హోదాను అనుభవిస్తున్న భర్త..
దీనికి ఎమ్మెల్యే, కలెక్టరే సాక్ష్యం..
ప్రజా పాలనలో మహిళ లకు ఇచ్చే గౌరవం ఇదేనా.!
నవతెలంగాణ-అచ్చంపేట
రాజకీయంగా కొన్ని నామినేటెడ్ పదవులు మహిళలకు కేటాయిస్తున్నప్పటికి వారి భర్తలు అనుభవిస్తున్నారు. పదవులు భార్యలకే వస్తున్నప్పటికీ, అధికారిక సమావేశాలకు హాజరవడం, నిర్ణయాలు తీసుకోవడం వంటి పెత్తనం అంతా వారి భర్తలే చూస్తున్నారు. అధికారిక హోదా భార్యలది అయినప్పటికీ వారు నామమాత్రపు సంతకాలకే పరిమితం అవుతున్నారు. ప్రభుత్వ సమావేశాలకు హాజరవడం, శిలాఫలకాలపై పేర్లు వేయించుకోవడం, అభివృద్ధి పనులను శాసించడం భర్తలే చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సమావేశంలో ఆమె హోదాలో ఆమెనే పాల్గొనాలి. భర్తలు సమావేశాలలో పాల్గొనకూడదని, ఇలాంటి అనధికారిక జోక్యాన్ని నివారించడానికి ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ గ్రౌండ్ స్థాయిలో పరిస్థితి మరువకుండా కొనసాగుతోంది.
అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ చెర్మన్ గా అంతటి రజితను నియమించారు. కానీ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆమె భర్త అంతటి మల్లేష్ మార్కెట్ చెర్మన్ గా వ్యవహరిస్తున్నారు. చలామణి అవుతున్నారు. అధికారిక సమావేశాలలో ఆమె హోదాలో ఆయన దర్జాగా కుర్చీలో కూర్చుంటున్నారు. అధికారులు ఏమి చేయలేకపోతున్నారు. వంగూర్ మండలంలో జరిగిన విత్తన మేళా సమావేశంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎమ్మెల్యే వంశీ కృష్ణ లతో పాటు మార్కెట్ చెర్మన్ హోదాలో అంతటి మల్లేష్ వేదిక పైన కుర్చీలో కూర్చున్నారు. కలెక్టర్, ఎమ్మెల్యే సాక్షి గా ప్రభుత్వ నిబంధనలు చట్ట విరుద్ధంగా ఆయన కూర్చున్నారు. ప్రజా పాలనలో మహిళకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ఈ విషయం పై ప్రతిపక్షం నాయకులు తీవ్రంగా మండిపడున్నారు.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధం: నరసింహ గౌడ్ మాజీ మున్సిపల్ చైర్మన్
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏ పార్టీ రాజకీయంలో ఉన్నప్పటికీ మహిళలకు కేటాయించిన హోదాలో వాలే పాల్గొనాలి. కానీ ప్రజా పాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ పాలనలో మహిళలకు కేటాయించిన హోదాలో వారి భర్తలు అధికారిక సమావేశాలలో పాల్గొంటున్నారు. ఈ విషయాన్ని అధికారులు ఏమీ చేయలేకపోతున్నారు.



