Saturday, July 25, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిభయం వదలి… ఆగ్రహంతో రగిలి…

భయం వదలి… ఆగ్రహంతో రగిలి…

- Advertisement -

చరిత్రలో కొన్ని సమయాలు శరవేగంతో పరుగులు పెడతాయి. మన ప్రజలు ఇంకా ఎందుకు కోపంతో రగిలిపోవడం లేదనే సందేహం చాలామంది భారతీయులలో వుండేది. అధికార వర్గం, చట్టసభలు ఆఖరుకు న్యాయ వ్యవస్థ కూడా కట్టగట్టుకు కలగలసి పోయాయనిపించే… దాదాపు బ్రిటిష్‌ ‌వలస పాలన పునరావృతం అవుతున్నదేమో అనిపించే పరిస్థితులలో… ఈ పరిణామాలు వారికి ఉపశమనం కలిగించుతాయి. స్వాతంత్ర్య పోరాటం, ఆ త్యాగాలు, ప్రజా స్వామ్య, లౌకిక రాజ్యాంగం అన్నీ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. జులై 20న పార్లమెంటుకు నిరసన యాత్ర జరపాలని కాక్రోచ్‌ ‌జనతా పార్టీ (సి.జె.పి) పిలుపునిచ్చింది. అయితే ఆచరణలో అది సంఘటిత ఆకస్మిక విద్యార్థి ఉద్యమాల సంగమంగా మారిపోయి దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మేం ఇదివరకు చెప్పినట్టుగా సైబర్‌ ‌స్పేస్‌‌లో సిజెపి ఉప్పెనలా పెరగడం చాలా మందిని ఆశ్చర్యపరచింది. జాతీయ విద్యా విధానం (ఎన్‌.ఇ.పి) 2020 నుంచి నేరుగా ముందుకొచ్చిన కేంద్రీకృత పరీక్షలు, ప్రవేశాల విధానం వల్ల ఆ పరీక్షలు నేరుగా నేషనల్‌ ‌టెస్టింగ్‌ ఏజన్సీ (ఎన్‌‌.టి.ఎ) ఆధ్వర్యంలోనే రిగ్గింగు చేయబడే పరిస్థితి దాపురించింది. మన మొత్తం విద్యా వ్యవస్థను ఆరెస్సెస్‌ కార్పొరేట్‌ ‌నియంత్రణలోకి అప్పగించే ఒక ముసుగు తప్ప ఎన్‌ఇపి మరేమీ కాదనేది ఇప్పుడు సుస్పష్టం. వినాశకరమైన జాతీయ పరీక్షా విధానం దీన్ని ఒక కొలిక్కి తెచ్చిన చివరి సాధనమైంది. దాని ఫలితంగా వచ్చిన విషమ పరిస్థితులు, ఆశావహులైన విద్యార్థుల బలవంతపు ఆత్మహత్యలు దేశం మనసును వికలం చేశాయి.

ఈ మొత్తం వైఫల్యం ఎంత తీవ్ర ప్రభావం చూపిందంటే చివరకు ప్రభుత్వం, విద్యా మంత్రిత్వశాఖ మళ్లీ పరీక్ష పెట్టడానికి అంగీకరించవలసి వచ్చింది. కానీ ఈ విషయంలో కించిత్తు బాధ్యత కూడా తీసుకున్న దాఖలాలు లేవు. ఈ విషయంలో తర్కబద్దంగా ముందు కొచ్చే కనీస కోర్కెలు విద్యామంత్రి రాజీనామా, ఎన్‌‌టిఎ రద్దు. కానీ కార్పొరేట్‌, ఆరెస్సెస్‌ ‌దుష్ట ద్వయం నరేంద్ర మోడీ సర్కారును సాధనంగా చేసుకొని జవాబుదారీ తనం ఊసే వుండకూడదనేది తమ తాత్వికతగా మార్చాయి. కుట్ర పూరిత నిశ్శబ్దం వహించాయి. మోడీ స్వయంగా పరీక్షలకు పర్యవేక్షణ చేయడం, భారత వైమానిక దళం (ఐ.ఎ.ఎఫ్‌)‌ ద్వారా ప్రశ్నాపత్రాలు పంపపడం వంటి ‌విడ్డూరపు ఆలోచనలు బిగ్గరగా వినిపించాయి.దావానలంలా వ్యాప్తి ప్రశ్నలు వేసిన వారూ నిరసనలు తెల్పిన వారూ అందరూ బొద్దింకలని భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు బహుశా ఇందుకు ఆఖరి ప్రేరణ అయ్యాయి. బొద్దింకల పార్టీ అనే భావన దావానలంలా శరవేగంగా వ్యాపించింది. అందువల్లనే సైబర్‌ ‌స్పేస్‌‌లో సిజెపి వేగంగా వ్యాపించిన తీరు వాస్తవంలో ఎప్పటికీ నిజం కాదని కొందరు భావించారు. అయితే బొద్దింకల పార్టీ అనేది సమిష్టి ఆగ్రహానికి ఒక ప్రతిరూపమనీ, విస్ఫోటనం చెందేందుకు మార్గాల కోసం నిరీక్షిస్తున్నదనీ గుర్తించడంలో వారు విఫలమైనారు. జవాబుదారీ తనాన్ని పున:ప్రతిష్టించడమే దాని లక్ష్యం. అందరికన్నా ఘోరంగా దెబ్బతిన్న భారతీయ యువత ఆగ్రహం ఒక్కసారిగా బద్దలవడం తప్ప మరో గత్యంతరం లేని స్థితికి నెట్టబడ్డారనే దానిపై రెండు అభిప్రాయాలకు అవకాశమే లేదు.

