చట్టం తీసుకొస్తే సరిపోతుంది కదా?
మిగతావెందుకు?
హైడ్రా తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్య
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రెవెన్యూ, పోలీసు, జీహెచ్ఎంసీ, ఇరిగేషన్ సహా అన్ని శాఖల అధికారులు హైడ్రా కమిషనర్ వెంట ఎందుకు వెళ్తున్నారని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని శుక్రవారం తీవ్రంగా ప్రశ్నించింది. రెవెన్యూ చట్టంలోనే ఆక్రమణలను తొలగించే నిబంధనలు ఉన్నప్పుడు ప్రతి అంశంలో హైడ్రాను ఎందుకు రంగంలోకి దింపుతున్నారని నిలదీసింది. ఇలా కొనసాగితే రెవెన్యూ, ఇరిగేషన్ వంటి కీలక చట్టాలు నిరర్థకంగా మారిపోతాయని వ్యాఖ్యానించింది. అలాంటప్పుడు అన్ని చట్టాలను రద్దు చేసి హైడ్రా చట్టం ఒక్కటే తీసుకొస్తే సరిపోతుందేమో అని ఘాటుగా వ్యాఖ్యానించింది. కేవలం ఒక జీవో ఆధారంగా ఏర్పాటైన హైడ్రా వెంట అన్ని శాఖల అధికారులు నడవడం ఆశ్చర్యానికి గురిచేస్తోందని పేర్కొంది.
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి మండలం లోతుకుంట గ్రామంలోని సర్వే నెంబర్లు 1, 2లో ఉన్న 40 ఎకరాల భూమిలో ఈ నెల 17న చేపట్టిన కూల్చివేతలను శాంతా శ్రీరాం కన్ స్ట్రక్షన్ ప్రయివేట్ లిమిటెడ్ సవాల్ చేసింది. ఈ మేరకు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ మరోసారి విచారణ చేపట్టారు. ఒకే అంశానికి సంబంధించి ఇప్పటికే మూడు కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలైనా హైడ్రా తీరు మారలేదని కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణకు పాల్పడిన అధికారి సమర్పించిన అఫిడవిట్లో కనీసం క్షమాపణ కూడా కోరకపోవడం ఆయన అహంకార ధోరణికి నిదర్శనమని వ్యాఖ్యానించింది. విచారణ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి హాజరై పిటిషనర్ల స్థలంలోకి హైడ్రా అధికారులు వెళ్లలేదని, అదే విషయాన్ని అఫిడవిట్లో పేర్కొన్నామని కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి, గత రెండు కోర్టు ధిక్కరణ పిటిషన్లలో ఇచ్చిన హామీలకు విరుద్ధంగా అధికారులు వ్యవహరించారని గుర్తుచేశారు. కోర్టు ధిక్కరణ కేసులో అసలు భూవివాదంపై చర్చ ఉండదని, కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారా లేదా అన్నదే విచారణ అంశమని స్పష్టం చేశారు.
ఆర్మీని రంగంలోకి దింపుతూ గతంలో ఇచ్చిన ఆదేశాలను కేవలం అడ్వొకేట్ జనరల్ అభ్యర్థన మేరకే అమలు చేయకుండా పెండింగ్‌లో ఉంచామని న్యాయమూర్తి వెల్లడించారు. హైడ్రా కమిషనర్ సమర్పించిన అఫిడవిట్‌ను పూర్తిగా పరిశీలించిన తర్వాత ఆ ఉత్తర్వుల అమలుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పిటిషనర్ల భూమికి సంబంధించిన రిట్ పిటిషన్లు, అప్పీలు, సివిల్ సూట్లు, మొదటి కోర్టు ధిక్కరణ పిటిషన్లలో హైడ్రా ప్రతివాదిగా కూడా లేదని, అలాంటి పరిస్థితిలో రెండో కోర్టు ధిక్కరణ పిటిషన్లో అన్నీ తన పరిధిలోనే ఉన్నట్టుగా వ్యవహరించడం న్యాయపాలనలో జోక్యం చేసుకోవడమేనని వ్యాఖ్యానించారు.
కోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా వ్యవహరించడం హైకోర్టు చరిత్రలోనే కనీవినీ ఎరుగని పరిణామమని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. తక్కువ సమయంలో కౌంటర్ సమర్పించామని, తర్వాత పూర్తి కౌంటర్ దాఖలు చేస్తామని హైడ్రా పేర్కొనడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ దశలో కోర్టు ధిక్కరణ జరిగిందా లేదా అన్నదే ముఖ్యమని స్పష్టం చేశారు. కోర్టు ధిక్కరణకు పాల్పడిన వ్యక్తి కనీస మర్యాదగా క్షమాపణ చెప్పకపోవడం గమనార్హమని, ఇది మొండి వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు. గతంలో పిటిషనర్ల స్థలంలో జోక్యం చేసుకోబోమని హామీ ఇచ్చిన తర్వాత కూడా అక్కడికి ఎందుకు వెళ్లారని, నిర్మాణాలను కూల్చివేయాలని ఎవరు ఆదేశించారని హైడ్రా అధికారులను ప్రశ్నించారు. కోర్టులు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత వాటిని తప్పనిసరిగా అమలు చేయాల్సిందేనని, వాటిని ధిక్కరించి ఏ అధికారంతో నిర్మాణాలను కూల్చివేశారని నిలదీశారు. ఈ నెల 20న జరిగిన పరిణామాల గురించి ఇప్పుడు ప్రశ్నించడం లేదని, ఈ నెల 18న జరిగిన కోర్టు ధిక్కరణ అంశంపైనే వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఒక శాఖ నుంచి లేఖ వస్తే వెంటనే పదుల సంఖ్యలో వాహనాలు, జేసీబీలు, పోలీసు బలగాలతో వెళ్లిపోవడం ఏ అధికార పరిధిలో జరుగుతోందని కూడా కోర్టు ప్రశ్నించింది. పోలీసులను, ప్రభుత్వ వాహనాలను ఎప్పుడు వినియోగించాలో కూడా తెలియదా అని నిలదీసింది. ప్రజల్లో భయాందోళనలు సృష్టించడానికే ఇలాంటి చర్యలేమో అన్న సందేహం వ్యక్తం చేసింది. నగరంలో చేయాల్సిన పనులు అనేకం ఉన్నప్పటికీ ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకోవడం వెనుక ఉద్దేశమేమిటని ప్రశ్నించింది. చెరువుల పరిరక్షణ అవసరమే అయినప్పటికీ చట్టపరమైన విధానాలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.
