నవతెలంగాణ – మల్హర్ రావు
గత రెండు రోజులుగా మండలంలో కురుస్తున్న వర్షాలతో పత్తి, నారుమడులు, నాటు వేసిన పొలాలు, నాటుకు సిద్ధంగా ఉన్న దుక్కులకు జీవం పోసినట్లుగా కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్షానికి ముందు పత్తి మొక్కలు వాడిపోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. చిన్నచిన్న కుంటలు, చెరువులు, వాగుల్లో చుక్క నీరు లేక వెలవెలబోయాయి. మంగళ, బుధవారం కురిసిన వర్షంతో మండలంలోని తిగలవాగు, అరేవాగు, మానేరు ఉప్పొంగాయి. చిన్నతరహా ప్రాజెక్టులైన కాపురం చెరువు, బొగ్గులవాగు ప్రాజెక్టుల్లోకి నీరు చేరింది. మొన్నటి వరకు నెర్రెలు బారిన చెరువులు, కుంటల్లో నీరు చేరడంతో ఆయకట్టు సన్నచిన్న కారు రైతుల్లో సాగుకు ఆశలు చిగురించాయి.
నెలమట్టమైన చెట్లు, కరెంట్ స్తంభాలు..
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో తాడిచెర్ల భారీ చింతచెట్టు నెలమట్టమై విద్యుత్ స్తంభాలపై పడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పాత ఇండ్లు, ఇంటి గోడలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అంతర్గత రోడ్లన్నీ బురదమయంగా మారాయి. డ్రైనేజీలు, మురికి కాల్వలు రోడ్లపై పారాయి. వర్షాలు కారణంగా మత్స్యకారులతోపాటు, ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
నిలిచిన బొగ్గు ఉత్పత్తి..
రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మండల కేంద్రమైన తాడిచర్ల ఓసిపిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మైన్లో వర్షపు నీరు చేరడంతో పనులు నిలిచిపోయి 18 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 2 లక్షల 40 వేల క్యూబిక్ మీటర్ల ఓబీ తొలగింపు పనులకు ఆటంకం కలిగిందని ఏఎమ్మార్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, కేఎస్ఎన్ మూర్తి,మైన్ మేనేజర్ శ్రీనివాస్ పేర్కొన్నారు.



