నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ విద్యాశాఖను పూర్తిగా నిరాశపర్చిందని పీఆర్టీయూ తెలంగాణ విమర్శించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి రత్నాకర్‌రావు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యాశాఖకు 15 శాతం నిధులు కేటాయిస్తామని మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ రాష్ట్ర బడ్జెట్‌లో నామమాత్రంగా 8.2 శాతం నిధులను మాత్రమే కేటాయించి విద్యాశాఖను పట్టించుకోలేదని పేర్కొన్నారు.
ప్రభుత్వం నియమించిన విద్యా కమిషన్ సూచించిన మేరకు 18 శాతం నిధులను కూడా కేటాయించకపోవడం విద్యాశాఖపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తెలియజేస్తున్నదని వివరించారు. అధికారంలోకి వచ్చిన ఆర్నెల్లలోనే పీఆర్సీని అమలు చేస్తామని కాంగ్రెస్ చెప్పిందని తెలిపారు. రెండున్నరేండ్లయినా అమలు చేయకపోవడం ఉద్యోగ, ఉపాధ్యాయులను పూర్తిగా నిరాశపర్చిందని పేర్కొన్నారు. పెండింగ్ డీఏల విడుదల లేదనీ, పీఆర్సీకి నిధుల కేటాయింపు లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి విద్యాశాఖకు కనీసం 15 శాతం నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు.
విద్యాశాఖను నిరాశపర్చిన బడ్జెట్ : పీఆర్టీయూ తెలంగాణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



