– సిట్రస్ పంటల అభివృద్ధికి చేసిన సేవలకు గుర్తింపు
– నాగపూర్ లో కేంద్ర సిట్రస్ పరిశోధాన సంస్థ 42వ ఆవిర్భావ దినోత్సవం
– వైస్ చాన్సలర్ డాక్టర్ శరద్ ఆర్. గడఖ్ చేతుల మీదుగా సన్మానం
నవతెలంగాణ – హైదరాబాద్ : కుంకుడు రైతుగా దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన నల్లగొండ జిల్లాకు చెందిన ఆదర్శ రైతు లోకసాని పద్మారెడ్డికి మరో అరుదైన గౌరవం దక్కింది. నల్లగొండ జిల్లా, దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని చందంపేట మండలం పోలేపల్లికి చెందిన రైతు పద్మారెడ్డి తన వ్యవసాయ భూమిలో కుంకుడుతో పాటు నలభై ఏళ్లుగా బత్తాయి సాగు చేస్తున్నారు.
ఐసీఏఆర్ – కేంద్ర సిట్రస్ పరిశోధనా సంస్థ, నాగ్‌పూర్ యొక్క 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, భారతదేశంలో సిట్రస్ (నిమ్మజాతి పంటలు) రంగ అభివృద్ధి కోసం శ్రమించిన రైతులను సన్మానించాలని సంస్థ తీసుకున్న నిర్ణయంలో భాగంగా పద్మారెడ్డి సిట్రస్ పంటల సాగులో అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ నాగపూర్ లోని ఐకార్ కేంద్రంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో సన్మానించింది.
మహారాష్ట్ర అకోలాలోని డాక్టర్ పంజాబ్రావ్ దేశ్‌ముఖ్ కృషి విద్యాపీఠ్ (పిడికెవి) వైస్ చాన్సలర్ డాక్టర్ శరద్ ఆర్. గడఖ్ చేతుల మీదుగా సన్మానించి ప్రశంసా పత్రం అందించారు. డాక్టర్. వి. ఎన్. వాఘ్‌మారే డైరెక్టర్, ఐసీఏఆర్–సీఐసీఆర్, డాక్టర్. ఎన్. జి. పాటిల్ డైరెక్టర్, ఐసీఏఆర్–ఎన్‌బీఎస్‌ఎస్ & ఎల్‌యూపీ, డాక్టర్ దిలీప్ ఘోష్ డైరెక్టర్, ఐసీఏఆర్–కేంద్ర సిట్రస్ పరిశోధనా సంస్థ (సిసిఆర్ఐ) పద్మారెడ్డిని సన్మానించిన వారిలో ఉన్నారు. ఆర్గానిక్ రైతు లోకసాని పద్మారెడ్డి అటవీ పంట అయిన కుంకుడును సాగుచేయడమే కాకుండా కుంకుడు ఉత్పత్తులతో విలువ ఆధారిత వస్తువులతో ఆదాయం పొందుతున్నారు. దేశంలోని వివిధ రకాలైన బత్తాయి రకాలను కూడా సాగు చేస్తున్నారు.
ఆయన క్షేత్రంలో 40 ఏళ్ల బత్తాయి తోట కూడా ఉంది. ఇది దేశంలో ఒక రికార్డు. కుంకుడు, బత్తాయి మాత్రమే కాకుండా సేంద్రియ పద్దతిలో జామ, కొబ్బరి, ఉసిరి, మామిడి వంటి తోటలను కూడా సాగు చేస్తున్నారు. కేవలం గో ఆధారిత విధానంలో పద్మారెడ్డి వరి కూడా సాగు చేస్తున్నారు. గో ఆధారిత వ్యవసాయంలో భాగంగా గడిచిన పాతికేళ్లుగా పేడ స్లర్రీ ని తన ఎరువుగా వినియోగిస్తున్నారు. పద్మారెడ్డి ప్రస్తుతం రంగాపూర్ వేరుమూలం పై సాత్ గుడి, జంబేరి వేరుమూలం పై సాత్ గుడి, సిసిఆర్ఐ నాగపూర్ వారి న్యూసెల్లార్ గోల్డ్ బత్తాయి రకం, మహారాష్ట్ర వారి కాటోల్ గోల్డ్ , జైన్ సీడ్ లెస్ బ్రేజిలియన్ ఆరంజ్, మాల్టా జఫా, బారి మాల్టా, వియత్నాం ఆల్ సీజన్ మాల్టా .. వంటి బత్తాయి రకాలు సాగు చేస్తున్నారు. పద్మారెడ్డి సిట్రస్ సాగులో చేసిన సేవలను గుర్తించి జాతీయ సంస్థ సన్మానించడంతో జిల్లాలోని బత్తాయి రైతులు, బంధు మిత్రులు అభినందనలు తెలిపారు.



