అమలుకు నోచని 2011 లైసెన్స్డ్ కల్టివేటర్ చట్టం
సాగుపై ఆశతో యజమానులకు
ముందే సొమ్ము చెల్లించిన కౌలు రైతులు
వారి సంక్షేమం కోసం కానరాని ప్రభుత్వ సంక్షేమ పథకాలు
పంట రుణాల్లేవు…రుణమాఫీ లేదు..అన్నీ ప్రయివేటు అప్పులే
అడుగడుగునా దోపిడీ…ఆదుకొనే నాధుడేడి?
తక్షణం ప్రభుత్వం స్పందించాలి-సీపీఐ(ఎం)
ప్రకృతి విపత్తు ఎప్పుడొచ్చినా మొదట నష్టపోయేది కౌలు రైతులే. వాతావరణం అనుకూలించి ఆశించిన స్థాయిలో దిగుబడి వస్తేనే ఊరట. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో సాగు ప్రశ్నార్ధకమైంది. వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న కౌలు రైతులు కుదేలయ్యారు. ఏటేటా వ్యవసాయంలో లాభాలు తగ్గుతున్నా కౌలు రేట్లు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. గుర్తింపు లేని కారణంగా ప్రభుత్వ పథకాలేవీ కౌలు రైతులకు అందట్లేదు. యూరియా కొనాలన్నా… పంట అమ్మాలన్నా ఓటీపీ తిప్పలు. బ్యాంకుల్లో పంట రుణాలివ్వకపోవడంతో ప్రయివేటు అప్పుల ఊబిలోకి నెట్టబడుతున్నారు. ప్రకృతి విపత్తు కారణంగా పంట నష్టపోతే కనీసం పరిహారం దక్కట్లేదు. ఆత్మహత్య చేసుకునే రైతుల్లో 80 శాతం కౌలుదారులే. 36 నుంచి 40 శాతం వరకు ఉన్న కౌలు రైతుల్ని పాలకులు విస్మరిస్తున్నారు. వాస్తవ సాగుదారుల్ని గుర్తించి ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, పరిహారం, పంట రుణాలు, రైతు భరోసా, రుణమాఫీ, మద్దతు ధరలు వర్తించేలా 2011 లైసెన్స్డ్ కల్టివేటర్ చట్టాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఎండమావిగా మారింది. కౌలుదారులకు గుర్తింపు కార్డులిచ్చి ప్రభుత్వ పథకాలన్నీ వర్తింప చేయాలని రైతు సంఘాలు, వ్యవసాయ విశ్లేషకులు కోరుతున్నారు.
నవతెలంగాణ-మహబూబ్ నగర్ ప్రాంతీయ ప్రతినిధి
వ్యవసాయంలో కీలక భూమిక పోషిస్తున్న కౌలు రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు. వాస్తవ సాగుదారులు కౌలు రైతులే అయినా గుర్తింపులేక ఏలాంటి ప్రభుత్వ పథకాలకూ నోచుకోవట్లేదు. రాష్ట్రంలో రైతు భరోసా పథకం కింద లబ్ధిపొందుతున్న మొత్తం రైతుల సంఖ్య 63 లక్షల నుంచి 70 లక్షల వరకు ఉంది. వారిలో కౌలు రైతులు దాదాపు 36 నుంచి 40 శాతం వరకు ఉంటారని రైతు సంఘాల అంచనా. ఆ మేరకు రాష్ట్రంలో 25 లక్షలపైగా కౌలు రైతులున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 6.34 లక్షల మంది రైతు భరోసా పొందుతున్నారు. మొత్తం రైతుల్లో కనీసం 36 శాతం లెక్కన చూసినా 2.16 లక్షల మంది కౌలు రైతులు సుమారు 5 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు.