ఉత్తర ప్రదేశ్‌‌లో బిటెక్‌ ‌బంగారు పతక గ్రహీత ప్రభుత్వోద్యోగం కోసం యాభై సార్లు విఫల యత్నాలు చేసిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడని కొద్ది రోజుల కిందట ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ రాసింది. విపరీతంగా పెరిగిపోయిన నిరుద్యోగ సమస్య కారణంగా యువతకు జీవనోపాధి గురించిన ఏ కొద్దిపాటి ఆశను కూడా లేకుండా లాగేస్తున్నది. ఏదైనా పని సంపాదించినవారికి కూడా అసలైన వేతనాలు నిరంతరం హరించుకుపోతున్నాయి. అన్ని రంగాలలో అన్ని స్థాయిలలో చొచ్చుకు వస్తున్న నూతన సాంకేతిక ప్రక్రియలపై ఎలాంటి ప్రభుత్వ జోక్యం లేకపోవడంతో ఆ అరకొర పనులు, తక్కువ స్థాయి ఉద్యోగాలు కూడా లేకుండా పోయే ప్రమాదం వెంటాడుతున్నది.మోసకారి పరీక్షల మాయవిద్యారంగంలో పరిస్థితి కూడా ఇంతే ఘోరంగా తయారైంది. అసలు ప్రవేశ పరీక్షలన్నవే విద్యార్థుల పాలిట పెద్ద మోసంగా తయారై కూర్చున్నాయి. ఇది అసాధారణ సవాలు గనక స్పందన కూడా అలాగే వుంటుంది. దేశంలో సంఘటిత విద్యార్థి యువజన ఉద్యమాలు ఈ సమస్యలపై దీర్ఘ కాలంగా పోరాడుతూనే వస్తున్నాయి. ప్రభుత్వ విధానాలపై సువిశాల ఐక్య ప్రతిఘటనకు అవకాశముందని ఈ సంఘటిత ఉద్యమాల క్రమంలోనే గుర్తించబడింది. కొత్త లేబర్‌ ‌కోడ్‌‌ల కారణంగా కార్మికులలో పెరిగిన అశాంతి ఢిల్లీ చుట్టుపక్కల హఠాత్తుగా నిరసనలు పెల్లుబుకడానికి కారణమైంది.

మొదటి నుంచి కార్మికోద్యమాలు తక్కువగా వున్న చోట్ల కూడా ఎం.జి.ఎన్‌.ఆర్‌‌.ఇ.జి.ఎ కింద వంద రోజుల పని లేకుండా చేయడంపై అసమ్మతి భావన వ్యక్తమైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ విధించిన అన్యాయమైన టారిఫ్‌‌లు, తమ రక్షణ కోసం చర్యలు తీసుకోకుండా కేంద్రం దారుణంగా లొంగిపోవడం రైతాంగంలోనూ అనిశ్చితిని సృష్టించింది.గోడీ మీడియా పాట్లుకార్పొరేట్‌ యాజమాన్యంలోని ‌గోడీ మీడియా అసహ్యకర ధోరణి వల్ల కూడా యువతలో నిస్సహాయత మరింత ముదురు తున్నది. సత్యానంతర వాదం పేరిట అవి మోడీ సర్కారును ఏవో లేనిపోని గొప్పల కథలతో పైకి లేపడానికి తంటాలు పడుతున్నాయి. బీజేపీ దగ్గర పోగు పడిన భారీ డబ్బు నిల్వలతో ఎమ్మెల్యేలు, ఎంపీలు సంతలో పశువుల్లా అమ్ముడు పోవడం వల్ల ప్రజాస్వామ్యం పచ్చి బూటకంగా మార్చివేయ బడటం యవతలో కలవరాన్ని మరింత త్రీవం చేస్తున్నది. కనుక పరిస్థితులు అన్ని హద్దులూ దాటిపోయాయి. ఎన్నో ఏండ్లుగా ప్రశ్నించే హక్కు, విమర్శించే హక్కు, ప్రజాస్వామ్యంలో ప్రాథమిక మైనవని గౌరవిస్తూ వచ్చాం. కానీ ఈ చీకటి కాలాలలో అదే ఒక నిషిద్ధ భావనగా తయారైంది. అందుకే యువజనులు జులై ఇరవైన ఢిల్లీలో అలా చేశారు. వారు భయాన్ని అధిగమించేశారు. వారి చర్యలే వారి తరపున మాట్లాడాయి.