గత ఉత్తర్వుల్లో పేర్కొన్నట్టే హైడ్రా అధికారులు చట్టానికి అతీతులు కారని, కోర్టు పరిధిలోనే పనిచేయాల్సి ఉంటుందని న్యాయమూర్తి గుర్తుచేశారు. కోర్టు ధిక్కరణకు పాల్పడిన అధికారిని ఉపేక్షిస్తే చట్టం ముందు అందరూ సమానమే అన్న సూత్రం దెబ్బతింటుందని, న్యాయస్థానాల గౌరవానికి భంగం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అడ్వొకేట్ జనరల్ విజ్ఞప్తిని గౌరవించి మాత్రమే ఇప్పటి వరకు సంయమనం పాటించామని, లేదంటే అధికారిని అదుపులోకి తీసుకునే పరిస్థితి వచ్చేదని స్పష్టం చేశారు. ఇకపై పిటిషనర్ల స్థలంలో ఎలాంటి జోక్యం చేసుకోబోమని హామీ ఇవ్వడంతో పాటు హైడ్రా కమిషనర్ తప్పనిసరిగా క్షమాపణ చెప్పాలని తేల్చిచెప్పారు. ఈ నెల 23న ఆర్మీని రంగంలోకి దింపాలని జారీ చేసిన ఉత్తర్వులు రికార్డుల్లో ఉన్నాయని, హైడ్రా కమిషనర్ 27న దాఖలు చేసే అఫిడవిట్‌ను పరిశీలించిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని పేర్కొంటూ విచారణను ఈ నెల 27కు వాయిదా వేశారు.
రైస్‌మిల్లర్ల వివాదాన్ని మీడియేషన్‌తో పరిష్కరించండి : హైకోర్టు
2022–23 రబీ సీజన్లో అప్పగించిన ధాన్యానికి క్వింటాలుకు రూ.2,236.81 చెల్లించాలని జారీ చేసిన డిమాండ్ నోటీసులపై తలెత్తిన వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించే అవకాశాన్ని పరిశీలించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రైస్‌మిల్లర్లు, ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదం మీడియేషన్ ద్వారా పరిష్కారమైతే ఇరు పక్షాలకు సమయం, న్యాయ వ్యయం రెండూ ఆదా అవుతాయని అభిప్రాయపడింది. ప్రభుత్వ నిర్ణయం తెలియజేయాలని సూచిస్తూ విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. మే 8న జారీ చేసిన జీవో నంబర్ 7తో పాటు దాని ఆధారంగా 2022–23 రబీ సీజన్‌కు సంబంధించిన ధాన్యానికి క్వింటాలుకు రూ.2,236.81 చెల్లించాలని జారీ చేసిన డిమాండ్ నోటీసులను సవాలు చేస్తూ రైస్‌మిల్లర్లు దాఖలు చేసిన వందకు పైగా పిటిషన్లపై జస్టిస్ నగేశ్ భీమపాక విచారణ చేపట్టారు. ధాన్యం నిల్వతో నాణ్యత తగ్గడం, గోదాముల అద్దెలు, నిల్వ వ్యయాలు, అన్లోడింగ్ ఛార్జీలు వంటి అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని పిటిషనర్ల వాదన. మీడియేషన్‌కు అవకాశం ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి కూడా మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కారమైతే దీర్ఘకాలిక వివాదానికి ముగింపు లభిస్తుందని, ఇరుపక్షాల సంబంధాలు కూడా మెరుగుపడతాయని అభిప్రాయపడ్డారు. ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అభిప్రాయం తెలియజేస్తామని అడ్వొకేట్ జనరల్ ఎ. సుదర్శన్‌రెడ్డి కోర్టుకు తెలియజేయడంతో విచారణను ఈ నెల 27కు వాయిదా వేశారు.
పార్కు జాగాలో నిర్మాణాలు ఆపండి : హైకోర్టు
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని సువర్ణవ్యాలీ ఆర్టీసీ కాలనీలో పార్కు కోసం కేటాయించిన స్థలంలో చేపడుతున్న అక్రమ నిర్మాణాలను తక్షణమే నిలిపి వేయాలని హైకోర్టు మున్సిపల్ అధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాల అమలుపై పూర్తి నివేదిక సమర్పించాలని సూచిస్తూ కేసు విచారణను ఆగస్టు 7కు వాయిదా వేసింది.పార్కు స్థలంలో ప్రయివేటు వ్యక్తులు నిర్మాణాలు చేపడుతున్నప్పటికీ ఫిర్యాదులు చేసినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ ఎం.చంద్రశేఖర్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బి. విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రజల వినియోగానికి కేటాయించిన పార్కు స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు కొనసాగిస్తున్నారని, పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు పరిశీలించిన న్యాయమూర్తి అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అలాగే ప్రయివేటు వ్యక్తులతో పాటు సంబంధిత ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఆగస్టు 7కు వాయిదా వేశారు.
హైడ్రా అధికారాలు ఏమిటి?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



