తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు
నీట్ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో చోటుచేసుకున్న పేపర్ లీకేజీలు, అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత సాధించిన సుదీర్ఘ పోరాటానికి దక్కిన చారిత్రాత్మక విజయమని మండల కేంద్రమైన తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థి సంఘాలు చేపట్టిన నిరంతర ఆందోళనలు, యువత అలుపెరగని పోరాట ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు.
పేపర్ లీకేజీల వెనుక ఉన్న అసలు సూత్రధారులను, మాఫియాను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, కేవలం మంత్రి రాజీనామాతోనే వ్యవహారాన్ని ముగించరాదని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీల కారణంగా పరీక్షలు రద్దు కావడంతో తీవ్ర మనోవేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి చొప్పున నష్టపరిహారం అందించాలని కోరారు. అలాగే, జూలై 20న ఢిల్లీలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులు, యువతపై పోలీసులు జరిపిన లాఠీచార్జ్‌ను తీవ్రంగా ఖండిస్తూ, బాధ్యులైన పోలీసు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ప్రభుత్వ నియామక, ప్రవేశ పరీక్షల్లో పేపర్ లీకేజీలు జరగకుండా పార్లమెంట్లో కఠిన చట్టం తీసుకురావడంతో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని ఆయన సూచించారు.



