అప్పటికే పరిస్థితులు చేదాటిపోయాయి. ఊరు పొలిమేర దాటి రెండు కిలోమీటర్లు పొయిర్రో లేదో ఇద్దరి శరీరాలు చల్లబడ్డాయి.ఉలుకు లేదు, పలుకు లేదు.
అలీసాబ్, పర్వీన్ ల దుఃఖానికి అంతులేదు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం మనుషుల ప్రాణాలు తీసేదాక ఊరుకోదని అలీసాబ్ కు అర్థమయింది.
కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి.తను చేసిన పనిని తలుచుకొని పశ్చాత్తాపబడ్డాడు. కానీ జరగాల్సిందంత జరిగిపోయింది.
రవి వాళ్ళ అమ్మ, నాన్నలు “వద్దురా మనకి ప్రేమలు, దోమల అంటే వినకపోతివి. ఇయ్యాళ శవంలా మారిపోతివి” అంటూ రోదిస్తున్నరు.
పండుగకని పిలిసి పొట్టన బెట్టుకున్నవు కదరా!నీకు పిల్లలున్నరు. ఆ దేవుడే జూత్తడురా అని దుమ్మెత్తిపోత్తున్నరు.
ఎవ్వరూ అలీసాబ్ ముఖం చూడడానికి ఇష్ట పడడంలేదు. కుటుంబసభ్యులు భయంతో దూరం దూరం ఉంటున్నరు.
చెల్లెలి అంత్యక్రియలు అయ్యాక పోలీసులు తీసుకపోయిర్రు.
చాలా కాలం జైలు జీవితాన్ని గడిపి ఇంటికొచ్చాడు. తన పనేదో తాను చూసుకుంటూ ఉంటున్నాడు.మారిపోయాడు.
అయినా అలీసాబ్ అంటే ఉండే భయం పోలేదు.
ఊరివాళ్ళకయినా, కుటుంబ సభ్యులకయినా ద్వేషించడం మొదలుపెడితే ప్రతీ మనిషిలో తప్పులే కనిపిస్తాయి.
కులాన్ని, మతాన్ని పక్కకుబెట్టి మనిషిని మాత్రమే ప్రేమిస్తే, ప్రేమ తప్ప ఏదీ కనబడదు. ద్వేషమే అలీసాబ్ ను ఇక్కడిదాకా పట్టుకొచ్చింది.
ఈ విషయాలన్నీ తెలిసిన నుస్రత్ కాలేజీకి వచ్చేటప్పుడు, పోయేటప్పుడు భయం భయంగానే ఉండేది. ఇంటిదగ్గర సైకిలెక్కితే కాలేజికెళ్ళేదాకా తల ఎత్తేది కాదు.
నేను టైలర్ కొట్టు దగ్గర కూర్చుని ఆమె కోసమే తపించిపోయేవాడిని. ఆమెతో మాట్లాడటం మాట దేవుడెరుగు కానీ ఒక్క చూపు చూస్తే చాలు అదే పదివేలు అనుకునే వాడిని.
“చూపుల మధ్య యుద్ధం జరిగినప్పుడు ఇద్దరిలో ఏ ఒక్కరు గెలిచినా ప్రేమ విజయం సాధిస్తుంది. ఇద్దరికీ ఇద్దరు ఓడితే మాత్రం చూపులల్లో శూన్యం తప్ప ఇంకేమి కానరాదు.”
ఆ విజయం సాధించే చూపు కోసమే నేను వేచి చూస్తున్నాను.కొన్ని రోజులు గడిచాయి. ఆమె చూపు కాదు కదా!
కనీసం అక్కడో షాపుందని కూడా ఆమె గుర్తించటం లేదు.
నా ముఖం నిండా పగిలిన ఎడారి దారులు. చిరునవ్వు కరువయి వెలవెలబోతుంది.
ఆమె చూపు కోసమే నా అన్వేషణ. నా నిరీక్షణ.ఒక్క చూపుకెంత విలువుందో ఆ క్షణాల్లో అర్థమయింది.
ఆమె నా వైపు చూసే చూపు ముందు ఎన్ని వజ్రాల కాంతులయినా దిగదుడుపే!