వారి సమిష్టి ధైర్యం ద్యోతకమైంది. వారితో సంభాషణలకు తిరస్క రించడం, దానికి బదులు భయానక హింసాకాండకు దిగడం నెతన్యాహు నేర్పిన పాఠం ఫలితమే. ఢిల్లీలో చూసింది ఏదో చెదురుమదురు సంఘటన కాదు. ఇప్పటికే అది దేశమంతా నిరసనలను రగిలించింది. అంతటా ప్రదర్శనలకు కారణమైంది. అవి కొనసాగ బోతున్నాయి. కనకనే మొదట మొండిగా చర్చలకు నిరాకరించిన ప్రభుత్వం తర్వాత ఏదో చర్చల తంతు లాంటిది నడిపింది.అనూహ్య పరిణామాలుఏమైనా ఎప్పట్లాగే ఏదో కాలం గడిపేయగలిగితే తన తంటాలు తగ్గుతాయన్నది కేంద్ర ప్రభుత్వం అంచనా వేసుకుంటున్నది. కానీ సంఘటనల పరంపర బద్దలవుతున్నది. ఊహించని పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తున్నది. చివరకు వాటికి వారే బాధ్యత తీసుకోవలసి వుంటుంది తప్ప మరెవరూ కాదు. సోనమ్‌ ‌వాంగ్‌ ‌చుక్‌ ‌ అతి ముఖ్యమైన ఆ అంశంపైనే దృష్టి కేంద్రీకరింపజేసేందుకు గౌరవ ప్రదమైన ప్రయత్నాలు చేస్తున్నా పరిస్థితి ఇప్పుడు ఆయన చేయి దాటిపోయిందనీ, సమిష్టి నాయకత్వంలోకి వచ్చేసిందని గుర్తించడం చాలా అవసరం. గోడీ మీడియా కూడా ఏదో కప్పిపుచ్చే కథనాలు వదులుతున్నది.

క్ష్రేత్ర స్థాయిలో ఏం జరిగిందనేది తెలియకుండా కప్పిపుచ్చేందుకు ఎలాంటి కట్టు కథలతో ముందుకు రావచ్చునో వాటికి అంతు పట్టడం లేదు. రాజుగారు బట్టల్లేకుండా దిగంబరంగా వున్నాడనే నిజం ప్రజలు చూడగలుగుతున్నారు. అంతిమంగా ప్రజాస్వామ్యం ఎంతటి ప్రమాదంలోనైనా వుండవచ్చుగాని చచ్చిపోలేదనే నిజం మనం చూడగలగాలి. అది సజీవంగా వుంది. అణచివేసేవారిని ప్రతిఘటిస్తున్నది. ఎవరో అన్నట్టు అసలైన సౌందర్యం వీధుల్లోనే వ్యక్తమవు తున్నది.1968 మే నెలలో ఫ్రాన్స్‌‌లో విద్యార్థులు ఉద్యమించినప్పుడు పుట్టిన మాట ఇది, నాడు ఆ విద్యార్థులు స్తబ్దత నుంచి మేల్కొన్నారు. వియత్నాంలో అధర్మ ఆక్రమణ యుద్ధం కారణంగా విద్యా రంగాన్ని సైనికీకరణ చేస్తున్న తీరును నాడు వారు వెనక్కు కొట్టారు. వీధులూ బజార్లకున్న సత్తా అది. రానున్న రోజుల్లో యువతలో ఆకస్మికంగా పెల్లుబికే శక్తులు, సంఘటితంగా పనిచేస్తున్న వారు కూడా సమన్వయంతో వ్యవహరించాలి. రగిలే ఆగ్రహానికి సరైన దిశా నిర్దేశం చేయాలి. వారి భవిష్యత్‌ ‌కార్యాచరణలూ ప్రయత్నాలతో పాటు…లౌకిక, ప్రజాస్వామిక పార్టీలు వుండనే వుంటాయనడం నిస్సందేహం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -