హైడ్రా అధికారులు వెళ్లలేదని, ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ భూమిలో జోక్యం చేసుకోరని హామీ ఇచ్చారు. కోర్టు ఆదేశాలను ప్రభుత్వం పూర్తిగా గౌరవిస్తుందని, ఇకపై ఎలాంటి ఉల్లంఘన జరగకుండా వ్యక్తిగతంగా పర్యవేక్షి స్తామని తెలిపారు. ప్రభుత్వ అత్యున్నత న్యాయాధికారి ఇచ్చిన ఈ హామీని పరిగణన లోకి తీసుకున్న న్యాయమూర్తి, అదే విషయా న్ని అఫిడవిట్‌ రూపంలో వెంటనే దాఖలు చేయాలని ఆదేశించారు. అలాగే సైన్యాన్ని మోహరించడం, పది మంది సైనికులను నియమించడం తదితరంగా తాము జారీ చేసిన ఆదేశాల అమలును తాత్కాలికంగా నిలిపివేస్తు న్నట్లు ప్రకటించారు. అఫిడవిట్‌ను పరిశీలించి న తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. అయితే ఇకపై కూడా కోర్టు ఆదేశాల ఉల్లంఘన కొనసాగితే సైన్యం మోహరింపుతో పాటు మరింత కఠిన చర్యలు తీసుకోవడంలో ఏమాత్రం వెనుకాడబోమని హైకోర్టు హెచ్చరించింది. ​

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -