Wednesday, July 29, 2026
E-PAPER
Homeఖమ్మంఆగస్టు 10న జైల్ భరోను జయప్రదం చేయండి

ఆగస్టు 10న జైల్ భరోను జయప్రదం చేయండి

- Advertisement -

– కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటానికి పిలుపు
– ఏఐకేఎస్, సీఐటీయూ ,ఏఐఏడబ్ల్యూయూ సంఘాల సంయుక్త సమావేశం 
– పాల్గొన్న నాయకులు పుల్లయ్య, బ్రహ్మ చారి,రేపాకుల శ్రీనివాస్ లు
అశ్వారావుపేట – అశ్వారావుపేట 

కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల, రైతు – కార్మిక – ప్రజా వ్యతిరేక విధానాల నుంచి దేశాన్ని కాపాడి, ప్రజల హక్కులను రక్షించుకోవడానికి సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐకేఎస్, సీఐటీయూ, ఏఐఏడబ్ల్యూయూ నాయకులు పిలుపునిచ్చారు. ఆగస్టు 10 న నిర్వహించే ‘జైల్ భరో’ కార్యక్రమంలో రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 10న తలపెట్టిన జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అశ్వారావుపేట ప్రజా సంఘాల కార్యాలయం సుందరయ్య భవన్లో బుధవారం మండల స్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. సీపీఐ(ఎం) మండల కమిటీ కార్యదర్శివర్గ సభ్యుడు ముల్లగిరి గంగరాజు, సీతమ్మ ల అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కొక్కెరపాటి పుల్లయ్య, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కె. బ్రహ్మాచారి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాసరావు పాల్గొని ప్రసంగించారు.

నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ధరల పెరుగుదల, నిరుద్యోగ సమస్యలను అదుపు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. భూములు, గనులు, అడవులు, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే వారిని దేశద్రోహులుగా ముద్రవేస్తూ, సోషల్ మీడియా ద్వారా ట్రోలింగ్ చేయించడం ద్వారా ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు.

ఢిల్లీ రైతు ఉద్యమం, నోయిడా కార్మిక ఉద్యమం, నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై జరిగిన నిరసనలు ప్రజా పోరాటాల శక్తిని చాటిచెప్పాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం ముందు నిర్బంధం, నిరంకుశత్వం నిలబడలేవని, ప్రజా ఉద్యమాలే చివరికి విజయాన్ని సాధిస్తాయని అన్నారు.

ఈ సందర్భంగా లేబర్ కోడ్‌ ల రద్దు, పంటలకు గిట్టుబాటు ధరకు చట్టబద్ధ హామీ, కనీస వేతనం రూ.26 వేలకు పెంపు, ఉపాధి హామీ చట్టాన్ని బలోపేతం చేయడం, నూతన విద్యుత్ చట్టం రద్దు, స్కీమ్ వర్కర్లను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించడం, అటవీ హక్కుల చట్టం, గిరిజన హక్కుల చట్టాలను సమర్థవంతంగా అమలు చేయడం వంటి డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. 

కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చిరంజీవి, గిరిజన సంఘం జిల్లా నాయకుడు సోడెం ప్రసాద్, మడిపల్లి వెంకటేశ్వరరావు, సీతారామయ్య, సూరిబాబు, జోగారావు, వెంకటప్పయ్య, బూదేవమ్మ, వెంకటరమణ, వాణి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -