స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
కేంద్ర మాజీ మంత్రి ‘స్ఫూర్తి స్థల్’
నవతెలంగాణ-సిటీ బ్యూరో
గొప్ప దార్శనికుడు, కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి తెలంగాణ సాధనలో చేసిన ప్రత్యేక కృషి వెలకట్టలేనిదని రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. రాజకీయాలకతీతంగా అభివృద్ధే లక్ష్యంగా ఆయన గణనీయమైన సేవలు అందించారని, ఆయన చూపిన మార్గం, అందించిన సేవలు అనితర సాధ్యమని చెప్పారు. జైపాల్ రెడ్డి ఏడో వర్ధంతి సందర్భంగా మంగళవారం హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ‘స్ఫూర్తి స్థల్’ వద్ద మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, తదితరులతో స్పీకర్ కలిసి పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. జైపాల్ రెడ్డి ఆజాత శత్రువని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధిలో ఆయన పాత్ర మరువలేనిదని గుర్తుచేశారు. దక్షిణ భారతదేశం నుంచి ‘ఉత్తమ పార్లమెంటేరియన్’ అవార్డు పొందడం మనందరికీ గర్వకారణమన్నారు. ఎంపీగా, రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా ఎన్నో సేవలు అందించారని తెలిపారు. హైదరాబాద్ మెట్రో రైల్, అండర్ గ్రౌండ్ డ్రయినేజీ (యూజీడీ) ప్రాజెక్టుల పురోగతికి ఎంతో కృషి చేశారన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు తెచ్చారని కొనియాడారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. జైపాల్ రెడ్డి ప్రజాసేవకు నిలువెత్తు సాక్ష్యమని, రాష్ట్ర అవతరణలో ఆయన పాత్ర అత్యంత కీలకమైనదని చెప్పారు. విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి కేంద్ర మంత్రి వరకు దేశానికి, తెలంగాణకు ఆయన విలువైన సేవలు అందించారని కొనియాడారు. విలువలకు ప్రాధాన్యత ఇచ్చే జైపాల్ రెడ్డితో 15వ లోక్‌సభలో కలిసి పనిచేసే అవకాశం లభించడం తన అదృష్టమని, ఆయన అనుభవాలు, పాఠాలు అందరికీ ఆదర్శనీయమని అన్నారు.
నివాళులర్పించిన ప్రముఖులు
మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ప్రభుత్వ సలహాదారులు వి.హనుమంతరావు, సుదర్శన్ రెడ్డి, ఫైనాన్స్ కమిషన్ చైర్మెన్ సిరిసిల్ల రాజయ్య, రైతు కమిషన్ చైర్మెన్ కోదండ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చెన్నారెడ్డి, శాసనసభ్యులు నవీన్ యాదవ్, నారాయణరెడ్డి, మాజీ మంత్రులు జానారెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, మాజీ శాసనమండలి చైర్మెన్ నేతి విద్యాసాగర్, సుప్రీంకోర్టు విశ్రాంత జడ్జి సుదర్శన్ రెడ్డి, మాజీ శాసనసభ్యులు భాస్కరరావు, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, వివిధ కార్పొరేషన్ల చైర్మెన్‌లు, నగర పురప్రముఖులు పాల్గొని ‘స్ఫూర్తి స్థల్’ వద్దమంత్రులు, ప్రముఖుల ఘనంగా నివాళులర్పించారు.
తెలంగాణ సాధనలో జైపాల్ రెడ్డిది ప్రత్యేక కృషి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



