బకాసురునికీ ఓ రోజొస్తుంది, నరకాసురుడికీ ఓ రోజొస్తుంది, షేక్స్‌పియర్ రాసిన మేక్బెత్‌కు కూడా ఓ రోజొస్తుంది. ఎలా? రాజును చంపి సింహాసనమెక్కాలనుకున్న మేక్బెత్‌కు అది నాటకం కాబట్టి మూడు భూతాలు కనిపిస్తాయి. అవి అక్కాచెల్లెళ్లు. ఒకటి నువ్వు చిన్న రాజ్యానికి రాజువౌతావంటుంది. రెండోది చక్రవర్తివౌతావంటుంది. పక్కనున్న బిర్నాం అడవి నడిచొచ్చినప్పుడు ఇప్పుడున్న చక్రవర్తి వారసులు నిన్ను చంపుతారని ఇంకో భూతం చెబుతుంది. మొదటిది జరుగుతుంది. రాజవుతాడు. భార్య ప్రేరణతో మేక్బెత్ నిజంగానే చక్రవర్తిని చంపుతాడు. అతని వారసులు పారిపోతారు. తానే చక్రవర్తినని ప్రకటించుకుంటాడు. ఇంకెన్నో హత్యలు చేస్తాడు అధికారం కాపాడుకోవడంకోసం. ఐనా బిర్నాం అడవి నడిచెలా వస్తుందన్న ధీమాతో ఉంటాడు. పాపం పండినరోజు అదీ జరుగుతుంది. చక్రవర్తి వారసులు సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని చెట్టు కొమ్మలు నరికి వాటిని పట్టుకొని నడిచొస్తారు. నిజంగానే అడవి నడిచొచ్చినట్టు కనిపిస్తుంది మనవాడికి. అంతే అంతం సమీపించిందని సగం నీరుకారిపోతాడు. తరువాత నాటకం ఎలా ముగియాలో అలా ముగుస్తుంది.
ఎవరికైనా ఓరోజొస్తుందన్నది అసత్యమేమీ కాదు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపినాడన్న ప్రశ్న రెండోభాగం దాగా వేచిచూడవలసి వచ్చింది. అలాగే మొదటిభాగం బాగా నడుస్తుంది కదా అనుకుంటే రెండోభాగం వచ్చి తీరుతుంది మేక్బెత్ కథలాగా. మధ్యలో కథ సాగుతూ ఉంటుంది. ఇదంతా అధికారంకోసం పాకులాడేవాళ్లకు మాత్రమే కాదు వాళ్లకు ఊడిగం చేస్తున్న మీడియాకు కూడా వర్తిస్తుందని మొన్న ‘నీట్’ విషయంలో కాక్రోచులు చేసిన పోరాటంలో వాళ్లను తిట్టిన తిట్లు వింటే ఎవరికైనా తెలిసిపోతుంది. మీడియాను నిలదీసేలా వేసిన ప్రశ్నలను చూస్తే తెలిసిపోతుంది. ఇన్నిరోజులు ముసుగులో గుద్దులాటలాగా సాగుతున్న వాళ్ల ముసుగు లాగి బయటపడేశాయి బొద్దింకలు. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేటుగా చెప్పుకునే మీడియా తనపాత్ర తాను నిర్వహించడం మానేసి పుష్కరకాలమైందని అందరూ ఆరోపిస్తున్నారు. ఎప్పుడైనా ప్రభుత్వాలకు అనుకూలంగా రాసే పత్రికలు స్వతంత్రం సిద్ధించిననాటినుండీ ఉన్నాయి. కొన్ని పార్టీలపైన దుష్ప్రచారాలు చేసిన పత్రికలను, మనుషులను కూడా ఈ దేశం చూసింది. అయితే ఇప్పుడది శ్రుతిమించి రాగాన పడిందని పోరాటకారులు మండిపడ్డారు. వారి మండిపాటులో అర్థముంది. వారి కోపంలో కారణముంది. వారి కడుపుమంటకు సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ చూసిన మీడియా కంగుతినింది.
