మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
దశలవారీగా ప్రతి కుటుంబానికీ మంజూరు
రూ.21వేల కోట్లతో రైతన్నపై రుణభారం తగ్గించాం
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
ఖమ్మం రూరల్ మండలంలో రూ.7.21 కోట్ల రోడ్డు పనులకు శంకుస్థాపన
నవతెలంగాణ-ఖమ్మం రూరల్
ప్రజా ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటనూ తూచా తప్పకుండా అమలు చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రజల ఆశీస్సులతో ఏర్పడిన తమ ప్రభుత్వం.. సంక్షేమం, అభివృద్ధిని రెండు కండ్లుగా భావిస్తూ ముందుకు సాగుతోందన్నారు. బుధవారం ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండల పరిధిలో రూ.7.21 కోట్ల వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. డాక్యా తండాలో రూ.1.41 కోట్లతో మంగళగూడెం–డాక్యా తండా రోడ్డు, పల్లెగూడెంలో రూ.5.80 కోట్లతో గొల్లగూడెం నుంచి ఎన్ఎస్‌పీ మీదుగా పల్లెగూడెం వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి మాట్లాడారు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. రైతు భరోసా ద్వారా ప్రతి ఎకరానికి రూ.6 వేల చొప్పున కేవలం 9 రోజుల్లోనే రూ.9,200 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. రూ.2 లక్షల వరకు ఉన్న రుణమాఫీ ద్వారా 25 లక్షల మంది రైతులకు రూ.21,000 కోట్ల మేర ఆర్థిక భారం తగ్గించామని తెలిపారు. సన్న వరిధాన్యానికి మద్దతు ధరతో పాటు అదనంగా రూ.500 బోనస్ అందిస్తున్నామని తెలిపారు. నాలుగు విడతల్లో నిరుపేదల సొంతింటి కలను నిజం చేయడమే ఇందిరమ్మ ఇండ్ల పథకం లక్ష్యమని స్పష్టం చేశారు. తొలి విడతలో 4.50 లక్షలు, రెండో విడతలో రూ.2.50 లక్షలతో కలిపి ఇప్పటివరకు మొత్తం రూ.7 లక్షల ఇండ్లను మంజూరు చేసినట్టు వెల్లడించారు. రెండో విడతలో మిగిలిన గ్రామాలకు త్వరలోనే ఇండ్లు మంజూరు చేస్తామని, రాబోయే మూడో, నాలుగోవ విడతల్లో అర్హులైన ప్రతి కుటుంబానికి దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని తెలిపారు. అర్హులైన కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తున్నామని, కొత్త రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టామని అన్నారు. గ్రామీణ రహదారులు, విద్యాసంస్థలు, తాగునీరు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి ఆగిపోకుం డా ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. ఈ కార్యక్ర మాల్లో ఏదులాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ పోకబత్తిని అనిత, ఖమ్మం ఆర్‌డీవో ఎన్.శ్రీనివాస్, హౌజింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, పీఆర్ ఈఈ మహేష్‌బాబు, పలువురు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



