‘‘తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడు వస్తాడన్నట్టు’’గా పశ్చిమాసియా సంక్షోభం ముదురుతోంది. ఎత్తులకు పై ఎత్తులు వేయటం ప్రతి దేశానికీ వచ్చని ఇప్పటికే ఇరాన్ నిరూపించింది. దురహంకారం, ప్రపంచ పెద్దన్న అనే మదంతో ఉన్న అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 28న ఇజ్రాయిల్‌తో కలసి ఇరాన్‌పై దాడులను ప్రారంభించాడు. జూన్ 17 నుంచి అమల్లోకి వచ్చే విధంగా అరవై రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ కుదిరింది. దానిపై వచ్చిన విమర్శలు లేదా ఇరాన్‌కు అది అనుకూలంగా ఉందన్న పునరాలోచన గావచ్చు. తప్పుడు సాకులతో గత పదమూడు రోజులుగా మరోసారి ఇరాన్‌పై అమెరికా విరుచుకుపడుతోంది. అమెరికాను ఏ మాత్రం నమ్మని ఇరాన్ తన జాగ్రత్తలో తానుంటూ వాషింగ్టన్ దాడులకు ప్రతిగా గల్ఫ్, మధ్య ప్రాచ్యంలోని అమెరికా మిలిటరీ స్థావరాలపై అది కూడా దాడులు చేస్తోంది.ఈ పూర్వ రంగంలో ఎమెన్ గల్ఫ్‌లోని బాబ్ ఎల్ మండాబ్ జలసంధిని సౌదీ అరేబియా నౌకలకు మూసివేస్తున్నట్లు ఎమెన్‌లోని హౌతీ సాయుధ బృందం ప్రకటించింది.
అంతేకాదు తమ ఆదేశాలను ఉల్లంఘించిన రెండు నౌకలపై దాడులు కూడా చేసింది. దీంతో పశ్చిమాసియా సంక్షోభంలో మరో కొత్త అధ్యాయానికి తెరలేచినట్లయింది. ఇరాన్ అణు కేంద్రాలున్నట్లు చెబు తున్న పికాక్స్ పర్వత ప్రాంతాలపై దాడులు చేస్తామని ట్రంప్ తాజాగా ప్రకటించాడు. నిజానికి అతగాడు చెబుతున్న ప్రాంతాలు ఇంతకుముందు కూడా ఉన్నాయి. గతేడాది దాడులు చేసి వాటన్నింటినీ ధ్వంసం చేశామని ప్రకటించాడు. కానీ అలాంటి దేమీ లేదని తరువాత వెల్లడైంది. ఇప్పుడు మరోసారి అదే ప్రకటనలు చేస్తున్నాడు. నిజానికి ఇరాన్ శుద్దిచేసిన యురేనియం ఎక్కదుందో ఎవరికీ అంతుబట్టటం లేదు. ఏమాత్రం ఆనవాలు దొరికినా ఈ పాటికి అమెరికా, ఇజ్రాయిల్ వాటి మీద దాడులు చేసి ఉండేవి. ఇదిలా ఉండగా.. ట్రంప్ వైఖరిని సమర్ధించేవారి సంఖ్య అమెరికాలో ముప్ఫయి శాతానికి పడిపోయినట్టు తాజా సర్వేలు వెల్లడించాయి. అయినప్పటికీ తెగింపును చూస్తుంటే నవంబరు మూడున జరిగే ఎన్నికలలో ఓటర్లకు చెప్పుకొనేందుకు గరిష్టంగా ఇరాన్‌కు నష్టం చేసేందుకు పూనుకున్నట్లు చెప్పవచ్చు. దీనికితోడు హార్ముజ్ జలసంధిపై తమ పెత్తనాన్ని రుద్దాలని కూడా ట్రంప్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు గాను దాడులకు అదనంగా డెబ్భయి బిలియన్ డాలర్లు కావాలని పార్లమెంట్‌ను కోరడం అందులో భాగమే! ఇలాంటి చర్యలతో అమెరికా పౌరులపై మరిన్ని భారాలు మోపుతూ మరింతగా దూరం కావటం అనివార్యం.
ఈ పరిణామం చమురు కంపెనీలకు తప్ప యావత్ ప్రపంచ పౌరులకు నష్టదా యకమే, అయినప్పటికీ అమెరికా వెనక్కు తగ్గటం లేదు.మధ్యధరా సముద్రంతో ఎర్ర సముద్రాన్ని కలుపుతూ దాని ద్వారా హిందూమహా సముద్రంలోకి ఓడలు ప్రవేశిం చేందుకు ఈజిప్టులో తవ్విని సూయజ్ కాలువ 1869 నుంచి రవాణా తీరు తెన్నులనే మార్చివేసింది. అంతకు ముందు ఆఫ్రికాలోని గుడ్‌హోప్ ఆగ్రాన్ని చుట్టి నౌకలు ప్రయాణించేవి. నూట తొంభైమూడు కిలోమీటర్ల పొడవున్న ఈ కాలువ ద్వారా రోజుకు వంద నౌకలు రవాణా సాగించేందుకు విస్తరించారు. లండన్ నుంచి అరేబియా సముద్రంలోకి నౌకలు వచ్చేందుకు దీంతో తొమ్మిదివేల కిలోమీటర్ల దూరం, పది రోజుల ప్రయాణ సమయం తగ్గుతుంది. ఎర్ర సముద్రం- అరేబియా సముద్రాలను కలిపే బాబ్ ఎల్ మండాబ్ జలసంధి చాలా ఇరుకైనది. ఈ ప్రాంతానికి వచ్చే నౌకలను నిలు వరించటానికి, చికాకు పెట్టేందుకు అనువైనదిగా ఉంది. ఎమెన్ అంతర్యుద్దంలో రాజధాని సనా నగరంతో పాటు ఈ జలసంధి ఉన్న కీలక ప్రాంతాలన్నీ హౌతీల ఆధీనంలో ఉన్నాయి. ఈ సాయుధశక్తికి ఇరాన్ సంపూర్ణ మద్దతు ఇస్తున్నది. దీన్ని అణచివేయాలని చూసిన సౌదీ అరేబియా ప్రయత్నాలు ఫలించలేదు. తమపై అనుచితంగా దాడులు కొనసాగిస్తే అవసరమైతే హార్ముజ్ జలసంధితో పాటు బాబ్ ఎల్ మండాబ్ను కూడా మూసివేస్తామని కొద్ది వారాల క్రితం ఇరాన్ హెచ్చరించింది.
హార్ముజ్ జలసంధి దిగ్బంధనంలో భాగంగా ఇరాన్ నౌకలపై దాడి చేస్తే ప్రతి నౌకకు ఒక వంతెన లేదా విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేస్తామని జూలై 22న ట్రంప్ బెదిరించాడు. దాంతో తన మద్దతుదారులైన హౌతీలను ఇరాన్ రంగంలోకి దించిందని చెప్పవచ్చు. అమెరికా కేంద్రీకరణను దెబ్బతీయటమే దీని వెనుక ఉన్న ఎత్తుగడగా కనిపిస్తోంది. అయితే హౌతీలు కూడా అన్ని నౌకలను గాక తమను దెబ్బతీసేందుకు చూస్తున్న సౌదీ అరేబియా మీదనే కేంద్రీకరించారు. ఈ జలసంధి ద్వారా రోజుకు ఐదు మిలియన్ పీపాల చమురును సౌదీ ఎగుమతి చేస్తున్నది. దీనితో పాటు ఐరోపా నుంచి ఆసియాకు జరిగే ఇతర సరకు రవాణా కీలకంగా ఉంది. సౌదీ నుంచి డీజిల్,పెట్రోలు, విమాన ఇంధన ఎగుమతులు కూడా ఈ దాడులతో ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. బాబ్ ఎల్ మండాబ్ జలసంధి సంక్షోభానికి పూర్తి బాధ్యత అమెరికాదే అన్నది నిస్సందేహం. హార్ముజ్ దిగ్బంధనంతో ప్రధానంగా ఆసియా దేశాలు ప్రభావితమైతే ఇప్పుడు అమెరికా, ఐరోపా ఖండం కూడా ప్రతికూల ప్రభావానికిలోను కావటం తప్పదు. అందువలన దాడుల నిలిపివేత, సంక్షోభాన్ని మరింత విస్తరించకుండా చూసేందుకు యావత్ దేశాలు ట్రంప్ మీద ఒత్తిడి తేవాల్సి ఉంది!
ఎత్తుకు పైఎత్తు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