ప్రొఫెషనల్ ఎథిక్స్ అంటూ కొన్ని ఉంటాయి, అంటే వృత్తిపరమైన నీతి అన్నమాట. ఏ వృత్తిలో ఉన్నవారు వాటిని పాటించాలి. హిపోక్రటిక్ ప్రమాణం చేసేసి వైద్యులు, పదవీ స్వీకార ప్రమాణ స్వీకారం చేసేసి మంత్రులు, ఇంకా ఇంజనీర్లు, ఆడిటర్లు ఇలా ఎందరో తమతమ వృత్తులు ప్రారంభిస్తారు. కొంతమంది తరువాత ఏమేమి చేస్తారో అందరికీ తెలుసు. ఈ ఫోర్త్ ఎస్టేట్, మీడియా మిత్రులకు కూడా కొన్ని నీతినియమాలుంటాయి. వాళ్లు ప్రజలపక్షం వహించాలి నిజంగా. కానీ ప్రజలెన్నుకున్నవాళ్లమని చెప్పుకునే వాళ్ల తరపున గట్టిగా నిలబడి ఇప్పుడు గట్టిదెబ్బ తిన్నారు. అదీ విషయం. అంతేకాక ఏ పార్టీకి సంబంధించిన మీడియా ఆ పార్టీకున్నప్పుడు ఎవరి ఎథిక్స్ వాళ్లకుంటాయి అధ్యక్షా అంటే చేయగలిగిందేమీ లేదు మరి. మీకు మా పోరాటాలు కనబడలేదా వాటన్నింటినీ ఫిల్టర్ చేసి ప్రభుత్వ అనుకూల వార్తలు రాయడానికి మనసెలా ఒప్పిందని సూటిగా ప్రశ్నించారు. గోడీ మీడియా, దలాల్ మీడియా అంటూ విరుచుకుపడ్డారు. మరీ ఇంత బానిసలుగా వ్యవహరించొద్దని సలహాలూ వచ్చాయి.
ఇకనైనా మీ రూటు మార్చుకొని మా పోరాటాల గురించి, ప్రజాగ్రహాల గురించి రాయకపోతే మీ మనుగడ ఉండదన్న రీతిలో హెచ్చరికలు వచ్చాయి. ఫోర్త్‌ఎస్టేట్ పోయి రియల్ ఎస్టేట్‌వారిలా ప్రవర్తిస్తున్నవాళ్లు ఇప్పుడు కంగు తినవలసి వచ్చింది. ఇకనైనా మేలుకొని జాగ్రత్తపడకపోతే తమ మనుగడ ప్రశ్నార్ధకమవుతుందని భయపడ్డారు కూడా. ఇక మేలుకోవలసిన సమయం వచ్చిందని అర్థమైపోయింది. వార్తాసేకరులు, పోరాటాలు జరిగేచోట వార్తలు షూట్ చేసిపంపేవాళ్లు మేము ఉన్నది ఉన్నట్టు పంపుతున్నాము అవన్నీ పైననే ఒడకట్టి ప్రచురించడం, ప్రసారం చేయడం చేస్తున్నారన్న నిజాన్ని బయటపెట్టేశారు. ఇప్పుడు కుడితిలో పడ్డ ఈగలాగా పరిస్థితి మారింది యాజమాన్యాలది. ఇక మారవలసిన సమయం ఆసన్నమయింది. బిర్నాం అడవి బొద్దింకల రూపంలో నడిచొస్తోంది. తస్మాత్ జాగ్రత్త అన్న సంకేతాలు అందుతున్నాయి. ప్రభుత్వం దిగొచ్చేలా ఒక అడగైతే పడింది. చూద్దాం ఏమి జరగనుందో? బొద్దింకలు దేశ భవిష్యత్తును ఎలా మార్చనున్నాయో మరి….. నాలుగు స్తంభాలనూ వాళ్లూ మారుస్తారని ఆశిద్దాం.
జంధ్యాల రఘుబాబు 9849753298



