ప్రతి మూడు నెలలకోసారి సమీక్ష చేయాలి
నిబంధనల కంటే క్రమబద్ధీకరణకే ప్రాధాన్యత: ఉన్నతాధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ట్రాఫిక్ నిర్వహణతోపాటు రోడ్డు భద్రత పర్యవేక్షణకు ప్రత్యేక బ్యూరోను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఉన్నతాధకారులను ఆదేశించారు. ఈ మేరకు సంపూర్ణ అధ్యయనం చేయాలని సూచించారు. కొత్తగా ఏర్పడే బ్యూరో సంస్థాగత నిర్మాణం చేపట్టాలని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో బోధి పెవిలియన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, ఇతర ఉన్నతాధికారులతో ట్రాఫిక్‌పై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి రెండు లేదా మూడు నెలలకోసారి ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించాలని స్పష్టం చేశారు. ట్రాఫిక్ విషయంలో నిబంధనల కంటే క్రమబద్ధీకరణపై ఎక్కువ దృష్టి పెట్టాలని చెప్పారు. వాతావరణ మార్పులు, పనివేళలు, రద్దీ సమయాలు, స్థానిక సంస్కృతిని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. కొత్తగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి ముందే ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు అవసరమైన అధ్యయనం చేయాలని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాలు జరగకుండా నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఔటర్‌పై ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలపకుండా నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నగరంలో సిగ్నల్ ఫ్రీ వ్యవస్థను తీసుకు వచ్చేందుకు అవసరమైనచోట అండర్ పాస్, ఎలివేటెడ్ కారిడార్ లను నిర్మించాలని చెప్పారు. సాధ్యమైనంత వరకు సిగ్నల్స్ దగ్గర ట్రాఫిక్ నిలిచిపోకుండా వాహనాలు మూమెంట్ ఉండేలా చూడాలని చెప్పారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, కె. రామకృష్ణారావు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సీఎంను కలిసిన పలు సంస్థల ప్రతినిధులు
బ్రేక్‌ఫాస్ట్ పథకానికి నిధుల విరాళం
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హరే కృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్, దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్, అరబిందో ఫార్మా లిమిటెడ్ సంస్థల ప్రతినిధులు కలిశారు. దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్, అరబిందో ఫార్మా లిమిటెడ్ సంస్థల తరపున ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ పథకానికి సీఎం సమక్షంలో సీఎస్‌ఆర్ నిధులను ఫౌండేషన్ కు అందజేశారు. అరబిందో ఫార్మా లిమిటెడ్ తరపున రూ.10 కోట్లు, దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ తరపున రూ.12.18 కోట్లు ఇచ్చారు. హరే కృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు ప్రభుత్వం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం అందిస్తున్న సంగతి తెలిసిందే. సెంట్రలైజ్డ్ కిచెన్ లను ఏర్పాటు చేసిన చోట పరిసర ప్రాంతాల రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నదని సీఎం చెప్పారు. అవసరమైన కూరగాయలు, బియ్యం ఇతర సామగ్రిని నేరుగా రైతుల నుంచి తీసుకుంటూ, వారిని ఆర్గానిక్ పంటల వైపు ప్రోత్సహించాలని భావిస్తున్నట్టు సీఎం వెల్లడించారు. నాణ్యమైన విత్తనాలను అందిస్తూ, పంటమార్పిడి విధానాన్ని ప్రోత్సహిస్తే రైతులకు లాభాలు అందించవచ్చని సీఎం స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎస్‌ఆర్ నిధులందించిన సంస్థలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినం దించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహా దారు కె.రామకృష్ణారావు, సీఎం ముఖ్యకార్య దర్శి ఎన్.శ్రీధర్, హరే కృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ సత్య గౌర చంద్ర దాస ప్రభు జీ, దివీస్ లేబొరేటరీస్ లిమిటెడ్ ఉపాధ్యక్షులు మధు బాబు, అరబిందో ఫార్మా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ నిత్యానంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రతకు ప్రత్యేక వ్యవస్థ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