రోజూ ఆలోచనలు పెరిగిపోతున్నాయి. మనసంతా ఒకటే గుబులు.తన ధ్యానంలోనే సమయం గడుస్తుంది. నాకంటూ ప్రత్యేకమైన సమయమేదీ లేదు.
అంతా ఆమె సమయమే. కాలం నాకక్కర్లేదు. సెకనులు, నిమిషాలు, గంటలు అన్నీ అవతల విసిరి పారేశాను. నా శ్వాసంతా ఆమె ప్రేమకోసమే పోగు చేశాను.
ఆ పోగులోంచి ఒక ఉచ్ఛ్వాసయినా, ఒక నిశ్వాసయినా ఆమెను తాకపోదా అని. పొద్దునలేస్తే నా డ్యూటీ ఆ టైలర్ కొట్టు దగ్గర కూర్చోవడమే.
ఆమెను వస్తున్నప్పుడు, పోతున్నప్పుడు గమనించటమే. దగ్గరికెళ్ళి మాట్లాడేంత ధైర్యం లేని కాలమది.
కొన్ని ప్రేమలు మాటలతోనే ఆగిపోయేవి. కొన్ని ప్రేమలు చూపులతోనే ఆగిపోయేవి. కొన్ని ప్రేమలకు చిరునామాయే ఉండకపోయేది.
ఒక్కో క్షణం, ఒక్కో వేదన.పుడుతూ చావాలి, చస్తూ పుట్టాలి.
ఆ రోజుల్లో ప్రేమంటే. ఇప్పుడేముంది నూడుల్స్ వేసుకొని తిన్నట్టే. రెడిమేడ్ ప్రేమ.
చివరికొకరోజు గాలి నన్ను కరుణించింది. గాలితాకిడికి పైకెగసిన కురులను సవరించుకుంటూ వాటి మధ్యలోంచి నన్ను చూసింది.
ఆ చూపు నన్నో మిసైల్ లా తాకింది.
అంతే వేగంతో నా చూపు ” చర్యకు ప్రతిచర్య” చేసింది. కొంత అలజడి సృష్టించింది.
మరుసటి రోజు గాలి సహాయం అవసరం పడలేదు. కొద్దిగా ఓర చూపొకటి నా వైపు పడవేసింది. ఆ చూపుతో ఎన్నో కోటలను జయించిన రాజులా నాలో ఏదో బిల్డప్.
ఇక ఆ చూపు ముక్కలు ముక్కలుగా అతికి సమయాన్ని పెంచుకుంది. రోజు నన్ను ఫోటోలు తీసి పెద్ద ఆల్బమే తయారు చేసినట్టు నాకర్థమవుతుంది.
ఆ క్లిక్ మన్న శబ్దం ఇన్ని సంవత్సరాలకయినా మరిచిపోను. నా జీవితోనే అది కూడా పోతుంది కావచ్చు.
ఇక రోజు తాను నన్ను గమనించటం, నేను ఆమెను చూడకుండా ఉండలేకపోవడం ఓ నిత్యకృత్యంగా మారిపోయింది.
ఇంకొద్ది రోజులకు ఆమె టైలర్ కొట్టు దగ్గరికొచ్చేసరికి సైకిల్ ను నడిపిస్తూ వెళ్ళేది. ఆ టైలర్ కొట్టు సమీపంలోనే పంచర్ షాపుండేది. అవసరమున్నా లేకున్న గాలి కొట్టించేది.
అక్కడ గాలి కొట్టిస్తూ నా వైపే చూసేది. నేను ఆమె వైపు చూసేవాన్ని. ఆ చూపులు, ఆ ప్రేమ ఎన్ని కోట్లిస్తే దక్కుతుంది. నిర్మలం, నిష్కల్మషం, అమరం, అఖిలం ఆ ప్రేమ.
దాచిపెట్టినట్లుండే ప్రేమ బూడిద కప్పిన వజ్రం లాంటిది. దానికి చిరునవ్వు పూలు పూస్తే చాలు. మిలియన్ల కాంతి పుంజాలు బయటికొస్తాయి.
– డా. తండ హరీష్



