– డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ ఆదేశాలు
నవతెలంగాణ – కామారెడ్డి
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ కామారెడ్డి జిల్లా పర్యటన సందర్భంగా జిల్లాలో అమలవుతున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పురోగతిపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో బుధవారం సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీలు) వైద్యాధికారులతో జూమ్ సమావేశం నిర్వహించి, ఆరోగ్య కార్యక్రమాల అమలు, లక్ష్యాల సాధన, సేవల నాణ్యత, ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై విస్తృతంగా సమీక్షించారు.
సమీక్షలో జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం (ఎన్‌టీఈపీ), అసంక్రమిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమం (ఎన్‌పీ-ఎన్‌సీడీ), తల్లి-శిశు ఆరోగ్య కార్యక్రమం, సార్వత్రిక టీకా కార్యక్రమం, వెక్టర్ ద్వారా వ్యాపించే వ్యాధుల నియంత్రణ కార్యక్రమం, కుటుంబ నియంత్రణ, జాతీయ అంధత్వ నివారణ, జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమం, జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం, వృద్ధుల ఆరోగ్య కార్యక్రమం, కుష్ఠు, ఫైలేరియా నియంత్రణ కార్యక్రమాల పురోగతిని పరిశీలించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఆరోగ్య కార్యక్రమంలో నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని, ప్రభుత్వ ఆరోగ్య సంస్థల ద్వారా ప్రజలకు నాణ్యమైన, సకాలంలో సమగ్ర వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గర్భిణుల నమోదు, సంస్థాగత ప్రసవాలు, పూర్తి టీకాల కవరేజ్, అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్, క్షయవ్యాధి కేసుల త్వరిత గుర్తింపు, డెంగ్యూ, మలేరియా నివారణ చర్యలు, హెచ్‌ఎంఐఎస్ నివేదికల సమర్పణ, ఫీల్డ్ మానిటరింగ్, ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. అనంతరం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. జె. వెంకటి జిల్లా ప్రోగ్రాం అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో డైరెక్టర్ ఇచ్చిన సూచనలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని, అన్ని ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాల పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తూ సేవల నాణ్యతను మరింత మెరుగుపరచాలని సూచించారు.
ప్రతి ప్రోగ్రాం అధికారి తమ కార్యక్రమాల పురోగతి, సాధించిన విజయాలు, ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కార చర్యలను వివరించారు. పెండింగ్ అంశాలను తక్షణమే పూర్తి చేసి, క్షేత్రస్థాయి పర్యవేక్షణను బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు ప్రభుత్వ ఆరోగ్య సేవలు పూర్తిస్థాయిలో అందేలా సమన్వయంతో పనిచేయాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. జె. వెంకటి, జిల్లా ప్రోగ్రాం అధికారులు, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