వర్షాధారమే దిక్కు
వర్షాలు సంమృద్ధిగా కురిసి పంటలు భాగా పండినప్పుడే కౌలు రైతులకు వ్యవసాయం గిట్టుబాటు కావడం చాలా కష్టం. రాష్ర్టంలో ఎల్‌నినో ప్రభావంతో ఇప్పటి వరకు వర్షాల్లేకపోవడంతో ఈ ఏడాది అప్పుల పాలవుతామనే ఆందోళన వారిని వెంటాడుతోంది. ఉమ్మడి మహబూబ్‌గర్ జిల్లాలో 70 శాతం వర్షాధారం మీదనే పంటలు సాగు చేస్తున్నారు. ప్రధానంగా 45 శాతం భూముల్ని కౌలు రైతులే సాగు చేస్తారు. గద్వాల జిల్లాలో 56 వేల మంది కౌలు రైతులు రెండు లక్షల 25వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో అత్యధికంగా విత్తనపత్తిని సాగు చేస్తారు. జూన్ కంటే రెండు నెలల ముందే దుక్కులను తడిపి వ్యవసాయాధార పంటలుగా సాగుచేస్తారు. కౌలు రైతులు భూ యజమానులకు ఎకరాకు రూ.25 వేలు ఇచ్చి లీజుకు తీసుకుంటారు. కంపెనీ ఏజెన్సీలు, ప్రకృతి వైపరీత్యాల మధ్య కౌలు రైతులు విలవిల్లాడుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో గద్వాల జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో లక్షా 25 వేల ఎకరాలు, వనపర్తి జిల్లాలో 75వేల ఎకరాలు, నారాయణపేటలో లక్షా 10 వేల ఎకరాలు, మహబూబ్‌నగర్ జిల్లాలో 75వేల ఎకరాలను లీజుకు తీసుకొని కౌలు రైతులు పంటల్ని సాగు చేస్తున్నారు. వర్షాధారంగా సాగయ్యే పంటలు ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో 20 శాతానికి మించి భూముల్లో విత్తనాలు వేయలేదు. వేసిన విత్తనాలు సైతం వర్షాభావం వల్ల పెరగడం లేదు. దీంతో కౌలు రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ముందే కౌలు చెల్లించడం వల్ల భూ యజమానులు కౌలుదారులిచ్చిన సొమ్మును తిరిగి ఇచ్చే అవకాశంలేదు.
గుర్తింపులేక అందని ప్రభుత్వ పథకాలు
రైతు సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్నాయి. రైతును ఆదుకోవాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. అయితే 40 శాతం ఉన్న కౌలు రైతుల సంక్షేమాన్ని మాత్రం గాలికి వదిలేశారు. కనీస గుర్తింపులేని కారణంగా ఏ ఒక్క ప్రభుత్వ పథకాన్ని పొందలేకపోతున్నారు. వ్యవసాయ పెట్టుబడుల కోసం ప్రయివేటు అప్పులు చేసి తీవ్రంగా నష్టపోతున్నారు. గుర్తింపులేని కారణంగా బ్యాంకర్లు పంట రుణాలివ్వట్లేదు. దీంతో రుణమాఫీ పథకం ద్వారా లబ్దిపొందలేకపోతున్నారు. పండించిన పంటల్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలంటే పట్టాదారు పాసుబుక్, ఆధార్ లింకేజీ, ఓటీపీ వంటి నిబంధనలు ఉండడంతో కౌలు రైతులు మద్దతు ధరలు పొందలేకపోతున్నారు. బహిరంగ మార్కెట్లో తక్కువ ధరలకు విక్రయించి తీవ్రంగా నష్టపోతున్నారు. ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, సీసీఐ కేంద్రాల్లో పత్తి, మార్క్‌ఫెడ్ సెంటర్లలో చిరుధాన్యాలు, మక్కలు విక్రయించాలంటే పట్టాదారులకే అవకాశముంది. ఎల్‌నినోతో పాటు వరదలు, అకాల వర్షాలు, వడగళ్ల వానలొస్తే పంట నష్టం తప్పదు. కౌలుదారులకు పరిహారం ఇవ్వట్లేదు. యాప్ ఆధారిత యూరియా పంపిణీ విధానంతో కౌలు రైతులు సబ్సిడీ యూరియా, ఇతర ఎరువుల్ని పొందలేకపోతున్నారు. బ్లాక్ మార్కెట్లో బస్తా యూరియాను రూ.500 పెట్టి కొనుగోలు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకునే రైతుల్లో కౌలుదారులు 80 శాతం ఉంటున్నారని అనేక నివేదికలు చెబుతున్నాయి. గుర్తింపు లేని కారణంగా ఎక్స్‌గ్రేషియా కూడా పొందలేని దుస్థితి.
పెరిగిన కౌలు రేట్లు
ఈ ఎడాది కౌలు రైతులు అధిక మొత్తం చెల్లించి భూములను లీజుకు తీసుకోవాల్సి వచ్చింది. భూ యజమానులు రేట్లు పెంచారు. అయినా వర్షాలు బాగా కురిస్తే పత్తి, మక్కలు ఇతర పంటలు పండించి మంచి దిగుబడులు సాధించి ఆర్థికంగా బలపడాలని ఆశపడ్డారు. కానీ ఎల్‌నినో ప్రభావం కౌలు రైతుల ఆశలపై నీళ్లుచల్లింది. ఇంకా భూమిలో విత్తనం వేయలేదు. వేసిన విత్తనం మొలకెత్తలేదు. అయినా కౌలు రుసుము ముందే చెల్లించారు. యజమానులు తిరిగి ఇచ్చే అవకాశంలేదు. పెట్టుబడుల భారాలకు తోడుగా కౌలురేట్లు పెరగడంతో కౌలు రైతులు మరింత నష్టపోతున్నారు. రాష్ట్రంలో ఎకరాలకు రూ.10 వేల నుంచి రూ.30 వేల వరకు కౌలు చెల్లిస్తున్న పరిస్థితి ఉంది.
గుర్తింపు కరువు
2011 లైసెన్స్డ్ కల్టివేటర్స్ చట్టం ప్రకారం అప్పట్లో కౌలు రైతుల్ని గుర్తించి కార్డులు జారీ చేశారు. గుర్తింపు కార్డులున్న రైతులకు బ్యాంకుల్లో పంటరుణాలు, ఇతర ప్రభుత్వ పథకాల్ని వర్తింప చేశారు. అధికారంలోకి వస్తే 2011 కౌలు రైతుల చట్టాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు. చట్టానికి కొన్ని సవరణలు చేసైనా అమలు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
సహాకారం మాకేది
దేశముని రాములు, భూత్పూర్ ,మహబూబ్‌నగర్ జిల్లా భూస్వాముల దగ్గర భూములు లీజుకు తీసుకొని పంటలు సాగు చేస్తున్నాం. ప్రకృతి వైపరీత్యాలు వస్తే ప్రభుత్వ సహకారం భూస్వాములకే ఇస్తారు. నష్టపరిహారం సాగుదారులైన మాకే ఇవ్వాలి.
కౌలు రైతులను గుర్తించి ఆదుకోవాలి వెంకటస్వామి, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి గద్వాల
రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించాలి. పథకాలను వర్తింపజేసి ఆదుకోవాలి. ప్రకృతి వైపరీత్యాలు వస్తే రైతుల కంటే కౌలు రైతులు అధికంగా నష్టపోతారు. అందుకే కౌలు రైతుల కోసం ఒక విధానాన్ని తీసుకురావాలి. గుర్తింపు కార్డులిచ్చి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలయ్యేలా చూడాలి.
ప్రభుత్వ నిబంధనల మేరకే సహకారం
రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఇచ్చే ఆర్థిక సహాయం ఏదైనా నిబంధనల మేరకు రైతులకు అందుతుంది. అందరికీ సమానంగా సబ్సిడీలు, పంట రుణాలు, రైతు భరోసా తదితర పథకాలు అందుతాయి.
చంద్రశేఖర్, డీఏఓ నాగర్ కర్నూల్



