స్వాతంత్య్రం అనంతరం దేశంలో భూమిలేని పేదలకు భూమి అందించాలనే మహత్తర సంకల్పంతో ప్రారంభమైన భూదాన్ ఉద్యమం అనేక కుటుంబాలకు ఆశాకిరణంగా నిలిచింది. కానీ కాలక్రమేణా ఆ భూములపై వివాదాలు, ఆక్రమణలు, పరిపాలనా నిర్లక్ష్యం పెరిగి భూదాన్ ఉద్యమ లక్ష్యాలనే ప్రశ్నించే పరిస్థితి ఏర్పడుతోంది. ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో భూదాన్ భూముల వివాదం కూడా అలాంటి ఆందోళనకర ఉదాహరణగా నిలుస్తోంది. రెవిన్యూ రికార్డుల ప్రకారం వెలుగుమట్ల భూదాన్ భూములు సర్వే నంబర్ 147లో 21 ఎకరాలు, 148లో 21 ఎకరాలు, 149లో 20 ఎకరాలు 7 గుంటలు కలిపి మొత్తం 62 ఎకరాలు 7 గుంటలుగా నమోదై ఉన్నాయి. అయితే ఇటీవల మంత్రుల సమక్షంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా కలెక్టర్ కేవలం 32 ఎకరాలు 7 గుంటల గురించి మాత్రమే ప్రస్తావించడం ఆశ్చర్యానికి గురిచేసింది. మిగిలిన దాదాపు 30 ఎకరాల గురించి ఒక్కమాట కూడా ప్రస్తావించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇది సాధారణ పరిపాలనా పొరపాటా? లేక భూదాన్ భూములపై జరిగిన ఆక్రమణలను కప్పిపుచ్చే ప్రయత్నమా? అనే ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమవుతున్నాయి.
ఇదే సమయంలో ప్రభుత్వం తాము పేదల పక్షమని పదేపదే ప్రకటిస్తోంది. అయితే పేదల పక్షాన నిలిచే ప్రభుత్వం ముందస్తు నోటీసులు లేకుండా బుల్డోజర్లతో ఇండ్లను కూల్చి, పోలీసు బలగాలతో వారిని రోడ్డున పడేయడం ఎలా సమర్థించుకోగలదు? ఒక మంత్రి చేసిన వ్యాఖ్యలు ఈ చర్యలపై మరింత సందేహాలను కలిగిస్తున్నాయి. కొంతమంది అక్రమంగా ఇండ్లు నిర్మించుకున్నారని చెప్పి అందరి ఇండ్లను కూల్చాల్సి వచ్చిందని చెప్పడం సాధారణ న్యాయబద్ధతకు విరుద్ధంగా కనిపిస్తోంది.ఈ ప్రాంతంలో కొందరు అక్రమ నిర్మాణాలు చేశారని చెప్పి మొత్తం 800 ఇండ్లను కూల్చివేసి, అందులో సుమారు 410 మందికి మాత్రమే 75 గజాల చొప్పున పత్రాలు ఇవ్వడం సమస్యకు పరిష్కారంగా ఎలా పరిగణించగలం? ఇదే విధానం నగరాల్లో కూడా అమలు చేస్తారా? కొన్ని అక్రమ నిర్మాణాల పేరుతో మొత్తం కాలనీలను కూల్చివేయడం న్యాయసమ్మత చర్య కాదు. ఇది పరిపాలనా అసమర్థతకు నిదర్శనమో, లేక పేదలను ఆ ప్రాంతం నుంచి తరలించే ప్రణాళికలో భాగమో అన్న అనుమానం కలుగుతోంది.
భూముల విలువ పెరుగుతున్న ఈ కాలంలో పేదలు నివసిస్తున్న ప్రాంతాలు రియల్ ఎస్టేట్ దృష్టిని ఆకర్షించడం కొత్త విషయం కాదు. అలాంటి పరిస్థితుల్లో అధికారాన్ని ఉపయోగించి పేదలను తొలగించి ఆ భూములను వాణిజ్య ప్రయోజనాలకు వినియోగించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు తరచూ వినిపిస్తుంటాయి. వెలుగుమట్ల ఘటన కూడా అలాంటి అనుమానాలకు కారణమవుతోంది.ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే, ఇండ్లు కూల్చిన తర్వాత అనేక రోజులు గడిచిన తరువాత మాత్రమే ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది. ఇప్పటివరకు ఒక్క మంత్రి కూడా బాధితులను పరామర్శించకపోవడం విచారకరం. కొన్ని ప్రజా సంఘాలు ముందునుంచి బాధితుల పక్షాన నిలబడి పోరాడుతుంటే, వారిపై బురదచల్లి వారిని అక్రమదారులుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం బాధాకరం. పౌరసమాజ ప్రతినిధులు, కొన్నిమీడియా ఛానల్స్ ఈ సమస్యను వెలుగులోకి తీసుకురాకపోయి ఉంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజల ఒత్తిడి పెరగడంతోనే ప్రభుత్వం వివరణలు ఇచ్చి, పట్టాలివ్వాల్సిన పరిస్థితి ఉత్పన్నమైనట్టు కనిపిస్తోంది.
అయితే సమస్య ఇక్కడితో ముగిసిందని చెప్పడం తగదు. మొత్తం భూదాన్ భూములపై సమగ్ర సర్వే నిర్వహించి స్పష్టమైన హద్దులు నిర్ణయించి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి. గతంలో అక్కడ నివసించిన వారితో పాటు భూమిలేని పేదలందరికీ పారదర్శకంగా భూమి పంపిణీ చేయాలి. ప్రభుత్వ చర్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న కుటుంబాలకు తగిన నష్టపరిహారం ఇవ్వడం కూడా అవసరం.అదే సమయంలో చట్టవిరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై, బాధ్యత వహించాల్సిన ప్రజాప్రతినిధులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. కూల్చివేసిన ఇండ్లను ప్రభుత్వ ఖర్చుతో కాకుండా బాధ్యత వహించాల్సిన వారి ఖర్చుతోనే నిర్మించాలి. ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుత పరిపాలన అంటే తప్పులను అంగీకరించడం, వాటిని సరిదిద్దడం. తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నం ప్రజల విశ్వాసాన్ని మరింత దెబ్బతీస్తుంది.
వెలుగుమట్ల ఘటన మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని చెబుతోంది-పేదల హక్కులను కాపాడే వ్యవస్థలు బలంగా ఉండాలి. భూదాన్ వంటి గొప్ప ఉద్యమాల లక్ష్యాలు నిజంగా నెరవేరాలంటే పరిపాలన పారదర్శకంగా, బాధ్యతాయుతంగా ఉండాలి. రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న భూదాన్ భూములను పరిరక్షించి, నిజమైన లబ్ధిదారులైన భూమిలేని పేదలకు పారదర్శకంగా పంపిణీ చేయాలి. అప్పుడే భూదాన్ ఉద్యమం తన అసలు లక్ష్యాన్ని చేరుకుంటుంది.
– సయ్యద్ రఫీ, 9966025325
వెలుగుమట్ల వెనుక చీకట్లు!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



